Read more!

దేవుడు రాసిన ఉత్తరం... (God's Letter)

 

దేవుడు రాసిన ఉత్తరం...

(God's Letter)

 

అదొక పల్లెటూరు. ఆవేళ అందరూ కనకయ్య గురించే మాట్లాడుకుంటున్నారు. విశేషం ఏమిటంటే... దేవుడు కనకయ్య పేరుతో ఉత్తరం రాశాడట. మూఢ భక్తులు కానివాళ్ళు, పిచ్చి నమ్మకాలు లేనివాళ్ళు కూడా ఆ ఉత్తరాన్ని నమ్మారు. అందుకు కారణం లేకపోలేదు. అది పెన్నుతోనో, పెన్సిలుతోనో రాసిన ఉత్తరం కాదు. పోనీ, పెయింటుతోనో, రక్తంతోనో రాసినది కూడా కాదు. అసలు దేనితో రాసిందీ బోధపడలేదు. పైగా కాగితాన్ని నీళ్ళలో వేస్తేనే అక్షరాలు కనపడుతున్నాయి. అక్షరాలు మాత్రం ముత్యాల సరాల్లా, గుండ్రంగా ఉన్నాయి. ''ఇంత అందమైన దస్తూరి మనుషులకు కాదుకదా, దేవుళ్ళకు కూడా సాధ్యం కాదు, దేవతలే కుదురుగా కూర్చుని.. అంటే ఏ లక్ష్మీదేవో, కనకదుర్గమ్మో రాసి ఉండాలి'' అన్నాడు రంగయ్య.

ఇంతకీ, ఆ కాగితంలో ఏం రాసి ఉందంటే, ''ఒరేయ్, కనకయ్యా! నీకు ఇంత ఆస్తి ఇచ్చింది, దాచుకోడానికేనా? అసలు నీకు తృప్తి అనేది లేదా? నువ్వు తక్షణం కొంత ఆస్తిని పేదలకు పంచిపెట్టు. నువ్వే కాదు, ఊళ్ళో తరగని ఆస్తులు కూడబెడుతున్న నీ తోటి తిమింగలాలకి కూడా ఈ లేఖ చూపించు.. మీరంతా మీ ఆస్తులను గనుక పంచిపెట్టకపోతే, పాట్లు తప్పవు.. ఇట్లు మీ దేవుడు''

అదీ సారాంశం. కనకయ్య, అతనిలాగే వందల ఎకరాలు ఉన్న పుల్లయ్య తదితరులు ఈ లేఖ చూసి హడలిపోయారు, కుంగిపోయారు.

''అసలీ ఉత్తరం ఎవరిచ్చారు?'' ఒణుకుతున్న స్వరంతో అడిగాడు రామయ్య.

''పొద్దున్నే నిద్రమత్తు వీడకుండానే ఆకాశవాణి చెప్పింది- ''గుమ్మంలో లేఖ ఉంది, దాన్ని నీళ్ళలో వేయమని..''

''ఆకాశవాణా? దూరదర్శన్ కాదూ?!” అన్నాడు పట్నంలో చదువుకుంటున్న పరమేశం.

''ఊరుకోరా బాబూ, దేవుళ్లమీద పరాచికాలే?''

''ఛట్, ఊరుకోండి.. ఇదంతా నాన్సెన్స్..''

''కళ్ళు పోతాయిరోయ్..'' ''ఏం పోవు.. ఇదంతా ఏదో కుట్రలా ఉంది.. దేవుడేంటి.. ఉత్తరాలు రాయడమేంటి?''

''పెద్ద మొనగాడిలా మాట్లాడుతున్నావు.. అయితే, నువ్వు రాయరా.. యే ఇంకుతో రాసినా నీళ్ళలో వేస్తే చెరిగిపోతుంది.. అలాంటిది, ఈ కాగితంలో ఉన్న అక్షరాలు విడిగా కనిపించడం లేదు, నీళ్ళలోనే కనిపిస్తున్నాయి..''

''నాకు ఒకరోజు టైం ఇవ్వండి.. దీని వెనక ఉన్న రహస్యం ఏమిటో కనిపెడతాను'' స్థిరంగా అన్నాడు పరమేశం.

అన్నదే తడవుగా పరమేశం పట్నం వెళ్ళాడు. సైన్సులో దిట్టలైన ఇద్దరు టీచర్లను కలిసి ఆ కాగితం చూపించాడు. వాళ్ళు తమకు తోచిన కోణాల్లో ఆలోచించారు. తమకు తెలిసిన మరో సైంటిస్టును సంప్రదించారు.

చివరికి విషయం తేటతెల్లమైంది. స్వయంగా వాళ్ళు ఆ ప్రయోగం చేసి మరీ చూశారు.

ఆలం క్రిస్టల్ను (Alum Crystal) నిమ్మరసంలో కలిపి, ఆ ద్రావకంతో కాగితం మీద రాస్తే, అవి మామూలుగా కనిపించవు. కానీ ఆ కాగితాన్ని నీళ్ళలో వేస్తే రాసిన అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి.

పరమేశం అసలు సంగతి చెప్పడంతో విషయం అర్ధమయింది. అసలు కనకయ్యకు ఈ ఉత్తరం రాయాల్సిన అవసరం ఎవరికొచ్చింది, ఎందుకు రాసినట్టు.. అనే కోణంలో ఆలోచించారు.

అప్పుడప్పుడే సోషలిస్టు భావజాలాన్ని అలవరచుకుంటున్న అభ్యుదయ కవి చర్యగా అర్ధమయింది. అతనికి దేహశుద్ధి చేద్దాం అనుకున్నారు కానీ, లేఖ రాయడంలో కవి ఉపయోగించిన చాతుర్యాన్ని, పేదలు కూడా బాగుండాలనే అతని తపనని దృష్టిలో పెట్టుకుని మిన్నకుండిపోయారు.