Read more!

మహిషుడిపై మహామాయ దండెత్తుట

 

సాయుధయై స్వరా౦గాలంకృతయైన శ్రీదేవి వికటాట్టహాసం చేసింది. దానికి అంబరమంతా దద్దరిల్లిపోయింది. భూనభోంతరాళాలు ప్రతిధ్వనించాయి. సాగరాలు అల్లకల్లోలాలయ్యాయి. పృద్వీ కంపి౦చిపోయింది.ఆచలాలన్ని చలించిపోయాయి. అమరుల అపరిమితాన౦ద౦తో శ్రీదేవికి జయజయరావాలు పలికారు. తలలు వంచి మహర్షులందరూ వినయంగా ఆ పరాశక్తిని స్తుతించారు. లోకాలన్నీ అస్తవ్యస్తమై కల్లోలితమవడం చూసి రాక్షసులందరూ శాస్త్రాస్త్రపాణులై యుద్ధం సన్నద్ధులయ్యారు.

అహంకరించిన మహిష రాక్షసుడు హు౦కరి౦చసాగాడు రాక్షస సేనలతో పరివేష్టితుడై ఆ మహాధ్వని వచ్చిన దిశగా మహావేగంగా పురోగమి౦చాడు. దేహచ్చటలతో ముల్లోకాలనూ, మకుట ప్రభలతో గగనతలాన్నీ భాసిల్లజేస్తూ చరణ మహాభారంతో పృద్వీని అణగద్రోక్కుతూన్న శ్రీదేవిని తిలకించాడు మహిషదానవుడు .అమె తన అనంత బాహువులతో దిజ్మండల పర్యంతం వ్యాపించి వుంది. ఇరుసేనలకూ పోరు తీవ్రం కాసాగింది.ఆ సమయ౦లో ఉభయ పక్షాలవారూ ప్రయోగించి శరపరంపరలతో దిగంతాలు అంధకారమయమౌతున్నాయి.

మహిషాసురుని సేనాధిపతి అయిన చిక్షురుడు గజాశ్వ రధపదాతి సేనా పరివేష్టితుడై అపార సైన్యంతో రణరంగంలోకి దూసుకు వచ్చాడు . ఉగ్రుడనే రాక్షససేనా నాయకుడు అనేక రధసైన్యం పరివేష్టించి రాగా యుద్ధరంగంలో ప్రవేశించాడు. అలాగే “మహాహనువు” అనే రాక్షస సేనాధిపతి అగణిత సైన్య పరివేష్టితుడై దేవికి ఎదురై పోర నిలబడ్డాడు. వానితో అసిలోమ భాష్కలాదులు కూడా గజాశ్వసేనలతో మహాదేవికి ఎదురై పోర నిలిచారు. తరువాత బిడాలాక్షాది అసురనాయకులెందరో తమ తమ విశేష సేనలతో పోరు సాగించవచ్చారు. ఆసంఖ్యామైన ఆ సైన్యాలు మహిషాసురునికి అండగా ఉండి మహాదేవితో యుద్ధం చేయ్యసాగాయి. ఆ రాక్షసులు శ్రీదేవిపై తోమర, భి౦దివాల, శక్తి,ముసల,కరవాల,కుఠార, పట్టిసాదిగాగల మహాయుధాలను ప్రయోగిస్తున్నారు. ఒకడు శక్తిని ప్రయోగిస్తూ౦టే వేరొకడు పాశాన్ని ప్రయోగిస్తున్నాడు.తత్సమయంలో రాక్షసహస్త వినిర్ముక్త శస్త్రాస్త్రాలను అన్నింటిని శ్రీదేవి ప్రత్యస్త్రాలను ప్రయోగించి కనురేప్పపాటు కాలంలో మటుమాయం చేస్తుంది.

అదిచూసి మహర్షులూ,దేవతలూ,అందరికందరూ ప్రసన్న హృదయాలతో జగన్మాతను స్తుతించసాగారు. మహామత శాస్త్రాస్త్ర ప్రహారాలతో రాక్షసులను చీల్చి చెండాడుతూన్న సమయంలో కూడా వదన మండలం ఆహ్లాదంగానే ఉంది. పరదేవత వాహనమైన మృగరాజు క్రోధన్మత్తమై జూలు విదిలించసాగింది. భీకరంగా గర్జిస్తూ రాక్షసులపై లఘించసాగింది. శ్రీదేవి క్రోధంతో రాక్షస సమూహాలను ఒక్కుమ్మడి నిర్జిస్తూ నిశ్వసించగా – ఆనిశ్వాసాలనుండి తక్షణమే లక్షలాది ప్రమాథగణాలుద్భవిస్తున్నాయి.ఆ గణాలన్నీ సర్వాయుధాలతో రాక్షస సంహార౦ చెయ్యసాగాయి.ఆ మహారణొత్సవంలో శంఖపటహ మృద౦గాదులను మ్రోగిస్తున్నారు. శ్రీ మహాదేవి శక్తి గదాఖడ్గ త్రిశూల ప్రహారాలతో అసంఖ్యాకంగా అసుర సేనలను అంతం చేయసాగింది .అసంఖ్యాక సేనవాహినిని ఘంటానాదంతో మోహితులను చేసింది.పాశబంధంతో అనేకులను ఆకర్షించి ఖడ్గప్రహారంతో రెండుగా ఖ౦డించసాగింది.గదా ప్రహారాలతో మర్దించి రాక్షసులను భుపతనం చేయ్యసాగింది.

ముసల ప్రయోగంతో రాక్షసులను రక్తం కక్కుకోసాగారు.శూల ప్రహారాలతో హృదయాలు చీలిపోతున్నాయి. ఆ విధంగా రాక్షసులందరి కందరరూ నేలకూలిపోయారు. శ్రీదేవి ధనుర్విముక్త శరపరంపరలకు గురియై వేధి౦పబడిపోతూ అసువులు కోల్పోతున్నారు. ఆ మహాశక్తి హస్తాలలో అసంఖ్యాకుల భుజాలు ఖండింపబడిపోతూన్నాయి. శిరస్సులు ఎగిరిపోతున్నాయి, తెగిన జఘనాలతో, విడిపోయిన ఊరువులతో, పెరికివేయబడ్డ కళ్ళతో , శిధిలాలైపోయిన పాదాలతో, రెండుగా ఖండింపబడిన శరీరాంగాలతో మహిషుని సైనికులు నేల కూలుతున్నారు. దేవి వాహనమైన సింహం కేసరాలను విదిలించి భయంకరంగా గర్జిస్తూ శేషించిన రక్కసి మూకలను ఒక్కుమ్మడిగా కబళించసాగింది.దేవి సేనలు విజ్రు౦భించి రాక్షస సేనలను పిండి చేయ్యసాగాయి.ఆ దృశ్యాన్ని అనంద ప్రసన్న హృదయాలతో తిలకిస్తున్న సురసమూహాలు సుమాలను వర్షింపజేయ్యసాగాయి.

                                                                                                                                                              ఇంకా ఉంది.....