Read more!

ఆదిదేవుని ఆరాధనకు వేళయింది!

 

ఆదిదేవుని ఆరాధనకు వేళయింది!

ఆదిదేవుడు ఆదిత్యుడు. ప్రత్యక్ష దైవమని సకల ప్రాణకోటికి జీవాత్మను ప్రసాదించేవాడని సూర్యుడిని ఆదిదేవుడిగా ప్రత్యక్ష దైవంగా పిలుస్తారు. సంక్రాంతి పండుగ అయిపోయిన తరువాత మాఘమాసంలో రథసప్తమి వస్తుంది. మాఘశుద్ధ సప్తమి సూర్యుని జన్మదినం. అది ఆయనకు ప్రీతికరమైన రోజు. దీన్ని వ్రతంగా ఆచరించాలి. ఈ రోజున సూర్యోదయ సమయంలో అకాశంలో నక్షత్రాలు రథాకారంగా ఏర్పడతాయనీ, అందుకే దీనికి రథసప్తమి అని పేరు వచ్చిందనీ  చెబుతారు. వేసవికాలానికి ప్రారంభం ఈరోజు నుండే జరుగుతుంది. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు పన్నెండు రూపాలు ధరించి, ద్వాదశాదిత్యులుగా పేరు పొంది ఈ సమస్త సృష్టికీ ఆధారభూతమవుతున్నాడు. 

ఆదిత్యః సవితా సూర్యో మిహిరోర్కః ప్రభాకరః

మార్తాండో భాస్కరో భాను శ్చిత్రభాను ర్దివాకరః రవి ర్ధ్వాదశభి స్తేషాం జ్ఞేయః సామాన్య నామభిః

ఆదిత్యుడు, సవిత, సూర్య, మిహిర, అర్క, ప్రభాకర, మార్తాండ, భాస్కర, భాను, చిత్రభాను, దివాకర, రవి అనేవే 12 పేర్లు. 

రథసప్తమిని గురించి వివరిస్తూ పంచాంగకర్తలు ఇది సూర్యజయంతి మాత్రమే కాక, 'మన్వాది' అని కూడా చెప్పడం వినవచ్చు. మన్వాదికి సూర్య సంబంధం ఉంది. వివస్వంతుని కుమారుడైన వైవస్వతుడు ఏడవ మనువు. ఆతని మన్వంతరానికి రథసప్తమి మొదటి తిథి. ఇది పితృదేవతలకు ముఖ్యమైనది. ప్రస్తుతం జరుగుతున్నది వైవస్వత మన్వంతరమే. మనం సంకల్పం చెప్పుకునేటపుడు దీన్ని చెప్పుకోవడం అందరికీ గుర్తుండే ఉంటుంది.

రథసప్తమిని ఒకప్పుడు తెలుగు దేశంలో ఉగాది పండుగగా జరిపేవారు. అందుకు కారణం ఆనాడు ప్రారంభమయ్యే వ్రతాలే. నిత్యాన్నదానం, దంపతి తాంబూలం, పుష్ప తాంబూలం, ఉదయ కుంకుమ, చిట్టి బొట్టు సౌభాగ్య తదియ, నందవ్రతం మొదలైన వ్రతాలన్నీ రథసప్తమినాడే మొదలుపెడతారు. ఏది ఎలా ఉన్నా రథసప్తమి చాలా ప్రాచీనమైనదనీ, దీని కార్యకలాపాలను గమనిస్తే ఇది సూర్యారాధనకై ఏర్పాటు చేసిన పండుగ అనీ అర్థమవుతుంది.

సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు జీవుల మీద ఇతర గ్రహాలు తమ ప్రభావాన్ని తీవ్రంగా చూపిస్తాయి. ఉత్తరాయణంలో వాటి ప్రభావం తగ్గిపోతుంది. రథసప్తమి సూర్యుని ఉత్తర మార్గాన్ని సూచిస్తుంది. ఈ పండుగనాడు జిల్లేడు ఆకులను తల మీద ఉంచుకొని స్నానం చేస్తూ వాటిని జారవిడవడం కామ క్రోధాది గుణాల విసర్జనకు సూచన అని గమనించాలి. రథసప్తమిని రాజస్థాన్లో 'సౌర సప్తమి' అనీ, వంగదేశంలో 'భాస్కర సప్తమి' అనీ అంటారు. కొన్నిచోట్ల 'జయంతి సప్తమి'గా, మరికొన్నిచోట్ల 'మహాసప్తమి'గా కూడా పేర్కొంటారు.

రథసప్తమి రోజు ఏమి చెయ్యాలి??

మాఘశుద్ధ షష్ఠి నాడు నువ్వుల పిండితో శరీరాన్ని రుద్దుకొని, నదిలోగాని, చెరువులోగాని, నూతి వద్ద కానీ స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యదేవాలయంలో పూజ చేయాలి. సప్తమి రోజున అరుణోదయంతోనే ప్రమిదలో చమురు పోసి పువ్వువత్తి వేసి దీపం వెలిగించి, దాన్ని శిరస్సుపై ఉంచుకొని నీటిలో దిగి 

నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః 

అరుణాయ నమస్తే స్తు హరిదృశ్య నమోస్తుతే

అని శ్లోకం చెబుతూ సూర్యనారాయణమూర్తిని ధ్యానిస్తూ దీపం నీళ్ళ మీద తేలేటట్లు జాగ్రతగా నీటిలో మునగాలి. ఆ తర్వాత జిల్లేడు ఆకులతో స్నానం చేయాలి. ఆ తర్వాత బంగారు లేదా వెండి రథాన్నీ, దానికి ఏడు గుర్రాలనూ, వాటిని తోలే సారథినీ, అందులో సూర్యుని ప్రతిమనూ ఉంచి దీన్ని నదీ తీరాన కానీ, చెరువు ఒడ్డున కానీ, నూతన వస్త్రంపై ఉంచి సాయంకాలం దాకా ఉపవాసంతో పూజలు చేయాలి. వివిధ రకాల పండ్లను నైవేద్యం పెట్టాలి. ఆ తరువాత వాటినన్నింటినీ ఇంటికి తీసికొనివచ్చి, రాత్రి జాగరణ చేసి మర్నాడు పునః పూజ చేసి దానధర్మాలు చేయాలి. రథాన్నీ, సూర్యుని ప్రతిమనూ దానం చేయాలి. ఈ వ్రతం వల్ల ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. ఇంట్లో పిల్లలు, పెద్దలు సంతోషంగా ఉంటారు, సంపదలు కలుగుతాయి.

                                       ◆నిశ్శబ్ద.