నారాయణుడి భక్తుడు.. దేవఋషి.. నారద జయంతి ఈరోజే..!

 

 

నారాయణుడి భక్తుడు.. దేవఋషి.. నారద జయంతి ఈరోజే..!

 

పురాణ గ్రంథాలు చదువుతున్నప్పుడు,  పౌరాణిక సినిమాలు చూస్తున్నప్పుడు వాటిలో లోక కళ్యాణం కోసం మూడు లోకాలలోనూ సంచరిస్తూ విషయాలను చేరవేస్తూ కనిపించే దేవ ముని నారదుడు. శాస్త్రాలలో, నారద మునిని దేవ ఋషిగా,  బ్రహ్మ మానసపుత్రుడిగా వర్ణించారు. ఆయనకు 'దేవర్షి' అనే బిరుదు లభించింది. వారు మూడు లోకాలలోనూ  సంచరిస్తూ ఉంటారు. దేవతలు, రాక్షసులు, ఋషులు,  మానవుల మధ్య సమాచార మాధ్యమంగా మారతారు. నారద మువి చేతుల్లో వీణ ఉంటుంది.   ఆయన  ఎల్లప్పుడూ "నారాయణ, నారాయణ" అని పలుకుతూ ఉంటారు.  అందుకే నారదుడు గొప్ప నారాయణ భక్తుడిగా  పరిగణించబడ్డాడు. నారాయణుడి కీర్తనలు, స్తుతులు పాడుతూ,  తన వీణ వాయిస్తూ తన్మయత్వంలో ఉంటారు. మే 13వ తేదీ నారద జయంతి.  ఈ సందర్భంగా నారద ముని గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే..

పౌరాణిక సందర్భాలలో..

మహాభారతం, రామాయణం, భాగవతం, శివ పురాణం వంటి అనేక గ్రంథాలలో నారద మహర్షి పేరు కనిపిస్తుంది. వాల్మీకి రామాయణం ప్రకారం ఈ భూమిపై నియమాలను పాటించే, మతపరమైన,  అన్ని సద్గుణాలు కలిగిన వ్యక్తి ఎవరు అనే ప్రశ్న వాల్మీకి మనస్సులో తలెత్తినప్పుడు ఆయనకు  రాముడి కథను చెప్పినది నారద మహర్షి. అది  రామాయణం రాయడానికి ప్రేరేపించింది.

భాగవత పురాణంలో నారద మహర్షి ఒకసారి తన పూర్వ జన్మ కథను వివరిస్తాడని, అక్కడ అతను ఒక పనిమనిషి కొడుకుగా ఉండి, బాల్యంలో ఋషులకు సేవ చేయడం ద్వారా సాధువుల సహవాసం పొందాడని ప్రస్తావించబడింది.  ఇందువల్ల నారదుని మనస్సు విష్ణువు పట్ల భక్తిలో మునిగిపోయింది. మరణానంతరం ఆయన విష్ణులోకానికి వెళ్లి తరువాతి జన్మలో దేవర్షి నారదునిగా అవతరించాడట.

నారద జయంతి..

నారద జయంతి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని కృష్ణ పక్షం ప్రతిపద తిథి నాడు జరుపుకుంటారు. 2025 సంవత్సరంలో మే 13న జరుపుకుంటారు. ఈ రోజు నారద ముని జ్ఞాపకార్థం భక్తి, సంభాషణ,  మత ప్రచారం యొక్క ప్రతిజ్ఞతో జరుపుకుంటారు.

ప్రాముఖ్యత..

నారద ముని లోక కళ్యాణం కోసమే జీవించారు.  ఆయన ఒక దగ్గర జరిగిన సంఘటనలు మరొక దగ్గర చెప్పడం అనేది పూర్తీగా లోక కళ్యాణం కోసం.  మూడు లోకాలలో మంచి జరగడం కోసమే.. భక్తి మార్గాన్ని ప్రచారం చేసిన గొప్ప ప్రచారకుడు కూడా నారద ముని అని అంటారు పండితులు.

నారద జయంతి రోజు ఎలా పూజ చేయాలి?

నారద జయంతి రోజు ఉదయం పూజ చేయలేని వారు.. సాయంత్రం అయినా పూజ చేయవచ్చు.  సాయంత్రం స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించాలి.  పూజ గదిలో నారదుడి విగ్రహం లేదా పటం ఏర్పాటు చేసుకోవచ్చు. లేనిపక్షంలో విష్ణు భక్తుడిగా నారదుడిని మనసులోనే ప్రతిష్టించుకోవచ్చు. ధూపం, దీపం, నైవేద్యం,  పువ్వులు మొదలైనవి సమర్పించిన తరువాత   నారదుడికి కీర్తనలు, భజనలు అంటే ఇష్టం కాబట్టి .. ఈ రోజు నారాయణుకి సంబంధించిన మధురమైన కీర్తనలు, స్త్రోత్రాలు, శ్లోకాలు పఠించాలి. ఇలా చేస్తే ఆ నారాయణుడి అనుగ్రహం,  నారదుడి ఆశీర్వాదం కూడా లభిస్తాయి.


                                   *రూపశ్రీ.