Read more!

Mahavishnu comes to earth on Mukkoti Ekadasi

 

మహావిష్ణువు భువికి ఏతెంచే పుణ్యతిథి ముక్కోటి

Mahavishnu comes to earth on Mukkoti Ekadasi

 

భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రతిరోజూ ఒక పండగే! ప్రతి దినమూ ఒక ఉత్సవమే! సంవత్సరంలోని మూడొందల అరవై రోజులూ ఏదో ఒక విశేషమే కనిపిస్తుంది. ఆ వంకతోనైనా పూజలు చేసి, ఉపవాసాల్లాంటి నియమాలు పాటించి, పవిత్రమైన జీవనవిధానంలో కాలం గడుపుతూ, కొంతకాలానికైనా మానసిక ప్రవర్తనలో ఒక మార్పు కలిగి, ఆధ్యాత్మిక చింతన ఏర్పడి, మానవుడు దానవుడుగా కాక, భక్తి పారవశ్యంతో సంచరించి పరమ పురుషార్ధమైన మోక్షం వైపు పయనిస్తాడని పెద్దల విశ్వాసం. ఆవిధంగా ఏర్పడిందే ఏకాదశి వ్రతం.

 

మన సంవత్సర కాలాన్ని స్థూలంగా ఉత్తరాయణం, దక్షిణాయణం, అని రెండు భాగాలు చేశారు. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు అనువైనదని, ఆ కాలంలో మరణించినవారికి స్వర్గం ప్రాప్తిస్తుందని ఒక నమ్మకం. అంతేకాదు, ఉత్తరాయణం దేవతలకు పగటివేళ అని, దక్షిణాయణం రాత్రికాలమని కూడా అంటారు. అందుకే అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు దక్షిణాయణం లోకి వస్తాయి.

 

విష్ణుమూర్తి ఈ దక్షిణాయణంలో ఆషాఢ శుద్ద ఏకాదశి నుండి యోగనిద్రలో నాలుగు మాసాలు గడుపుతూ లోకం తీరుతెన్నులు పరిశీలిస్తూ ఉంటాడు. అందుకే ఆషాఢ శుద్ద ఏకాదశిని ''శయన ఏకాదశి'' లేదా ''తొలి ఏకాదశి'' అని పిలుస్తారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి ఏకాదశి ఒక పర్వదినమే. సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయి. ఒక్కొక్క మాసానికి శుక్లపక్షంలో ఒకటి, కృష్ణ పక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు ఉంటాయి. అధికమాసం ఉన్న సంవత్సరం అయితే మరో రెండు అదనంగా ఉంటాయి. అప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశి ప్రాముఖ్యాన్ని గూర్చి శంకరుడు పార్వతికి వివరించినట్లు పద్మపురాణం పేర్కొంది. విష్ణువు వైకుంఠం నుండి ముప్పై మూడు కోట్ల దేవతలతో ఈ ఏకాదశి రోజు భూమికి దిగివస్తాడు. కాబట్టి దీనికి ''ముక్కోటి'' అని పేరు వచ్చింది అంటారు.

 

ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, పూజలు, దానధర్మాలు చేసి, భగవన్నామ స్మరణతో కాలం గడుపుతూ రాత్రంతా జాగరణ చేసి, మర్నాడు అంటే, ద్వాదశినాడు ఆ ఘడియలు వెళ్ళకముందే పారణ చేయాలి. ఇది ఒక వ్రాతనియమం. మానవులకు ముక్తి కలిగించాచానికి స్వయంగా విష్ణువే ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేసినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారిలో రుగ్మాంగదుడు, అంబరీషాదులు ముఖ్యులు. ఈ వ్రతానికి సంబంధించిన భవిష్యోత్తరపురాణాదులు ఎన్నో గాధలు, కధలు పేర్కొన్నాయి.

