Read more!

పతాక స్థాయికి జనజాతర

 

 

పతాక స్థాయికి జనజాతర

 


 

సమ్మక్క-సారక్క జాతర మూడో రోజుకి చేరుకోవడంతో మేడారం సమీప ప్రాంతమంతా ఇసుకవేస్తే జనం రాలనంతగా కిక్కిరిసిపోతుంది. జిల్లా కేంద్రమైన వరంగల్‌ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు అసంఖ్యాకంగా పోటెత్తడం మొదలుపెడతారు. కన్నెపల్లెనుంచి సారలమ్మను, చిలుకలగుట్ట నుంచి సారక్కను, పూనుగొండ్ల నుంచి పగిడిద్దిరాజును, కొండాయి నుంచి గోవిందరాజులును తీసుకువచ్చి మేడారానికి తీసుకురావడంతో జాతరకి ఒక రూపం వస్తుంది. జాతర మూడోరోజుకి చేరుకునేనాటికి దేవతలంతా కొలువై భక్తుల కోరికలను ఈడేర్చేందుకు సిద్ధంగా ఉంటారు.

 



గ్రామదేవతలలో ఎవరో ఒకరిని మాత్రమే ఆరాధించడాన్ని చూస్తుంటాం. ఆమె కుటుంబం మొత్తం పూజలందుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ సారక్కతో కలిసి ప్రజల తరఫున పోరాడి వీరమరణాన్ని పొందారు కాబట్టి ఆమె కుటుంబరం యావత్తూనీ మహిమాన్వితంగా భావిస్తారు భక్తులు. సమ్మక్క కూతురైన సారక్కను సాక్షాత్తూ ఆమె ఆంశగా భావిస్తారు. సారక్క భర్త గోవిందరాజులు కూడా ఆమెను ఎంతో ఆన్యోన్యంగా చూసుకునేవాడనీ... యుద్ధంలో పోరాడుతూ పోరాడుతూ చివరగా సమ్మక్కని తల్చుకుంటూనే మృతి చెందాడనీ చెబుతారు. ఇక సమ్మక్క అల్లుడైన గోవిందరాజులు కూడా మామగారి కీర్తిని కాపాడేందుకు తన ప్రాణాలను అడ్డువేశాడు. సమ్మక్క కుమారుడు జంపన్న తన ప్రాణత్యాగంతో సంపంగి వాగు కాస్తా జంపన్నవాగుగా మారడానికి కారణమయ్యాడు.

 



    జాతర మూడోరోజుకి చేరుకునేనాటికి మొక్కులు చెల్లించడానికి ప్రాధాన్యత ఉంటుంది. భక్తులు తమ కోరికలు ఈడేరినందుకు కృతజ్ఞతగా ఎత్తు బెల్లాన్ని సమర్పించుకుంటారు. భక్తుల సమర్పించుకున్న అదే బెల్లాన్ని సందర్శకులకు ప్రసాదంగా అందిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిషా, మధ్య ప్రదేశ్, చెత్తీస్‌ ఘడ్, మహారాష్ట్ర, రాష్ట్రాలనుండి వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడటం ప్రభుత్వ యంత్రాంగానికి పెద్ద ప్రహసనంగా నిలుస్తుంది. కలెక్టర్ల దగ్గర నుంచీ జిల్లాలోని ప్రతి ముఖ్య అధికారీ కూడా అమ్మవారి సేవలో తలమునకలైపోతుంటారు.

 



ఇప్పుడైతే మేడారాన్ని చేరుకునేందుకు వేలకి వేల బస్సులు, మరీ అవసరమైతే హెలికాఫ్టర్లు అందుబాటులో ఉన్నాయి కానీ... ఎలాంటి రవాణా సౌకర్యమూ లేని వందల సంవత్సరాలకు పూర్వం కూడా ఈ జాతరకు లక్షలాది భక్తులు తరలివచ్చేవారనడానికి సాక్ష్యం ఉంది. కష్టనష్టాలకు ఓర్చుకుంటూ అలాగే వందల కిలోమీటర్ల నుంచీ అడవులమధ్యనుంచీ భక్తులు అమ్మను కొలుచుకునేందుకు తరలివచ్చేవారు. ఇప్పటి అధికారిక లాంఛనాలకు ఏమాత్రం తీసిపోకుండా అమ్మవారికి తుపాకులతో గౌరవవందనాన్ని అందించడం, ఆచారబద్ధంగా గిరిజన దేవతలను గద్దెల మీదకు చేర్చడం... వంటి సంప్రదాయాలు ఏమాత్రం చెక్కుచెదరకుండా తరాల తరబడి కొనసాగుతూ వస్తున్నాయి.