రమణ మహర్షి చెప్పిన "నేచ్చయా కృతం"!!
రమణ మహర్షి చెప్పిన "నేచ్చయా కృతం"!!
మనుషులు చేసే పనులను కర్మలు అంటారు. ఆ కర్మల వల్ల కలిగే ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. అయితే అవి మనిషి బాధలకు కారణం అవుతున్నాయి ఎందుకు?? అని అపుడపుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక పనిని చేసేది మనుషులే, ఆ పని ద్వారా లభించే పలితం కూడా ఆ మనిషికే సొంతమవుతుంది. కానీ అవి ఒక్కోసారి బాధల్ని పరిచయం చేస్తాయి, మరికొన్ని సార్లు సంతోషాన్ని ఇస్తాయి. సంతోషాన్ని తీసుకున్నట్టు బాధను స్వీకరించలేము ఎందుకు?? అని అనిపించినప్పుడు ఆధ్యాత్మిక చింతన చేస్తే!! ముఖ్యంగా రమణ మహర్షి చెప్పిన విషయాన్ని తెలుసుకుంటే ఇక కర్మల గురించి ఆలోచన, సంతోషాలు, దుఃఖాలు అనే ఆందోళన అసలు ఉండదు.
పాములు పట్టి, వాటిని ఆడించి ప్రజలకు వినోదం కల్పించి, వారిచ్చిన డబ్బుతో కుటుంబాలను పోషించుకొనే పాముల వాళ్ళు ఉంటారు. వారు ఆ వృత్తిలోనే ఉండి ఉదర పోషణ చేసుకోవాలి. కాని పాములను ఆడించేటప్పుడు అవి కాటేస్తే మరణిస్తారు. అలాగని మానుకుంటే పోషణ జరగదు. మరిఎలా? అందుకే వారు ఆ పాములకున్న కోరలను పీకివేసి ఆడిస్తారు. కోరలు లేవు గనుక మరణ భయం లేదు. ఆడిస్తున్నారు గనుక పోషణ జరిగిపోతుంది.
అలాగే మనం కూడా కర్మలు చేస్తే బంధం, వాటి వల్ల ఏదో ఒక పలితం వస్తుందని భయం. పోనీ మానేద్దామా? అసలే కుదరదు. కనుక బంధం కాకుండా ఉండేవిధంగా కర్మలు చేయాలి? ఎలా? కోరికలనే కోరలను పీకేస్తే సరి. కోరిక లేకుండా కర్మలు చేస్తే ఇక బంధం అయ్యే ప్రసక్తే ఉండదు. దీనినే నిష్కామ కర్మ యోగము అన్నారు. దీనినే రమణ మహర్షి 'నేచ్ఛయా కృతం' అన్నారు.
న- ఇచ్ఛయా - కృతం = కోరిక లేకుండా చేయబడినది అని.
కోరిక లేకుండా కర్మలు చెయ్యాలంటే
అసలు ఎవరైనా ఏ కోరికా, ఏ ప్రయోజనము లేకుండా కర్మలు చేస్తారా? ఎవ్వరూ చేయరు. ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. సుఖం కలగాలి, లాభం రావాలి. పేరురావాలి, పుణ్యం రావాలి, కీర్తి ప్రతిష్టలు కలగాలి, మనస్సుకు తృప్తి కలగాలి. ఇలా ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. అప్పుడే ఎవరైనా కర్మ చెయ్యాలి అని అనుకుంటారు, చేస్తారు. మరి నిష్కామంగా అంటే ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా చెయ్యడమా ? అసలు ఏకోరికా లేకుండా చెయ్యడమా? బండరాయి లాగా ఉండాలా? కానే కాదు. మంచి జరగాలని శుభం కలగాలని ఆశించవచ్చు. కానీ ఏం మంచి జరగాలి, ఎంత జరగాలి? అనే నిర్దిష్ట భావాలు ఉండరాదు.
అంటే 'మనం చేసే కర్మల వల్ల 'ఫలానా' ప్రయోజనం సిద్ధించాలి' అని ముందుగానే ఊహించకుండా, భావించకుండా, ఆశపడకుండా చెయ్యమని మాత్రమే. ఇదే విషయాన్ని పిల్లలకు చెబుతూ ఉంటాం. నువ్వు మార్కుల గురించి ర్యాంకుల గురించి ఆలోచించకుండా కష్టపడి చదువు. తగిన పలితం వస్తుందిలే అని. దురదృష్టవశాత్తు ఈ కాలంలో పిల్లలకు అలా చెప్పేవాళ్ళు తక్కువే. నీ దృష్టి కర్మఫలం మీద కాకుండా కర్మల మీదనే అంటే చేసే పనిమీద ఉంచి నైపుణ్యంతో కర్మలు చెయ్యటమే నిష్కామ కర్మ యోగం. అందుకే 'యోగః కర్మసు కౌశలం' కర్మలలో నైపుణ్యమే యోగం అని భగవానుడు గీతలో చెప్పారు. కనుక కర్మలను నైపుణ్యంతో చేస్తే అవి బంధం కాక పోగా మోక్షప్రాప్తికి సహాయ కారులవుతాయి. నిజంగా కర్మల వల్ల ఎవరికీ సుఖదు:ఖాలు కలగటం లేదు. ఆ కర్మల వల్ల వచ్చే ఫలితాలపై ఆసక్తి కలిగి ఉండటం వల్ల, ఫలానా ఫలితాన్ని నేను పొందాలి అనే భావన వల్ల, ఆశ వల్లనే సుఖదు:ఖాలు కలుగుతున్నాయి. బంధ కారణాలవుతున్నాయి.
◆వెంకటేష్ పువ్వాడ.