Read more!

మేల్కోట వైర్ ముడి బ్రహ్మోత్సవాలు

 

 

మేల్కోట వైర్ ముడి బ్రహ్మోత్సవాలు

 

 

మేల్కోట లో ఘనంగా జరిగే వైర్ ముడి బ్రహ్మోత్సవాలు నిన్నటి రోజు నుంచి మొదలయ్యాయి.(13వ తారీఖు మొదలుకుని 13రోజుల పాటు జరుగుతాయి).  అక్కడ కొలువుతీరిన చెలువనారాయణ స్వామికి ఏడాది పొడుగునా ఎన్నో రకాల ఉత్సవాలు జరుపుతున్నా ఈ వైర్ ముడి సేవకి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా  కాదు, ప్రతి ఏట జరిగే  ఈ ఉత్సవానికి నాలుగు లక్షల మంది హాజరవుతారంటేనే దీనికున్న విశేషత మనకి అర్థమవుతుంది.

వైర్ ముడి అంటే స్వామివారికి అలంకరించే కిరీటం. ఈ కిరీటం పాలసముద్రం మీద పడుకునే నారాయణుడి కిరీటంగా భావిస్తారు ఇక్కడి భక్తులు. ఇది సంవత్సరంలో మరే రోజు అలంకరించరు. దీని అలంకరణ వెనక కూడా ఒక విశేషం ఉంది. ఈ కిరీటాన్ని సూర్యకిరణాలు తాకకూడదట. అందుకే దీనిని స్వామివారికి అలంకరించి సూర్యాస్తమయం అయిన తరువాత తిరువీధిలో ఊరేగిస్తారట. ఇది ఎంతో మహిమాన్వితమైనది కావటం వల్ల దీనిని భద్రంగా పెట్టెలోంచి తీసి స్వామివారికి అలంకరించే వరకు అర్చక స్వామి కూడా నేరుగా కళ్ళతో చూడకుండా కళ్ళకి గంతలు కట్టుకుని అలంకరిస్తారు. గర్భగుడిలో రామానుజుల వారి సన్నిధిలో రామానుజుల వారి విగ్రహానికి ఎదురుగా ఈ కిరీటాన్ని స్వామి వారికీ అలంకరించటం ఇక్కడ అనాదిగా వస్తున్నా ఆచారం.

 


ఈ కిరీటం వెనక ఉన్న పురాణగాధని చూసినట్లయితే పాలసముద్రం మీద శయనిస్తున్న నారాయణుడి కిరీటాన్ని రాక్షస రాజయిన వీరోచనుడు అపహరింఛి పారిపోతాడట. ఈ వీరొచనుడు భక్త ప్రహ్లాదుడి కొడుకు,అయితే దానిని తీసుకువచ్చే బాధ్యతని గరుత్మంతుడికి అప్పగిస్తాడట నారాయణుడు. గరుత్మంతుడు లోకం మొత్తం గాలించి వీరొచనుడిని వెతికి అతనితో యుద్ధం చేసి తిరిగి ఆ వైర్ ముడి కిరీటాన్ని నారాయణుడికి అప్పగిస్తాడట. ఏ రోజున నారాయణుడు ఆ కిరీటాన్ని తిరిగి అలంకరించుకున్నాడో ఆ రోజునే మనం ఇప్పటికి వైర్ ముడి సేవగా చేసుకుంటున్నాం. ఈ రోజు స్వామిని చూస్తే సాక్షాత్తు ఆ పాలసముద్రంపై కొలువుతీరిన నారాయణుడిని చూసినంత ఫలితం కలుగుతుందని ఎంతో మంది భక్తుల నమ్మకం.

 

 


గరుత్మంతుని పరాక్రమానికి ఆనవాలుగా ఈ బ్రహ్మోత్సవాలలో ముందుగా స్వామివారిని బంగారు గరుడ వాహనంపై ఊరేగిస్తారట. శ్రీదేవి, భూదేవి సమేతుడై కొలువుతీరే చెలువ నారాయణుడిని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తండోపతండాలుగా తరలివస్తారట. సూర్యాస్తమయం తరువాత మొదలయ్యే ఈ వైర్ ముడి ఉత్సవంలో జరిగే తిరువీధి తెల్లవారుజాముదాకా కొనసాగుతుంది. మళ్లి సూర్యోదయానికి ముందే ఆ కిరీటాన్ని తిరిగి పెట్టెలో భద్రపరుస్తారట.

పదమూడు రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో తిరువీది మహోత్సవం, కల్యాణోత్సవం, నాగవల్లి ఉత్సవం, మహా రథోత్సవం జరుగుతాయట. ఇంత శోభాయమానంగా జరిగే ఉత్సవాలలో పాలుపంచుకోవాలని ఎవరికీ మాత్రం ఉండదు.

 

...కళ్యాణి