Read more!

కౌసల్యా, లక్ష్మణులకు రాముడి సమాధానం!!

 

కౌసల్యా, లక్ష్మణులకు రాముడి సమాధానం!!


రాముడి వనవాసం గురించి విన్న కౌసల్య రాముడితో ఇలా చెప్పింది. "రామ! నిన్ను విడిచి నేను ఉండలేను, ఉంటే నీతో పాటు నేను ఉండాలి. లేదా నువ్వు నాతో ఉండాలి. నీతో పాటు నేను అడవులకు వస్తే, నువ్వు ఏది తింటావో నాకు అదే పెట్టు. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో, తల్లి మాట కూడా అలానే వినాలి. తండ్రి అనుమతిచ్చాడు కనుక వెళ్ళిపోతానంటున్నావు. కాని తల్లిగా నేను నీకు అనుమతిని ఇవ్వడం లేదు. ఒకవేళ నువ్వు నా మాట కాదని వెళితే నేను విషం తాగి చనిపోతాను. నువ్వు వెళ్ళడానికి వీలులేదు" అనింది.


అప్పుడు రాముడు "అమ్మా! నువ్వు చెప్పింది తప్పు అని నేను అనను. ఖండువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవుని చంపమంటే, ఆ మహర్షి గోవుని చంపేసాడు. పరశురాముడిని ఆయన తండ్రి జమదగ్ని పిలిచి నీ తల్లి అయిన రేణుక శిరస్సు నరకమన్నాడు, పరశురాముడు ఎందుకు నాన్న అని అడగకుండా తన తల్లి కుత్తుక కోసేశాడు. అలాగే మన వంశంలో పూర్వీకుడైన సగర చక్రవర్తి తన 60,000 కుమారులని పిలిచి ఈ భూమి మొతాన్ని తవ్వమంటే, అలా తవ్వడం పాపం కదా అని వారు ఆలోచించలేదు, తండ్రి చెప్పాడని తవ్వేశారు. ఆ తండ్రుల నిర్ణయాల వెనుక తగిన కారణాలు ఉండనే ఉన్నాయి. ఒకేసారి తల్లి మాట, తండ్రి మాట వినవలసి వస్తే, తండ్రిమాటకే గౌరవం ఇవ్వాలి. నేను ఇప్పుడు తల్లి మాట విని ఆగిపోతే, పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవారు అవివేకులవుతారు. నేను వారి ప్రవర్తనని అవమానించకూడదు. అందుకని నేను ఇప్పుడు దశరథ మహారాజు మాట విని అడవులకు వెళ్లిపోవాలి" అన్నాడు.

తరువాత లక్ష్మణుడితో,

"లక్ష్మణా!  ధర్మమునందు సత్యము ప్రతిష్టితమై ఉంటుంది. అందుకని ధర్మాన్ని విడిచిపెడితే, సత్యధర్మములు రెండిటిని విడిచిపెట్టినట్టు అవుతుంది. ఒక ధర్మాన్నో, ఒక సత్యాన్నో పట్టుకోకూడదు. సత్యంతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి. లక్ష్మణా! ధర్మము, అర్థము, కామము అని మూడు పురుషార్థాలు ఉంటాయి, ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే అది అర్థకామాలని తీసుకోచ్చేస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న అర్థం లోక ద్వేషాన్ని తీసుకొస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న కామం నీ పతనాన్ని తీసుకొస్తుంది. ధర్మం భార్యవంటిది.

(అందుకే మనం భార్యను కామపత్నిగా చూడము, ధర్మపత్ని అని అంటాము. ధర్మబద్ధమైన పత్ని వలన కలిగిన కామము వలన అర్థము, శాస్త్రం ప్రకారం అర్థం అంటే ధనము కాదు, ధనాన్ని కర్మఫలం అంటారు. అర్థం అంటే  ఇక్కడ కొడుకు అని అర్థం. అంటే ధర్మబద్ధంగా భార్యతో కలిగే కామంలో వంశానికి వారసుడు లభిస్తాడు) 

లక్ష్మణా! నువ్వు దశరథుడి మాట ఎందుకు వినాలి?? ఆయన్ను ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు. అది ధర్మబద్ధం కాని రాజ్యం, అందుకని ఆ రాజ్యం నాకు అక్కరలేదు. తండ్రి చెప్పిన మాట పాటించడం కొడుకుకి ధర్మం, అందుకని నేను అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయమయ్యాను. అలాగే, నువ్వు నాకు పట్టాభిషేకం జరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఈ సంభారములన్నిటిని, ఇక్కడినుండి తీసెయ్యి. నేను అరణ్యాలకి తొందరగా వెళ్లిపోవాలి, లేకపోతే అమ్మ (కైకేయి) బాధపడుతుంది. అమ్మ మనసులో అనుమానం అనే దుఃఖము ఎప్పటికి రాకూడదు అందుకని తొందరగా ఈ సంభారములన్నిటిని తీసెయ్యి. అమ్మ నన్నూ, భరతుడిని ఎన్నడూ వేరుగా చూడలేదు. మరి ఇంతగా నన్ను ప్రేమించిన అమ్మ, నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తాను అన్న నాన్నగారు, ఇవ్వాళ తెల్లవారేసరికి నన్ను 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యమన్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణా సుఖమవని, దుఃఖమవని, శుభమవని, అశుభమవని, వెనకనుండి శాసించేవాడు ఆ దైవం. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏమి చెయ్యలేవు. ఒక మంచిపని చేద్దామని అనుకుంటే దానికొక ప్రతిబంధకం రావడం కూడా దైవము చేసిన పనే" అని రాముడన్నాడు.


                                ◆ వెంకటేష్ పువ్వాడ.