వేశ్య ఇంటి ముందు ఉన్న మట్టితో దుర్గామాత విగ్రహం.. ఈ ఆచారం ఎక్కడంటే..!
వేశ్య ఇంటి ముందు ఉన్న మట్టితో దుర్గామాత విగ్రహం.. ఈ ఆచారం ఎక్కడంటే..!
దేవి నవరాత్రులు దేశం మొత్తం ఎంతో వైభవంగా జరుపుకునే వేడుక. తెలుగు ప్రాంతాలలో తక్కువ కానీ.. ఇతర రాష్ట్రాలలో దేవి నవరాత్రుల సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి పూజించినట్టు దుర్గా దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజిస్తారు. నవరాత్రుల అనంతరం అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో వింత పద్దతి ఉన్నట్టు.. నవరాత్రుల కోసం తయారయ్యే దుర్గమ్మ విగ్రహాల విషయంలో పశ్చిమ బెంగాల్ లో వింత పద్దతి ఉంది. అదే వేశ్యల ఇంటి ముందు ఉన్న మట్టితో దుర్గమ్మ విగ్రహం తయారు చేయడం. వేశ్య అంటేనే అందరూ ముఖం అదోలా పెడతారు. అలాంటి వేశ్య ఇంటి ముందు ఉన్న మట్టిని సేకరించి మరీ దుర్గమ్మ విగ్రహం తయారు చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి? తెలుసుకుంటే..
ఎక్కడ ఉంది ఈ ఆచారం..
పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ బడిందర్ లోని కూమార్ట్లి అనే ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం దుర్గా దేవి విగ్రహాలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది. ఈ ఆచారం 19-20 శతాబ్ధాల మధ్య పుట్టినది కావచ్చని అంటున్నారు. దీనికి సరైన ఆధారాలు ఎక్కడా లేవని కూడా అంటున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న సామాజిక అబివృద్ది, పట్టణీకరణ కారణంగా ఈ ఆచారం కూడా కాస్త తక్కువే ఉందని అంటున్నారు.
వేశ్యల ఇంటి ముందు మట్టి ఎందుకు?
సాంప్రదాయంగా పూజారులు లేదా కూమార్ట్లి కుటుంబాలలో పెద్ద వేశ్య ఇంటి వద్దకు వెళ్లి ఆ వేశ్య ఇంటి ముందు మట్టిని తీసుకుంటానని అనుమతి అడుగుతారట. అలా గౌరవంగా అడిగిన తరువాత వారు ఒప్పుకుంటే అప్పుడు ఆమె ఇంటి ముందు మట్టి తీసుకుంటారట. ఆ మట్టిని గంగానది మట్టిలో కలిపి దానికి గోమూత్రం, ఆవు పేడ వంటి ఇతర పదార్థాలను కలుపుతారు. ఇలా కలిపిన తర్వాత దుర్గా దేవి విగ్రహాన్ని తయారు చేస్తారట.
ఇలా ఎందుకు చేస్తారు..
సాధారణంగా వేశ్య ఇంటికి మగవారు వెళుతుంటారు. అలా వేశ్యల ఇంటికి వెళ్లే మగవారు వారి పుణ్యాన్ని వేశ్య ఇంటి బయట వదిలేస్తారని అంటారు. అంటే దీని అర్థం.. ఇలా వేశ్యల ఇంట్లోకి వెళ్లడం, వేశ్యలను ఆశ్రయించడం అనేది చాలా వరకు అపవిత్రమైన చర్య కింద పరిగణింపబడుతుంది. ఈ నేపథ్యంలో ఒక పురుషుడు తాను సంపాదించిన పుణ్యం అంతా వేశ్య ఇంటి బయట కోల్పోతాడట. అలా.. వేశ్య ఇంటి బయట ప్రాంతం ఎంతో పుణ్యాన్ని నిక్షిప్తం చేసుకుని ఉంటుందని అక్కడి వారి నమ్మకం. అలాంటి మట్టిని దుర్గా దేవి విగ్రహం తయారీలో ఉపయోగిస్తే ఆ విగ్రహం సంపూర్ణతను పొందుతుందట.
ఇక సామాజిక పరంగా చూస్తే.. వేశ్యలను కూడా సమానంగా చూసే కోణంలో ఇలాంటి పద్దతి ఒకటి వచ్చిందని కూడా చెబుతారు. ఏది ఏమైనా దేవతలు, పండుగల విషయంలో ఇలాంటి వింత సంప్రదాయాలు , పద్దతులు చాలా ఆశ్చర్యంగా అనిపించినా స్థానిక కారణాలు మాత్రం తగిన విధంగా ఉంటాయి.
*రూపశ్రీ.