Read more!

రామ, రాయలు పూజించిన కాకాని మల్లికార్జునుడు

 

                                                                                                                                                  రామ,రాయలు పూజించిన కాకాని మల్లికార్జునుడు

 


                                                                                        

కాకానినాధ కరుణా రస పూర్ణ సింధో
భక్తారి భంజన నిరంజన దేవ బంధు
దేవేంద్ర మౌళిమణి మండిత పాద యుగ్మ
శ్రీ మల్లికేశ్వర పరాత్పరవై నమస్తే

శ్రీరామచంద్రుడు, ఇంకా అనేక పురాణ పురుషులేగాక, శ్రీకృష్ణదేవరాయలు కూడా పూజించి మొక్కులు తీర్చుకున్న కాకాని క్షేత్రం గుంటూరు జిల్లాలో వున్నది.   ఇక్కడవున్న మల్లికార్జునుని, భ్రమరాంబను  శ్రీశైలంలో నెలవైన మల్లికార్జనుడు, భ్రమరాంబల అంశలంటారు.  దీనికి నిదర్శనముగా శ్రీశైల స్ధల పురాణములో శ్రీ మల్లికార్జునుని అంశావతారములను వివరించేటప్పుడు కాకానియొక్క ప్రశస్తి కూడా చేయబడింది.

ప్రాచీన క్షేత్రమంటేనే అనేక గాధలుంటాయికదా.  మరి ఈ క్షేత్రానికి సంబంధించి ప్రచారంలో వున్న కొన్ని గాధలు తెలుసుకుందామా?

ఇంద్రకీలాద్రికి (విజయవాడలో కనకదుర్గమ్మ కొలువైన కొండ) గర్చపురికి (గుంటూరు) మధ్యగల ఒక సుందర వనంలో పూర్వం ఒక సిధ్ధయోగి చాలాకాలం పరమేశ్వరునిగూర్చి తపస్సు చేయగా, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.  సిధ్ధయోగి పరమేశ్వరుని ఆ స్ధలమందే వుండి భక్తులను బ్రోవమని కోరుకున్నాడు.  పరమేశ్వరుడు ప్రసన్నుడై స్వయంభువుగా వెలిశాడు.

ఒకసారి పరమేశ్వరుడు కొందరు మునులు వెంటరాగా మంగళాద్రి (నేటి మంగళగిరి) నుండి ప్రయాణించుచూ, మంగళాద్రికి గర్తపురికి (నేటి గుంటూరు) మధ్యగల ఒక సుందర వనాన్ని చూసి కొంతకాలం అక్కడ వున్నారు.  అదే ప్రస్తుతం కాకాని.  మునీశ్వరులు ఈశ్వరుని సేవించుచుండగా స్వామివారు భక్తులను కాపాడుతూ అక్కడ సంతోషముగా వుండసాగిరి.  ఆ వనము క్రమముగా ఒక గ్రామముగా ఏర్పడినది.  సిధ్ధయోగులు చాలామంది ఇక్కడ స్వామిని బిల్వార్చనలతో, నృత్యగీతాలతో సేవించి స్వామి కృపా కటాక్షాలు పొందారు.  అందుకే ఈ ప్రదేశానికి సిధ్ధయోగ సమాజమనే పేరుకూడా వుంది.   ఇప్పటికీ భక్తులు పర్వదినాలలో ప్రభలు కట్టి మేళతాళాలతో, నృత్యగీతాలతో స్వామిని సేవించటానికొస్తారు.

