Read more!

గుణాలకు అతీతంగా ఉండటం!!

 

గుణాలకు అతీతంగా ఉండటం!!


గుణానేతాసతీత్యత్రీ న్దేహీ దేహసబుద్భవాస్| జన్మమృత్యుజరాదుఃఖైర్విముక్తాం. మృతమశ్నుతే॥

ఈ శరీరములు రావడానికి కారణము అయిన మూడు గుణములు దాటిన వాడు, జననము, మరణము, ముసలితనము, వ్యాధులు మొదలగు దుఖముల నుండి విముక్తిని పొందుతాడు. అతడికి అమృతత్వము లభిస్తుంది.

గుణాతీతుడు అయితే (అంటే గుణాలను అతీతంగా బతకం) కలిగే ఫలితాన్ని ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ. ఈ దేహములు పుట్టడానికి కారణం ప్రకృతిలో ఉన్న మూడు గుణములే. వీటి వలననే సృష్టి జరుగుతూ ఉంది, ఈ మూడు గుణములు దాటితే అంటే గుణాతీత స్థితికి చేరుకుంటే ఈ ముసలి తనము, రోగములు వాటి వలన వచ్చే దుఃఖములు, మరణము వీటి నుండి విడివడవచ్చు. అదే ముక్తి. అమృతత్వము. అంటే మృతము లేని స్థితి. 

అంతేకానీ అమృతత్వం అంటే అక్కడెక్కడో ఇంద్రుడి దగ్గర కళశంలో ఉంటుందని, అందులో ఉన్న అమృతం తాగితే వచ్చేది అమృతత్వమని అనుకోవడం పొరపాటు.

ఇకపోతే సత్వగుణము మంచిది అని అంటుంటారు. అది మంచిదే కానీ దానిని కూడా విడిచిపెడితేకానీ మోక్షము రాదు. అంటే గుణాతీత స్థితి, నిర్గుణ స్థితి, పరమాత్మ నిర్గుణుడు. మనం కూడా ఆ నిర్గుణ స్థితికి చేరుకుంటే కానీ, పరమాత్మలో ఐక్యం కాలేము.

నిర్గుణ స్థితి అంటే గుణములను మనం స్వీకరించకపోవడం. గుణములు ఉన్నాయి అని గుర్తించకపోవడం. అంటే గుణాలు ఎక్కడకుపోవు మనలో ఉన్నాయి. బయటలో ఉన్న ప్రకృతిలో ఉన్నాయి. ఆ గుణాల ప్రభావానికి మనం లోనుకాకూడదు. ఈ గుణములు శరీరానికి మనసుకే కానీ నాకు కాదు, నన్ను ఏమీ చేయలేవు అనే స్థితికి చేరుకోవాలి. శరీరము, మనసు గుణములలో ప్రవర్తిస్తున్నా, నేను అనే ఆత్మస్థితి మాత్రం నిర్గుణంగానే ఉండాలి. అదే గుణాతీతస్థితి. అదే ఆత్మస్వరూపము, ఆత్మస్వరూపము అయిన ఈ గుణాతీతస్థితికి చేరుకున్నవాడు, పరమాత్మలో ఐక్యం అవుతాడు. అంటే మోక్షాన్ని పొందుతాడు.

లౌకికంగా చెప్పుకోవాలంటే, ఈ మూడు గుణముల కలయికతోనే సృష్టి జరుగుతూ ఉంది. జననములు సంభవిస్తున్నాయి. పుట్టగానే రోగాలు మన వెంటనే ఉంటాయి. శరీరం పెరుగుతూ ఉంటుంది. తెల్ల వెంట్రుక కనపడగానే ఆందోళన, ముసలి తనం వస్తుందేమో అని భయం. రంగు వేసి దానిని దాచి పెడతాము. 40 ఏళ్లు దాటగానే కళ్లకు అద్దాలు వస్తాయి. అద్దాలు పెట్టుకుంటే పెద్దవాళ్ల అయిపోయామేమో అనే భావన. కాంటాక్ట్ లెన్సులు వాడతాము. వయస్సును దాచి పెట్టడానికి రకరకాలైన సాధనాలు. వాటి వలన కలిగే దుష్పరిణామాలు, తరువాత వయోవృద్ధులం అవుతాము. ఆఖరున అవసానకాలం వస్తుంది. చస్తావేమో అనే దుఃఖం. నేను చస్తే వీళ్లంతా ఏమౌపోతారో అనే బాధ. ఇవన్నీ దుఃఖమును కలిగిస్తాయి.

 అసలు ఈ శరీరమే లేకుంటే ఈ దుఃఖములు రావు. శరీరం లేకపోవడం అంటే జనన మరణ చక్రం నుండి విడివడడం. అంటే పుట్టుక ఉండకూడదు. పుట్టుక లేకపోతే రోగములు, ముసలితనం, చావు అనే బాధలు లేవు. పుట్టుక లేకపోవడం అంటే గుణములు లేకపోవడమే. కాబట్టి అందరమూ ఈ గుణాతీత స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఒకసారిగా రాదు, తామసం లోనుండి రాజనం లోకి, రాజసం లోనుండి సత్వానికి, సత్వం నుండి గుణాతీతస్థితికి రావాలి. దానినే మోక్షము అని అంటారు.

అంటే ఇప్పుడు ఇందులో విషయం ప్రస్తుతం మనుషులలో సత్వగుణం ఉన్నవాళ్లు కూడా తక్కువే. అంటే సత్వ, రజో, తమో గుణాలతో తమో గుణం విడిచి, రజో గుణానికి ఆ తరువాత రజో గుణం విడిచి సత్వ గుణానికి ఆ తరువాత సత్వగుణం విడిచి అసలు ఏ గుణానికి స్పందించకుండా ఒకానొక నిశ్చల స్థితిలోకి చేరుకోవాలి. ఇలా గుణాలను అతీతంగా మారినవాళ్ళలో చావును చూస్తే బాధ, భయం వంటివి కలగవు. శుభకార్యాలు, బంధుసమూహాలు కలిసినప్పుడు సంతోషం, నవ్వడం వంటివి ఉండవు. అలా గుణాలకు అతీతంగా ఉండేవాడు ఎప్పుడూ ఏకాంతంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడు.

◆వెంకటేష్ పువ్వాడ