Read more!

మే 22 మోహిని ఏకాదశి… ఈ రోజు ఏం చేయాలంటే!

 

మే 22 మోహిని ఏకాదశి… ఈ రోజు ఏం చేయాలంటే! 

హైందవ కాలమానంలో ప్రతి ఏకాదశి తిథీ విశిష్టమే. పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశి అయినా, అమావాస్యకి ముందుగా వచ్చే బహుళపక్ష ఏకాదశి అయినా… ప్రతి ఏకాదశి రోజూ ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరుతుంది. అలా వైశాఖ శుక్ల ఏకాదశి అంటే ‘మే 22’న వచ్చే ఏకాదశి తిథికి ‘మోహినీ ఏకాదశి’ అని పేరు. ఇంతకీ ఈ పేరు వెనుక విశిష్టత ఏమిటో, ఈ రోజున ఆచరించాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందాం… 

అది దేవతలు, రాక్షసులు ఇద్దరూ కూడా సమానమైన బలవంతులుగా ఉన్న సమయం. రాక్షస ప్రవృత్తి ఉన్న దానవుల వల్ల సమస్త లోకాలూ బాధలకు గురవుతున్నాయి. వారిని ఎదుర్కొనే ధైర్యం దేవతలకు లేకపోయింది. దాంతో వారికి విష్ణుమూర్తి ఓ ఉపాయాన్ని సూచించాడు. క్షీరసాగరమథనం కనుక చేస్తే, దాని నుంచి అమృతం ఉద్భవిస్తుందనీ… అది సేవించిన దేవతలు మరణమనేది లేకుండా, దానవుల మీద పైచేయి సాధించగలరనీ చెప్పాడు. 

క్షీరసాగరాన్ని చిలికేందుకు మందర అనే పర్వతాన్ని కవ్వంగా మలచి, వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి మథనం ప్రారంభించారు. వాటిలో కౌస్తుభం, కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం, హాలాహలం… లాంటివన్నీ ఉద్భవించిన తర్వాత చివరికి అమృతం వెలువడింది. 

ఈ మథనంలో దేవతలూ, రాక్షసులూ సమానంగా పాలుపంచుకున్నారు కాబట్టి ఇద్దరూ అమృతం పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కనుక జరిగితే సముద్రమథనం వెనుక ఉన్న ప్రయోజనం నెరవేరదు కదా! అందుకని సాక్షాత్తు విష్ణుమూర్తే రంగంలోకి దిగాడు. ఎంతటివాడికైనా కళ్లు చెదిరిపోయే అందంతో మోహిని అవతారం ధరించాడు. 

మోహిని రూపంలోని విష్ణుమూర్తి తన హొయలతో రాక్షసులను ఏమార్చి, దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించి మాయమైపోయాడు. ఈ మోహిని రూపాన్ని చూసి సాక్షాత్తు పరమశివుని మనసే చలించిపోయిందనీ… అలా ఆ హరిహరులను జన్మించినవాడే అయ్యప్పస్వామి అనీ చెబుతారు. విష్ణుమూర్తి రూపాలలో ఒకటి అయిన ఈ మోహినీదేవికి తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలి అనే ఊరిలో ప్రత్యేకమైన ఆలయం కూడా ఉండటం విశేషం. ఇంతకీ ఈ మోహిని అవతరించింది మోహినీ ఏకాదశి రోజునే! 

వైశాఖమాసం అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. అందులోనూ ఆయనకు ప్రతిరూపమైన మోహినీదేవి అవతరించిన సందర్భం. కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మన రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఆత్మక్షోభ వరకు సకల బాధలకూ ఈరోజు చేసే ఏకాదశి వ్రతం ఉపశమనం కలిగించి తీరుతుంది. 

మోహినీ ఏకాదశి రోజు చాలామంది ముందు రోజు రాత్రి అంతే దశమి రాత్రి నుంచే ఉపవాసం మొదలుపెట్టి, మర్నాడు… అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారమూ తీసుకోకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తారు. ఇవాల్టి ఆరోగ్య పరిస్థితులను బట్టి, అంతటి కఠినమైన ఉపవాస ఆచరణ కష్టం కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకుండా పండ్లు, పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం చేయవచ్చు. ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ నిద్రించరాని శాస్త్రం. 

ఈ రోజు అభ్యంగన స్నానం చేయాలనీ, విష్ణుమూర్తిని ధూపదీపనైవేద్యాలతో పూజించాలనీ, ఉపవాసంతో రోజును గడపాలనీ, దానధర్మాలు చేయాలని పెద్దలు చెబుతారు. ఇవన్నీ కుదరకపోయినా… కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నం చేయాలి. తన మోహిని అవతారంతో ఎలాగైతే ఈ లోకానికి క్షేమంగా మారాడో… అలా మన కష్టాలన్నీ తీర్చమంటూ వేడుకోవాలి. 

- మణి