Read more!

నేడే సమ్మక్క రాక!

 

 

 

నేడే సమ్మక్క రాక!


 

భర్త మరణం తరువాత రాజ్యం పరువుని నిలిపేందుకు, యుద్ధంలోకి దిగిన ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తరచూ చెప్పుకుంటాము. అంతకు వందల ఏళ్లకు పూర్వమే అలాంటి పోరుకు సిద్ధపడిన సమ్మక్కది కూడా వీరచరితమే! సమ్మక్క భక్తుల మనసులో ఒక దేవతే కావచ్చు. కానీ క్లిష్ట పరిస్థితులలో ఒక మనిషి ఎంతటి తెగువని చూపాలో దాన్ని ఆచరించి ఆదర్శంగా నిలిచింది సమ్మక్క. అందుకే మేడారం మీదకి సైన్యాన్ని పంపి సమ్మక్క చావుకి కారణమైన ప్రతాపరుద్రుడు కూడా, తరువాత రోజులలలో ఆమెకు భక్తుడయ్యాడని చెబుతారు. అప్పటి నుంచి ఏటికేడు మేడారానికి పెరుగుతున్న భక్తుల సంఖ్యే ఆమె పట్ల ప్రజలకి ఉన్న విశ్వాసాన్ని తెలియచేస్తుంది. ప్రస్తుతం సమ్మక్క జాతరకి దాదాపు కోటిమందికి పైగా భక్తులు వస్తారని ఒక అంచనా. సంఖ్యనిబట్టి చూస్తే, ప్రపంచంలోనే ఇది అతి పెద్ద గిరిజన జాతరగా పేర్కొనవచ్చు.


    నాలుగురోజులపాటు జరిగే సమ్మక్కసారక్క జాతరలో మొదటిరోజున సమ్మక్క కూతురైన సారలమ్మ ప్రతిరూపాన్ని దగ్గరలోని కన్నెపల్లి నుంచి తీసుకువస్తారు. ఇక రెండో రోజు (నేడు) సారక్కని చిలుకలగుట్ట నుంచి తీసుకుని వచ్చి మేడారం గద్దె మీద ప్రతిష్టించడంతో ఉత్సవం పతాక స్థాయిని చేరుకుంటుంది. అసలు సారక్కను తీసుకురావడమే ఓ సంబరంగా సాగుతుంది. గిరిజన పూజారులు ఈ ఉదయాన్నే వనదేవతను పూజించి అందుకు గుర్తుగా వెదురుని తీసుకువచ్చి గద్దె మీద ఉంచుతారు. తరువాత చలుకలగుట్ట పైకి వెళ్లి రహస్య ప్రదేశంలో ఉంచిన సారక్క ప్రతిరూపమైన కుంకుమభరిణెని తీసుకుని కిందకి వస్తారు. సారక్కను కిందకి తీసుకువచ్చేటప్పుడు అధికారులు తుపాకులను గాల్లోకి పేల్చి ఆమెకు ఆహ్వానం పలుకుతారు. ఒకప్పుడు మేడారం జాతర చిలుకలగుట్ట మీదే సాగేది. కానీ నానాటికీ సందర్శకుల తాకిడి ఎక్కువకావడంతో జాతరను దిగువన జరపడం మొదలుపెట్టారు.

 

 


    కుంకుమభరిణె రూపంలో ఉన్న సారక్క తమ పసుపుకుంకుమలను చల్లగా చూస్తుందనీ, సంతానం కావల్సినవారికి సంతానం, రోగాలున్నవారికి ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తుందనీ భక్తుల నమ్మకం. తమ కోరికలు నెరవేరితే ఆమకు తగినంత బంగారాన్ని చెల్లించుకుంటామని మొక్కుకుంటారు. బంగారం అంటే భక్తుల దృష్టిలో బెల్లమే! మేడారం గద్దె మీద కొలువుదీరిన సమ్మక్కకు తమ మొక్కులు చెల్లించుకునేముందు భక్తులు జంపన్నవాగులో స్నానమాచరిస్తారు. జంపన్నవాగుకి ఆ పేరు రావడం వెనుక కూడా ఓ గాథ ఉంది.


జంపన్న ఎవరో కాదు, సమ్మక్క కుమారుడే. తల్లితో పాటు రణరంగంలో పోరుసల్పి శత్రువులకు ముచ్చెమటలు పట్టించినవాడే. కానీ యుద్ధంలో తాము పరాజయం చెందామన్న వార్త విని జంపన్న తట్టుకోలేకపోయాడు. యుద్ధం జరిగిన సంపెంగవాగులోక దూకి ప్రాణాలను తీసుకున్నాడు. అప్పటి నుంచీ ఆ వాగుకి జంపన్న వాగు అన్న పేరు వచ్చింది. ఆ పేరుకి తగినట్లుగానే వాగులో నీరన్నీ ఎర్రగా ఉంటాయి. జంపన్న రక్తం వల్లే నీరు ఆ రంగులోకి మారిపోయిందని భక్తుల నమ్మకం.