Read more!

కప్పలతో వానలు కురుస్తాయా? (Frogs and rain)

 

నమ్మలేని నిజాలు ( Mysteries & Miracles)

కప్పలతో వానలు కురుస్తాయా? (Frogs and rain)

 

వర్షాకాలం వచ్చేసినా వానల జాడ పెద్దగా లేదు. ఉద్యోగాలు చేసేవాళ్ళకి వర్షాభావం గురించి అంతగా తెలీదు. కానీ, రైతులకయితే వాన నీళ్ళు లేకపోతే కన్నీళ్ళు కాలువలు కట్టడం ఖాయం. నారు పోసేటప్పుడు తొలకరి వానలు, పైరు పెరిగేటప్పుడు, వివిధ దశల్లో భారీ వర్షాలు అవసరం. ఏ దశలో వానలు కరువైనా పంటలు పండవు.

వర్షాధారమైన భూముల్లో వానలు పడకపోతే చాలా కష్టం. కాలువ నీళ్ళు లేదా బావి నీళ్ళతో అవసరం తీరదు. మరి అప్పుడు రైతులు ఏం చేస్తారు? మేఘ మధనం అంటే అది రైతులవల్ల అయ్యే పని కాదు. ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉంటుంది. యజ్ఞయాగాదులు అంటే అది కూడా రైతులకు సాధ్యమయ్యే పని కాదు. యజ్ఞాలకు ఖర్చవుతుంది కనుక పండితుల సాయంతో ధనికులు చేయగల పని.

మరి, వర్షాలకోసం రైతులు ఎలా ప్రయత్నిస్తారంటే... తమకు తెలిసిన, తమకు చేతనైన పని చేస్తారు. అదే, కప్పలకు పెళ్ళి చేయడం. ఇది వినడానికి చాలా గమ్మత్తుగా ఉంటుంది. కప్పల పెళ్ళి చేస్తే వాన పడటం ఏమిటి అని ముక్కున వేలేసుకుంటాం. కానీ, ఇలా అని హాస్యాస్పదం చేస్తే మట్టుకు రైతన్నలకు కోపం ముంచుకొస్తుంది.

పల్లెవాసులకు కప్పలమీద గట్టి నమ్మకం. కప్పలకు, వర్షానికి అవినాభావ సంబంధం ఉందని ప్రగాఢ విశ్వాసం. వాగులోనో చెరువులోనో ఒక పెద్ద కప్పను పట్టుకుంటారు. దాన్ని ఒక కర్రకు కట్టేసి ఇద్దరు కుర్రాళ్ళు కర్రను అటు చివర ఒకరు, ఇటు చివర ఒకరు పట్టుకుంటారు. వాళ్లిద్దరూ ముందు నడుస్తుంటే, వెనక అనేకమంది తరలివెళ్తారు.

''వానల్లు కురవాలి వానదేవుడా!

కప్పల్లు తడవాలి వానదేవుడా

చెరువుల్లు నిండాలి వానదేవుడా

పంటల్లు పండాలి వానదేవుడా...''

అని పాట పాడుతూ ఇంటింటి ముందూ ఆగుతారు. ఆగినప్పుడల్లా, ఆ ఇంటివాళ్ళు కప్ప మీద కొన్ని నీళ్ళు పోస్తారు. అలా కప్పను ఊరేగిస్తూ ఊరంతా తిరుగుతారు. వరుణదేవుని ప్రార్థిస్తూ తిరగడంవల్ల, కప్పను తడపడం వల్ల వర్షాలు పడతాయనడమే కాకుండా అలా పడిన ఉదంతాలను చెప్పి, ఇది కేవలం నమ్మకం కాదని, వాన పడితీరుతుందని చెప్తారు రైతులు.

కొన్ని ఊళ్ళలో కప్పలకు పెళ్ళి చేస్తే వర్షాలు కురుస్తాయని నమ్మకం ఉంది. మన రాష్ట్రంలోనే కాకుండా నాగపూర్ లాంటి అనేక ప్రాంతాల్లో కప్పలకు పెళ్ళి చేసే సంప్రదాయం ఉంది. కప్పలకు పెళ్ళి చేస్తే వరుణదేవుడు సంతోషిస్తాడని, రుతుపవనాలను పంపిస్తాడని నమ్ముతారు. దాంతో చాలామంది ఇప్పటికే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.

ఈ వింత ఆచారం గురించి మీకు తెలుసా? ఇందులో ఎంత నిజం ఉంది? మీ అభిప్రాయం రాయండి.