 

 

పరమేశ్వరుడు ఇక్కడే వుండిపోవటంవల్ల భ్రమరాంబిక దిగులుతో స్వామిని వెతకటానికి తన చెలికత్తెలను పంపింది.  వారు ఇక్కడ స్వామిని చూసి దేవి వార్తలు తెలియజేశారు.  ఈశ్వరుడు కూడా తన స్ధానానికి చేరుకోవాలని నిర్ణయించుకుని, తన భక్తాగ్రేసరులకు ఇచ్చిన మాట ప్రకారం వారిని కాపాడటానికి ఇక్కడ లింగరూపంలో స్వయంభువుగా వెలిశాడు.  తర్వాతకాలంలో భరద్వాజ మహర్షి అనేక తీర్ధాలను సేవిస్తూ ఇక్కడికివచ్చి ఇక్కడవున్న శివలింగాన్నిచూసి పూజలు చేశాడు.  ఈశ్వర సంకల్పంవల్ల ఆయనకు అక్కడ ఒక యజ్ఞం చేయాలనిపించింది.  వెంటనే అనేక ఋషిపుంగవులను ఆహ్వానించి, యజ్ఞశాలలను నిర్మించి యజ్ఞాన్ని మొదలుపెట్టాడు.

యజ్ఞంలో యజ్ఞకుండంలో అగ్ని ప్రజ్వలింపచేసి అందులో దేవతలకు ఆహుతులను సమర్పిస్తారు.  భరద్వాజుడు అలా ఆహుతులను సమర్పిస్తున్న సమయంలో ఒక కాకి అక్కడికి వచ్చి దేవతలకు సమర్పిస్తున్న ఆహుతులను తాను తినసాగింది.  యజ్ఞం భగ్నమవుతుందనే వేదనతో భరద్వాజ మహర్షి ఆ కాకిని వారించబోయాడు.

అప్పుడా కాకి మనుష్య భాషలో ఇలా చెప్పింది,  “ఓ మహర్షీ, నేను కాకాసురుడనే రాక్షసుడను.  బ్రహ్మ ఇచ్చిన వరంచేత దేవతలకిచ్చేటటువంటి హవిస్సులను నేను భక్షించవచ్చు.  నువ్వు నన్నెందుకు వారిస్తున్నావు?  నీ యజ్ఞం సఫలం కావాలంటే నేనొక ఉపాయం చెబుతాను.  నువ్వు పవిత్ర జలాలతో పవమాన, అఘమర్షణ సూక్తాలు చదువుతూ అభిషేకించిన నీరు నా మీదజల్లు.  పూర్వం ఒక ఋషి ఇచ్చిన శాపంవల్ల నేనీ రూపంలో వున్నాను.  మీ అభిషేక జలంతో నాకు శాపం తొలగి మోక్షం వస్తుంది.  మీకు ఆటంకం లేకుండా యజ్ఞం పూర్తవుతుంది.”

భరద్వాజ మహర్షి ఆ విధంగా చెయ్యగానే ఆ కాకి శాపం తొలగి భరద్వాజ మహర్షిని శ్లాఘించి, మహాశివుని మల్లెపూవులతో పూజించి తన స్వస్ధానానికి వెళ్ళిపోయాడు.  మల్లెపూవులతో పూజింపబడటంచేతకూడా ఈ స్వామికి మల్లికార్జునుడు అనే నామం స్ధిరపడింది.  ఈ క్షేత్రానికి కాకాని అనే పేరొచ్చింది.  తర్వాత గ్రామ విస్తీర్ణంతో మొదటనుంచీ వున్న ఈ ప్రాంతం పెదకాకానిగా, విస్తరింపబడినప్రాంతం చినకాకానిగా పిలువబడుతున్నాయి.

శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శివుడికి కోటి పత్రి పూజ చేశాడని చెబుతారు.ఈ క్షేత్రంగురించి ఇంకొక కధ పార్వతీ పరమేశ్వరులు గగనయానం చేస్తూ కాకాని క్షేత్రం దర్శించారు.  ఇక్కడ మహాభక్తుడైన కాకాసురుడు మొదట గోమయలింగం ప్రతిష్టించి, పూజించి, తరించినచోటుగా గ్రహించి, ఆ చోటునాకర్షించి ప్రజలను రక్షించటానికి ఆ లింగమునందావిర్భూతుడై వున్నట్లుగా చెప్పబడుతుంది. 