 

ఏకాదశినాడు ముఖ్యంగా ఉపవాసదీక్ష భక్తులు పాటించే ఒక నియమం అసలు ఉపవాసం అంటే ఏమితో చూడండి.. ఉప అంటే భగవంతుని సమీపంలో అని, వాసం అంటే ఉండటం అని అర్ధం. అంటే భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ కాలం గడపడం అన్నమాట. అయితే, ఆరోగ్యరీత్యానో, వయోభారం చేతనో కొంతమంది ఆహారం తీసుకొనక ఉపవాసం ఉండలేక పోవచ్చు. వారికి ప్రత్యామ్నాయంగా వాయుపురాణం -

 

'సక్తం హవిష్యాన్న మనోదనం వా

ఫలంతిలాః క్షీరమధాంబుచాజ్యం

యత్పంచగవ్యం యదివాపి వాయు

ప్రశస్త మంత్రోత్తర ముత్తరం చ'

అని పేర్కొంది.

 

ఉపవాసం చేయలేనివారు నీరు, పాలు, నువ్వులు, పండ్లు తినవచ్చు. లేదా ఉడకని పదార్ధాలు లేదా హనిశ్యాన్నం భుజించవచ్చు. అది కూడా చేతకాని వారు సక్తభోజనం అంటే రాత్రిపూట భోజనం చేయవచ్చు. అయితే ఏకాదశి నాడు భుజిస్తే చాంద్రాయణ వ్రతం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకోవాలని శాస్త్రం చెప్తున్నది.

 

''మాసానాం మార్గశీర్షోహం'' అన్నాడు గీతాచార్యుడు. అందుకే ఈ మాసంలో వచ్చే మొదటి ఏకాదశికి ఒక ప్రాముఖ్యం ఏర్పడింది. మార్గశిర సుద్ద ఏకాదశిని మొక్శైక ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. దీన్నే హరిదినమని, వైకుంఠ దినమని అంటారు. ఇది ఉత్తరాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుడిణి చుట్టుముట్టిన చీకట్లు పటాపంచలై ఆయనకు మోక్షం అంటే విముక్తి కలగడంవల్ల దీన్ని మోక్ష ఏకాదశి అన్నారు.

 

వాస్తవానికి కాలగమనంలో తెలుగువారిది చాంద్రమానం. అయితే ముక్కోటి సౌరమానం ప్రకారం జరుపుకునే పండుగలు, ధనుస్సంక్రమణం తర్వాత వచ్చే ఏకాదశి ఇది. సాధారణంగా ఈ పండుగ మార్గశిరంలో కానీ పుష్యంలో కానీ వస్తుంది. దక్షిణాయణం వెళ్ళిపోతుంది కాబట్టి రాత్రిపోయి పగలు వస్తుంది. అందుకే విష్ణువు వైకుంఠం నుండి ముప్పై మూడు కోట్ల దేవతలతో ఈరోజు భూమికి దిగివస్తాడు. కాబట్టి దీనికి 'ముక్కోటి' అని పేరు వచ్చిందని అంటారు. 33 కోట్లను మూడు కోట్లు అనే పదం సూచిస్తుంది. దానికి సూచనగా విష్ణు ఆలయంలో ఉత్తరద్వారం తెరుస్తారు. దీనికి వైకుంఠద్వారం అని పేరు.

 

సూర్యుడు ఉత్తరాయన ప్రవేశాన్ని వైకుంఠ ద్వారం తెరవడం ద్వారా సూచిస్తారు. తెల్లవారుజామున దీనిగుండా వెళ్లినవారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములు అందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు స్వర్గంలో ప్రవేశిస్తారని ఒక విశ్వాసం. ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమానం. ఈనాడు విష్ణుమూర్తి మురాసుర సంహారం చేసాడని, శ్రీరంగ క్షేత్రంలో విభీషణుడు వచ్చి ఆ స్వామిని పూజిస్తాడని చెప్తారు. హిందువులందరూ ముక్కోటి ఏకాదశిని భక్తిశ్రద్ధలతో పాటించడం గమనించదగ్గ ఒక విశేషం.

 

Mahavishnu and Mukkoti Ekadasi, auspicious Mukkoti Ekadasi, hindu festival Mukkoti Ekadasi, murasura killed on Mukkoti Ekadasi, Mukkoti Ekadasi and vaikuntham