Read more!

రథసప్తమిలో హేతువు!!

 

రథసప్తమిలో హేతువు!!

ఇతర దేశాలకు ముఖ్యంగా ఇంగ్లీష్ దేశాలకు సూర్యుడంటే ఒక గ్రహం. అలాగే సైన్స్ పరంగా కూడా. కొన్ని దేశాలలో నమ్మకాల ప్రకారం సూర్యుడిని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. అలాగే భారతదేశంలో కూడా సూర్యుడు అంటే ప్రత్యక్షదైవంగా పరిగణనించబడుతున్నాడు. ఇది ఇప్పటిది కూడా కాదు ఈ భారతదేశ ఉనికి ఎప్పుడు మొదలయ్యిందో అప్పటినుండి సూర్యుడిని దేవుడిగా కొలవడం పురాణాల ద్వారా తెలుస్తూనే ఉంది. ఇంకా సూర్యుడిని నవగ్రహాలలో ఒకరిగా చేర్చి పూజించడం కూడా తెల్సిందే. అలాంటి సూర్య భాగవానుడి కృపకు పాత్రువలడానికి రథసప్తమి ఎంతో గొప్ప దినం.


సప్త శ్వేతాశ్వములు లాగుతున్న రథంలో తిరిగాడు ఆ సూర్యభగవానుడు ఈ సకల ప్రపంచానికి వెలుగు ప్రదాత. ఆయన లేకపోతే ఈ జగత్తు మొత్తంగా అంధకారంలో పడి కొట్టుకుపోతుంది. సంవత్సరాన్ని ఉత్తరాయణ, దక్షిణాయణాలుగా విభజించిన కోణంలో ఉత్తరాయణంలో సూర్యుడి రథం ప్రయాణించడం మొదలవడానికి సూచనగా రథసప్తమి వేడుకను జరుపుకుంటారు.


ఇది శాస్త్రపరంగానూ, హేతుపరంగానూ కూడా ఆమోదించదగిన పండుగ. కారణం సూర్యుడు ఇచ్చే వెలుగు ద్వారానే మనిషి మనుగడ సాధ్యమవుతోంది. ప్రస్తుత కాలంలో ఎంతోమంది విటమిన్ టాబ్లెట్లు మింగుతూ జీవితాన్ని సాగిస్తున్న వారు ఉన్నారు. కారణం!! ఎండ తెగిలే ప్రాంతాలలో పనిచేయకుండా చలువరాతి గదుల్లో హాయిగా సుఖపడటం.  అదే సూర్యుడి వెలుగు తగిలితే విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. అందుకే సూర్యుడిని ఆరోగ్యప్రదాత అంటారు. 

ఈ రథసప్తమి సందర్భంగా భారతీయులు  ఆ సూర్యభగవానుని కృప కోసం పూజలు, వ్రతాలు కూడా చేస్తారు. 


ఉదయాన్నే సముద్రస్నానం, లేక నదీ స్నానం, లేదా బావి దగ్గర కుదరకపోతే ఉన్నదాంట్లోనే నదీస్నానం శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేసి మొదట సూర్యభగవానుని ఉషోదయ సమయాన ఎదురుగా నిలబడి నమస్కరించాలి. ఆ తరువాత ఎవరికి వీలున్న విధంగా వాళ్ళు ఆయన్ను ప్రసన్నం చేసుకోవచ్చు.

ఆదిత్యహృదయం!!

ఎంతో మహత్తు కలిగిన ఆదిత్యహృదయం ఆ దేవుడు ప్రసాదించే శక్తి పరంగా కాదు శ్లోకంలో ఉన్న వైబ్రేషన్ తాలూకూ శక్తి మనిషి మీద ఎంతో ప్రభావం చూపిస్తే అదే మనిషిలో ఉన్న అసమతుల్యతను తగ్గించే గొప్ప ఔషధం అవుతుంది. అందరికీ ఈ మంత్రాలు, శ్లోకాలు వట్టి మూఢనమ్మకాలు అనిపిస్తాయి కానీ ప్రతి మంత్రం, శ్లోకం సంస్కృత అక్షరాలతో లీనమై ఉంటుంది. ఆ బీజాక్షరాల తాలూకూ వైబ్రేషన్ మనిషిలో హార్మోన్లను, వివిధ అవయవాలను, ఆ మంత్రం ఉచ్చరించేటప్పుడు వెలువడే శబ్దం మనిషిలో ఒత్తిడిని తగ్గించి శారీరక దృఢత్వాన్ని చేకూర్చుతుంది. అలాంటిదే అదిత్యహృదయం కూడా. 

జిల్లేడు నిఘోఢత్వం!!

జిల్లేడు పత్రాన్ని అర్క పత్రం అంటారు. సూర్యుడిని కూడా అర్కుడు అంటారు. సూర్యుడికి జిల్లేడు పత్రాలంటే చాలా ఇష్టమంటారు. నిజానికి జిల్లేడు ఆకులు ఎంతో గొప్పవి. చిన్నతనంలో పల్లెల్లో పిల్లలకు ఆరోగ్యం బాగోలేనపుడు, జ్వరం వచ్చినప్పుడు జిల్లేడు ఆకులను తెంచి అందులో కారే ఆ పాలతో శరీరంలో వివిధ చోట్ల బొట్టు లాగా పెట్టేవారు. అయితే గమనించదగ్గది ఏమంటే ఆ ప్రాంతాలు అన్నీ నరాల కేంద్రకాలు మరియు ఎముకల పట్టు ఉన్న ప్రాంతాలు. ఆ ప్రాంతాలలో జిల్లేడు పాలు కొద్దిసేపు పాటు వాటి ప్రభావాన్ని చూపి శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని తగ్గిస్తాయి. రథసప్తమి రోజు జిల్లేడు ఆకులను తలమీద ఒకటి, భుజాలపై రెండు, మోకాళ్ళ పై రెండు, కాలి పాదాలపై రెండు పెట్టుకుని స్నానం చేయడం వల్ల ఆ పాల తాలూకూ బిందువులు శరీరం అంతా ప్రయాణం చేసి స్వస్థతను కూడా చేకూర్చుతాయి. అదొక సాంప్రదాయం కూడా. 

ఇట్లా రథసప్తమి వెనుక గొప్ప హేతువు దాగివుంది. అందుకే తప్పకుండా ఆ సూర్యుడి పేరుతో ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోండి.

◆ వెంకటేష్ పువ్వాడ