Read more!

తక్షణమే కరుణించే కాళికాదేవి ఆలయం

 

 

తక్షణమే కరుణించే కాళికాదేవి ఆలయం

 

 

కాళికాదేవిని భక్తితో పూజిస్తే వెంటనే కరుణిస్తుంది. కోళ్ళను బలి ఇస్తే కోరికలను తీరుస్తుంది. ఊరంతటిని కాపాడతానని అభయమిచ్చిన ఆ దేవి ఇప్పటికి తన భక్తులను అంటురోగాల బారి నుంచి కాపాడుతూనే ఉంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఉత్సవాల సమయంలో జరిగే తతంగాలు చూస్తే ఇంకా ఆశ్చర్యపోక తప్పదు.


ఇలాంటి అద్భుతమైన దేవాలయం కేరళలోని త్రిస్శుర్ జిల్లాలో కొడుంగళ్ళూర్ సమీపంలో ఉంది. ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే పరుశరాముడు కేరళని సృష్టించాకా అతనిని దారుక అనే రాక్షసుడు హింసించసాగాడట. పరశురాముడు శివుడికి తపస్సు చేసిన పిమ్మట అతని ఆదేశానుసారం భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించాడట. ఆ భద్రకాళి అమ్మవారే దారుకుడిని సంహరించి ఆ ప్రాంతం అంతటిని కాపాడుతూ ఉంటానని అభయమిచ్చిందట.

 

 


జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ ఆలయంలో పంచ శ్రీచక్రాలని ప్రతిష్టించారట. ఈ స్థలం ఇంతటి శక్తి సంతరించుకోటానికి కారణం ఆ శ్రీచక్రాలేనని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఏడు అడుగుల ఎత్తు ఉండే అమ్మవారి మూలవిరాట్టు విగ్రహాన్ని పనస చెట్టు కలపతో చెక్కారని స్థలపురాణం చెపుతోంది. విశాలంగా పది ఎకరాలలో విస్తరించబడిన ఈ ఆలయంలో సప్తమాతృకల ఆలయాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. మూలవిరాట్టుతో పాటు అన్ని విగ్రహాలు ఉత్తరముఖంగా ఉండటం ఈ ఆలయం యొక్క మరో విశేషం.


ఇదే ఆలయ ప్రాంగణంలో పొంగు, అమ్మవార్లు వంటి అంటువ్యాధులను దూరం చేసే వాసురి మాత విగ్రహం కూడా ఉంది. ఈ అమ్మవారిని పసుపుతో పూజిస్తారు. ఆలయానికి యాభై మీటర్ల దూరంలో పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి అమ్మవారు తన ఖడ్గం నేల మీదకి విసరటంతో ఏర్పడిందని చెపుతారు. కాళికామాతని దర్శించుకునే వారు ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి తరువాతే దర్శనానికి గుడిలోకి ప్రవేశిస్తారట.

 


ఇక ఉత్సవాల విషయానికి వస్తే కుంభ మాసం అంటే మార్చ్ ఏప్రిల్ నెలల్లో జరిగే భరణి ఉత్సవం వారం రోజులపాటు ఎంతో వైభవంగా జరుగుతుంది. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి వేలాది  కోళ్ళను బలి ఇస్తారు. ఈ ఉత్సవం జరిగే రోజుల్లో స్వర్ణకారుల వంసపారంపర్య వ్యక్తులు గర్భగుడిలో పూజలు నిర్వహిస్తారు. ఈ భరణి ఉత్సవంలో భక్తులు ఎర్రటి దీక్షా వస్త్రాలు కట్టుకుని పెద్ద కత్తులు చేత పట్టుకుని వీదుల్లో అరుచుకుంటూ పూనకంతో పరుగులు తీస్తారు. అలవాటు లేనివారు ఇదంతా చూసి భయపడతారు కూడా.  ఇక జనవరి ఫిబ్రవరి మాసాల్లో జరిగే తలప్పొలి ఉత్సవంలో ఏనుగులని ఎంతో అందంగా అలంకరించి  శోభాయమానంగా ఊరేగిస్తారు.

ఇన్ని విశేషాలున్న ఇలాంటి ఆలయాన్ని దర్శిస్తే ఆ కాళికా మాత  అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుంది.

 

...కళ్యాణి