కాలభైరవాష్టమి అంటే ఏమిటి? ఆ రోజు ఏం చేయాలి!

 

కాలభైరవాష్టమి అంటే ఏమిటి? ఆ రోజు ఏం చేయాలి! 

 

హైందవ దేవతలలో శివుడు, విష్ణుమూర్తులే కాదు… వారి అంశగా అవతరించిన ఎందరో శక్తులకు తగిన ప్రాధాన్యత ఉంది. అలాంటి ఓ విశిష్టమైన దేవతే కాలభైరవుడు. ఈ కాలభైరవుడు కృష్ణ పక్ష అష్టమినాడు అవతరించాడని అంటారు. అందుకని ప్రతి మాసంలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమినాడు ‘కాలభైరవాష్టమి’గా భావించి ఆయన్ను పూజించి, ఆ స్వామి అనుగ్రహాన్ని అందుకుంటారు. ఇంతకీ ఈ కాలభైరవుని ప్రత్యేకత ఏమిటి? కాలభైరవాష్టమి రోజున ఏం చేయాలి? తెలుసుకుందాం… 

పరమేశ్వరుని ఉగ్రరూపమే కాలభైరవుడు. కొందరి నమ్మకం ప్రకారం… సృష్టి, స్థితి, లయలు మూడింటికీ కూడా ఆ కాలభైరవుడే కారణం. దుష్టులను సంహరించడం కోసమూ, సమస్యలను నిర్వీర్యం చేయడం కోసమే ఆయన ఉగ్రరూపం ధరించారని చెబుతారు. ఒక సమయంలో ఆ బ్రహ్మదేవుడు, త్రిమూర్తులందరిలోకీ తానే గొప్ప అని భావించాడట. తనకి బ్రహ్మవిద్య తెలుసు కాబట్టి, జీవులను సృష్టిస్తాను కాబట్టి… తనే అధికుడినని గర్వించాడట. ఆ గర్వంలోనే మహాశివుని చులకనగా చూశాడు. దాంతో పరమేశ్వరుడు కోపించి కాలభైరవుడిని సృష్టించాడు. ఆ కాలభైరవుడు బ్రహ్మదేవుని ఐదవ తలను ఖండించాడు. దాంతో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. కాలభైరవుని ఆరాధనతో మనలోని గర్వం కూడా అణిగిపోతుందని, ఈ ఉదంతంలోని అంతర్గత బోధ. 

కాలబైవుడిని అష్టభైరవ రూపాలలోనూ, 64 రూపాలలోనూ కొలిచే సంప్రదాయం కూడా ఉంది. చాలా శైవక్షేత్రాలలో, కాలభైరవుడే క్షేత్రపాలకునిగా ఉంటాడు. వారణాసి, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాలలో… ఈ స్వామికి ఉన్న విశిష్టత అంతాఇంతా కాదు. శునకం వాహనంగా, నాగులు చెవిపోగులుగా, పులి చర్మం అంబరంగా కనిపించే ఈ భైరవుడు ఉగ్రమూర్తే కానీ… భక్తుల పాలిట శుభంకరుడు. 

కాలభైరవుని పూజిస్తే రుణబాధలు, దారిద్ర్యబాధలు, అనారోగ్యం లాంటి సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మకం. కొన్ని గ్రంథాల ప్రకారం బుధవారం పూట కాలభైరవుని పూజిస్తే మంచిది. అదృష్టవశాత్తు ఈసారి కాలభైరవాష్టమి బుధవారం (జూన్‌ 2)న రావడం విశేషం. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలార స్నానం చేసి కాలభైరవుని లేదా శివుని పూజించి, ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. మరికొందరు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రివేళ జాగరణ కూడా చేస్తారు. కాలభైరవునికి అర్ధరాత్రి ఆరాధన అంటే ప్రతి అని చెబుతారు. అందుకని కొన్ని క్షేత్రాలలో ఈ స్వామిని రాత్రివేళ పూజిస్తారు. అందుకని, రాత్రివేళ జాగరణ ఉండి, ఆర్ధరాత్రి ఆ స్వామిని కొలుచుకునే ప్రయత్నం చేస్తారు కొందరు. 

ఈ రోజున కాలభైరవుడు ఉన్న గుడికి వెళ్లి, అక్కడి స్వామిని నేతి దీపాలు వెలిగించి, కలకండను నివేదించినా మంచి జరుగుతుంది. ఇవేమీ కుదరకపోయినా… ఈ రోజు కాలభైరవ స్తోత్రం వంటి స్తోత్రాలు చదువుకున్నా స్వామి అనుగ్రహం విశేషంగా లభిస్తుంది.
 

- మణి.