Read more!

సంతానం కలిగించే పుత్ర గణపతి వ్రతం

 

సంతానం కలిగించే పుత్ర గణపతి వ్రతం

హిందువులు ఏ పని చేసినా కూడా ముందుగా గణేశుని పూజ చేయడం ఆనవాయితీ. గణాలకు అధిపతి అయిన గణపతి, మనకు ఎదురయ్యే విఘ్నాలు అన్నింటి నుంచీ తప్పించి విజయం చేకూరుస్తాడని నమ్మకం. అయితే ఆ వినాయకుడి పూజకే అంకితమైన తిథులు రెండు ఉన్నాయి. ఒకటి భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి. రెండు ఫాల్గుణ మాస శుద్ధ చవితి నాడు వచ్చే పుత్ర గణపతి వ్రతం. ఈ రోజు కనుక ఆ గణేశుని పూజిస్తే… ఎవరికైనా పుత్ర సంతానం కలుగుతుందని ప్రతీతి.

పార్వతీ దేవి చేతిలో రూపుదిద్దుకున్న వినాయకుడి శిరస్సును శివుడు ఖండించిన గాథ తెలిసిందే! ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని గజాసురుని శిరస్ససుతో ఆ పిల్లవాడిని బతికించారు. ఆ సమయంలో పార్వతి ఒడిలో ఉన్న గణేశుని చూసేందుకు సకల దేవతలూ కైలాసానికి చేరుకున్నారట. వారి ఆశీస్సులను, స్తుతిని విన్న అమ్మవారు…  ఫాల్గుణ శుద్ధ చవితి రోజున వినాయకుని స్తుతించి, తనకు నువ్వులు బెల్లము నివేదన చేస్తారో వాళ్లకు కూడా పుత్రాభివృద్ధి జరుగుతుందని ఆశీర్వదించారు.

పుత్రగణపతి వ్రతాన్ని అనాదిగా ఆచరిస్తున్న సందర్భాలు కనిపిస్తాయి. డుంఢి అనే కాశీరాజు ఈ పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించి పండండి బిడ్డను పొందినట్టు చెబుతారు. పూర్వం చక్రవర్తుల నుంచి సామాన్యుల వరకు సంతానం లేనివారంతా ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ప్రయత్నించేవారట.

పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించేందుకు దంపతులు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆ రోజు ఉపవాస దీక్షను చేపట్టి వినాయకుని షోడశ ఉపచారాలతో పూజించి, తోచినంతలో నైవేద్యాన్ని అందించాలి. స్తోమత లేని పక్షంలో నువ్వులు, బెల్లము కలిపి నివేదించినా సరిపోతుంది. సాయంవేళలో కూడా స్వామిని పూజించి ఉపవాసాన్ని విరమించాలి. పూజ సమయంలో పుత్రగణపతి స్తోత్రాన్ని తప్పకుండా పఠిస్తే స్వామి తప్పకుండా స్వామి అనుగ్రహం లభించి అభీష్టం సిద్ధిస్తుంది.

- నిర్జర.