Read more!

Swamiye Saranam Ayyappa

 

స్వామియే శరణం అయ్యప్పా

Swamiye Saranam Ayyappa

ఈ నెల అయ్యప్పస్వామికి అంకితం. వేలాదిమంది అయ్యప్పమాల వేసుకున్న స్వాములు కనిపిస్తారు. ''స్వామియే శరణం అయ్యప్పా'' అనే దివ్య నినాదం చెవుల్లో అమృతం పోసినట్లు ధ్వనిస్తుంటుంది.

 

అయ్యప్ప దీక్ష పూనినవారు మకర సంక్రాంతినాడు కనిపించే దివ్య మకరజ్యోతిని చూస్తే మరింత పుణ్యం వస్తుందని నమ్ముతారు. అయితే ఆ విశేష పర్వదినం నాటి రద్దీకి భయపడిన వారు, ఆ సమయంలో అక్కడికి చేరుకోవడం వీలుకానివారు అంతకంటే ముందుగానే దీక్ష పూని, 40 రోజులు పూర్తిచేసుకుని, మకర విలక్కు నాటికి శబరిమలై వెళ్ళి ఇరుముడి సమర్పించుకుంటారు.

 

శబరిమలైలో మకర సంక్రాంతి మాదిరిగానే మకర విలక్కు కూడా పరమ పవిత్రమైన పండుగ. ఇది ఏడు రోజుల పండుగ. అయ్యప్ప మాల ధరించిన స్వాములు మకర సంక్రాంతినాడు వెళ్ళలేకున్నా మకర విలక్కు పండుగ నాటికి శబరిమలై చేరుకుంటారు. అక్కడ ఈ పండుగను ఎంతో ఘనంగా, కనులపండువగా నిర్వహిస్తారు. నలభై రోజుల దీక్ష పూర్తిచేసుకుని అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన లక్షలాదిమంది భక్తులతో శబరిమలై కిక్కిరిసి ఉంటుంది.

 

మకర విలక్కు పండుగనాడు పండాలం పాలెస్ నుండి తీసుకొచ్చిన అపురూపమైన ఆభరణాలతో (''తిరువాభరణం'') స్వామిని అలంకరిస్తారు. కంఠాభరణాలు, కంకణాలు, కిరీటం తదితర ఆభరణాలు అమూల్యమైన వజ్రాలు పొదిగిఉంటాయి. ఏనుగు, గుర్రం లాంటి విగ్రహాలు సైతం స్వర్ణంతో రూపొంది ఉన్నాయి. మకర సంక్రాంతికి మూడు రోజుల ముందు వలియ కోయిక్కల్ శాస్త ఆలయం నుండి ఊరేగింపు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుండీ వచ్చిన వేలాదిమంది భక్తులు దారికి అటూ ఇటూ నిలబడి దర్శించుకుంటూ ఉండగా ఊరేగింపు మహోత్సవంలా సాగుతుంది.

 

''స్వామియే శరణం అయ్యప్పా'' - అంటూ లక్షలాది భక్తుల స్వరాలు లయబద్ధంగా పలుకుతాయి. భావోద్వేగంతో కూడిన ''స్వామియే శరణం అయ్యప్పా'' అనే దివ్య నినాదం ముక్తకంఠంతో మారుమోగుతుంది.

 

సాయంత్రం పూజ పూర్తయిన తర్వాత మలికాప్పుర అమ్మను ఏనుగుపై కూర్చోబెట్టి పత్తినేట్టంపడి వైపుగా ఊరేగింపు నిర్వహిస్తారు. వాయిద్యాలు మోగించేవారు, లైట్లు పట్టుకున్నవారు వెంట నడుస్తారు. అలా సాగిన ఊరేగింపు ''వేట్టవిలి'' అంటూ అరుపులు వినిపించడంతో ఆగి, తిరిగి ప్రధాన ఆలయం వైపు సాగుతుంది.

 

మకర విలక్కు పండుగ ఏడో రోజున చేసే ''గురుతి'' ఆచారంతో ముగుస్తుంది. గురుతి అంతే దేవుళ్ళు, దేవతలకు నైవేద్యం సమర్పించడం. గురుతి తర్వాత ఇక ఎవరూ ఆలయంలో ఉండరు.

 

మలయాళీలకు ఓనం, మండలపూజ, విషు విలక్కు పర్వదినాల్లాగే మకర విలక్కు, మకర సంక్రాంతి పర్వదినాలు విశిష్టమైనవి.

 

శబరిమలై వెళ్ళేందుకు మాల వేసుకున్న స్వాములది మొక్కవోని దీక్ష. ఎంతో నిష్ఠగా ఉంటారు. అల్లం, పసుపు, ఉల్లిపాయ నిషిద్ధం. మాంసాహారం అసలే ముట్టకూడదు. ఒక్కపూట భోజనం చేయాలి. అది కూడా స్వయంగా వండుకుని తినాలి. తెల్లవారుజామున లేచి చన్నీళ్ళతో స్నానం చేసి ఉదయం అయిదున్నర లోపు పూజ ముగించాలి. రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. చెప్పులు వేసుకోకూడదు. నేలమీద పడుకోవాలి. తాగుడు, సిగరెట్టు లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే పూర్తిగా వాటిని వదిలేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి. స్త్రీలను కనీసం తాకకూడదు - ఇలాంటి కఠోర నియమాలు పాటిస్తారు. ఇంత పవిత్రంగా ఉంటారు కనుకనే అయ్యప్ప మాల ధరించిన భక్తులను ''స్వామి'' అంటారే తప్ప పేరుతో పిలవరు. ఈ స్వాములు మకర విలక్కు మొదలు మకర సంక్రాంతి వరకు శబరిమలై దర్శించుకుంటారు.

 

auspicious Makara Vilakku, Makara Vilakku seven day festival, Sabarimala swamiye saranam ayyappa, Makara Vilakku and Makara Sankranti, ayyappa mala irumudi, ayyappa deeksha and conditions