మౌని అమావాస్య ఎప్పుడు... ఈ రోజు తప్పకుండా చేయాల్సిన పనేంటంటే..!
మౌని అమావాస్య ఎప్పుడు... ఈ రోజు తప్పకుండా చేయాల్సిన పనేంటంటే..!
తెలుగు పంచాంగంలో కొన్ని తిథులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా నెలకు ఒకసారి వచ్చే అమావాస్య, పౌర్ణమి తిథులకు చాలా ప్రాముఖ్యత ఉంది. అమానాస్య తిథి నెగిటివ్ శక్తులను నింపుకుని ఉంటుందని అంటారు. అందుకే ఈ రోజు ఏ శుభకార్యాలు చేయరు, ప్రయాణాలు ఆపుకుంటారు, కొందరు అమావాస్య రోజు ప్రత్యేక పరిహారాలు చేసుకుంటారు. అయితే కొన్ని అమావాస్య తిథులు కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా జనవరి నెలలో రాబోతున్న మౌని అమావాస్యకు ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఏం చేస్తే మంచిది? ఈ రోజు చేయాల్సిన పనులేంటి? తెలుసుకుంటే..
ప్రస్తుతం కుంభమేళా జరుగుతోంది. ఈ కుంభమేళా రోజులలో వచ్చిన అమావాస్య అయిన మౌని అమావాస్యకు ప్రాముఖ్యత ఉంది. మౌని అమావాస్య రోజు గంగానదిలో స్నానం చేయడం చాలా పవిత్రం. గంగానదిలో స్నానం చేసి ధ్యానం చేసి, శివుడిని పూజించాలి. గంగానది స్నానం వల్ల తెలిసీ తెలియక చేసిన పాపాలు ఉంటే అవన్నీ నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. అంతే కాదు.. ఈ మౌని అమావాస్య సందర్భంగా కొన్ని యోగాలు ఏర్పడుతున్నాయి. ఇవి కొందరి జీవితాలను మలుపు తిప్పుతాయని అంటున్నారు.
శివాసన యోగం..
మౌని అమావాస్య రోజు శివాసన యోగం ఏర్పడుతోందట. ఇది చాలా అరుదైన యోగం అని అంటున్నారు. మత విశ్వాసం ప్రకారం ఈ రోజు పరమేశ్వరుడు గౌరీ దేవితో కలసి కైలాసం మీద ఆసీనుడు అవుతాడట.
సిద్ది యోగం..
మౌని అమావాస్య రోజు సిద్ద యోగం కూడా ఏర్పడుతోందట. ఇది యాదృశ్చికంగా జరుగుతుంది. రాత్రి 09.22 నిమిషాల వరకు ఈ సిద్దియోగం జరుగుతుందట. జ్యోతిషశాస్త్రంలో సిద్ది యోగం అనేది చాలా శుభప్రదమైనదట. ఈ యోగం లో శివుడిని ఆరాధిస్తే సాధకుడి ప్రతి కోరిక నెరవేరుతుందని పురాణ కథనాలు చెబుతున్నాయి. శ్రావణ, ఉత్తరాషాడ నక్షత్రాల కలయిక కూడా ఇదే రోజు జరుగుతోంది. ఈ సందర్భంగా శివుడిని పూజించడం వల్ల అంతా శుభమే జరుగుతుందట.
ఈ రోజు ఏం చేయాలంటే..
మౌని అమావాస్య రోజు పవిత్ర నదులలో స్నానం చేయాలి. గంగా స్నానం అయితే మరీ మంచిది. నదుల దగ్గరకు వెళ్లలేని వారు బోరు బావుల దగ్గర అయినా నదీ స్నాన మంత్రం పఠిస్తూ స్నానం చేయాలి. కుదరని వారు గంగా జలాన్ని బకెట్ నీళ్లలో కలుపుకుని స్నానం చేయాలి.
మౌని అమావాస్య రోజు శివుడిని మాత్రమే కాకుండా శ్రీమహావిష్ణువును, గంగామాతను, లక్ష్మీదేవిని పూజించాలి.
మౌని అమావాస్య రోజు మౌన వ్రతం చేస్తే చాలా మంచిది. రోజు మొత్తం ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి.
మౌని అమావాస్య రోజు సాయంత్రం తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఇది తులసి అనుగ్రహాన్ని చేకూరుస్తుంది.
మౌని అమావాస్య రోజు అన్నం, బట్టలు, డబ్బు, అవసరమైన వస్తువులు, ఆవులకు ఆహారం పెట్టడం.. మొదలైనవి చేయాలి. ఇలా చేస్తే పుణ్యం లభిస్తుంది. పితృదేవతలు సంతోషిస్తారు.
మౌని అమావాస్య రోజు సూర్య భగవానుడికి తప్పకుండా అర్ఘ్యం సమర్పించాలి. ఇది సూర్య దేవుని అనుగ్రహానికి సహాయపడుతుంది.
పితృదేవతల ఆరాధనకు, వారి అనుగ్రహానికి అమావాస్య తిథి చాలా మంచిది. ఈ రోజు " ఓం పితృదేవతాయై నమః" అనే మంత్రాన్ని కనీస 11 సార్లు జపించడం వల్ల పితృదేవతలు తృప్తి పడతారు.
ఏం చేయకూడదు..
మౌని అమావాస్య రోజు ఎవరిమీద ఎలాంటి ద్వేషం పెట్టుకోకూడదు. ఎవరితోనూ గొడవ పడకూడదు.
మద్యం, మాంసం అలవాటు ఉన్నవారు ఈ మౌని అమావాస్య రోజు వాటికి దూరంగా ఉండాలి. ఈ రోజు ఎవరితోనూ వాగ్వాదాలు చేయకూడదు.
బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి, అర్ఘ్యం సమర్పించడం మంచిది. తెల్లవారుజాము వరకు నిద్రపోకూడదు.
అబద్దాలు ఆడటం, ఇతరులను మోసం చేయడం వంటి పనులు చేయకూడదు. ఇది పాపాన్ని పెంచుతుంది.
మౌని అమావాస్య రోజు జుట్టు కత్తిరింతడం, గోళ్లు కత్తిరించడం వంటివి చేయకూడదు.
అన్నింటి కంటే ముఖ్యంగా మౌని అమావాస్య రోజున తులసి మొక్కకు నీరు సమర్పించకూడదట.
*రూపశ్రీ.