విశేషములు

అగస్త్య మహర్షి తన దక్షిణదేశ యాత్రలో విజయవాడలోని కనకదుర్గమ్మని దర్శించి, గర్చపురికి శిష్యులతోసహా కాలినడకన వెళ్తూ దోవలో ఈ క్షేత్రాన్ని దర్శించాడు.  స్వామిని సేవించిన తర్వాత ఆయనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనమయింది.  ఇక్కడ భ్రమరాంబా మల్లికార్జునులతోపాటు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా కొలువై వున్నాడు.  అందకనే భక్తులు తమ పిల్లలకు చెవులు కుట్టించటం, నాగ ప్రతిష్ట చెయ్యటం వగైరాలు ఇక్కడ చేస్తారు.
శ్రీకృష్ణదేవరాయని ఆస్ధానమునగల మంత్రి రెంటూరి చిట్టరుసుది ఈ గ్రామమని చెబుతారు.  ఒకసారి రాయలు ఈ ప్రాంతానికి

వచ్చినప్పుడ మంత్రి కోరికమీద ఇక్కడ బస చేశాడు.  అప్పుడు ఇక్కడి ప్రజలు ఇక్కడి విశేషములను తెలిపి, ఆలయము జీర్ణావస్ధలోనుండుటవల్ల పునర్నిర్మించవలసినదిగా కోరారు.  రాయలు తన మంత్రి చిట్టరుసుకి కావలసిన ధనమిచ్చి ఆలయ పునర్మిర్మాణానికి ఆనతినిచ్చాడు.  తానుకూడా మనసులో తనకి పుత్రుడు కలిగితే స్వామి పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నాడు.  తర్వాత రాయలుకి పుత్రుడు కలగటం, అతనికి సదాశివ రాయలు అని పేరు పెట్టటం జరిగింది.  ఈ విషయము శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె మోహనాంగి రచించిన  ‘మారిచీ పరిణయంబు’   అనే కావ్యములో వ్రాయబడ్డది.  శాసనము ద్వారాకూడా తెలియుచున్నది.

ఈ దేవాలయ ప్రాంగణంలో రాహు-కేతు గ్రహ మండపంలో గ్రహ పూజలు జరుగుతాయి.  సర్పదోషమున్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు.

తర్వాత చాలాకాలానికి క్రీ.శ. 1911లో కాకాని వాస్తవ్యులైన కొల్లిపర వెంకటరత్నంగారు ఈ ఆలయాన్ని పునరుధ్ధరించి, పునఃప్రతిష్ట చేశారు.

ఈ ఆలయంలో ఇంకా విఘ్నేశ్వరుడు, భద్రకాళి, వీరభద్రులు, పెద్ద నందీశ్వరుడు, శివతాండవమూర్తి, మహిషాసురమర్ధని, సుబ్రహ్మణ్యస్వామి వగైరా దేవతామూర్తులని, కళ్యాణ మండపాన్ని  చూడవచ్చు.

సంతానములేనివారు, రోగగ్రస్తులు ఒక మండలంరోజులు దీక్షతో రోజూ స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే వారి కష్టాలు తొలిగి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.  శివక్షేత్రమైనా సత్యన్నారాయణ వ్రతాలు, ఉపనయనాలు, వివాహాలు జరుగుతాయి.  ఇక్కడ వాహన పూజలు విశేషంగా జరుగుతాయి.

పాలపొంగలి నివేదన ఇక్కడ ప్రత్యేకత.  పరవడి దినాలలో భక్తులు ఇక్కడే పాలపొంగలి వండి స్వామికి నివేదన చేసి తాము ప్రసాదం తీసుకుంటారు.  ఆ సమయాల్లో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా వుంటుంది.

రవాణా సౌకర్యం

5వ నెంబరు రహదారి సమీపంలో, గుంటూరుకి 7 కి.మీ. ల దూరంలో  గుంటూరు – విజయవాడ మధ్య వుండటంవల్ల గుంటూరు, మంగళగిరి, విజయవాడనుంచి బస్సు సౌకర్యం బాగా వున్నది.

వసతి

దేవస్ధానంవారు భక్తుల సౌకర్యార్ధం వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు.  సమీపంలోనే గుంటూరు, విజయవాడలలో వుండి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళచ్చు.

.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)