లోకోపకారి చేయవలసిన పని!!

 

లోకోపకారి చేయవలసిన పని!!

ప్రకృతేర్గుణసమ్మూఢా: సజ్జన్తే గుణకర్మసు। తానకృత్స్నవిదో మన్దాన్కృత్స్నవిన్న విచాలయేత్॥ ప్రకృతి గుణములయొక్క మోహములోపడ్డ వారు ఆ ప్రకృతి గుణములలోనూ ఆ గుణముల ప్రభావంతో చేసే కర్మలలోనూ ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వారిని అంటే ఏమీ తెలియని అజ్ఞానులను, మందబుద్ధి కలవారిని, అన్నీ తెలిసి ఆత్మజ్ఞానము పొందిన జ్ఞానులు, తమ బోధనలతో మోహమునకు గురిచేయకూడదు.

ఎవరైతే ప్రకృతి గుణములతో అంటే శరీరము, మనసు, బుద్ధి అహంకారము వీటి వలన జనించిన మూఢత్వములో పడి ఉన్నాడో, వాడినే సమ్మూడుడు అని అన్నాడు పరమాత్మ. ఆధ్యాత్మికంగా, మానవులు చేసే కర్మలకు అతనిలో ఉన్న ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. ఆత్మ కేవలము చైతన్య స్వరూపము. మానవుడు చేసే కర్మలకు ప్రాణశక్తిని, క్రియాశక్తిని ఇస్తుంది. కాబట్టి ఆత్మవేరు శరీరం వేరు. ఇది సత్యము. నేనే ఈ శరీరము అని అనుకోవడం మూఢత్వము. శరీరంతో మమేకం అయి పోయి దేహభావన మిక్కుటంగా కలిగి ఉన్నవారిని సమ్మూడులు అని అంటారు. అటువంటి వారు ఈ శరీరము, మనసు, బుద్ధి వీటితో కూడిన అహంకారముతో అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకుంటారు. ఈ ప్రకృతిలో కనపడే వస్తువులు అన్నీ నిజమని నమ్ముతుంటారు. ఈ దేహమే నేను, అంతా నా వల్లనే జరుగుతూ ఉంది. నేను లేకపోతే ఈ లోకం అంతా ఏమైపోతుందో అనే దేహాభిమానంతో భ్రమలో ఉంటారు. ఆ భ్రమలోనే ఏవేవో ఫలితములను ఆశించి కర్మలు చేస్తుంటారు. అన్ని కర్మలు తమ స్వార్ధం కోసమే చేస్తుంటారు. అహంకారంతో చేస్తుంటారు.

ఇటువంటి వారు తెలిసీ తెలియని వారు, ఏమీ తెలియకపోతే ఏ చిక్కు లేదు. అన్ని తెలిసిన వాడు జ్ఞాని. కాని తెలిసీ తెలియని వారితోనే చిక్కంతా వస్తుంది. అటువంటి వారికి ఆత్మ అంటే ఏమిటో తెలుసు, శరీరం అంటే ఏమిటో తెలుసు. పరమాత్మ అంటే ఏమిటో తెలుసు. కాని తానే ఆత్మస్వరూపుడను అని తెలియదు. పరమాత్మ కొరకు ఎక్కడెక్కడో వెతుకుతుంటారు. పరమాత్మ తనలోనే ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని తెలుసుకోలేరు. అటువంటి తెలిసి తెలియని వారిని, అన్నీ తెలిసిన జ్ఞానులు తమకు తెలిసిన ఆత్మతత్వం గురించిన విషయాలన్నీ ఒక్కసారిగా బోధించి చలింప చేయకూడదు.

ఈ విషయం ఇదివరకు చెప్పిందే మరలా చెబుతున్నాడు పరమాత్మ, అటువంటి వారికి,  ఒక్కసారిగా జ్ఞానోపదేశము చేసి, వారు అప్పటి వరకు ఆచరిస్తున్నవి తప్పు అని చెప్పి, వారి మనస్సులు చలింప చేయకుండా, ముందు నిష్కామ కర్మలు తాము ఆచరించి దాని ఫలితములను వారికి చూపించి వారిని నెమ్మదిగా నిష్కామ కర్మల వైపుకు మళ్లించాలి. అప్పుడు వారు ఆత్మస్వరూపాన్ని గురించి గ్రహించగలుగుతారు. చంచల మైన ప్రాపంచిక సుఖములను వదిలిపెట్టి శాశ్వతమైన ఆత్మానందము వైపుకు మళ్లుతారు. ఎందుకంటే వారు సామాన్యులు కారు. బాగా చదువుకున్నవారు, పండితులు. కాని ఈ ప్రపంచమే సత్యము, దేహమే నేను అనే అజ్ఞానంలో ఉంటారు. ప్రాపంచిక సుఖములకు దాసులై ఉంటారు. అటువంటి వారికి జ్ఞానులు నిష్కామ కర్మను నిదానంగా బోధించాలి. తాము ఆచరించి చూపాలి. వారు నెమ్మదిగా నచ్చచెబితే వింటారు. ఇక్కడ పరమాత్మ కృత్స విత్ అనే పదం వాడాడు.

దానికి అర్థం ఏది తెలిస్తే ఇంక  తెలుసుకోదగ్గది ఏమీ ఉండదో అది తెలుసుకోవడం, అదే ఆత్మ తత్వము, ఆత్మ తత్వము తెలిసిన వాడే కృత్స్నవిదుడు. అటువంటి కృత్స్నవిదుడు తాను ఆచరించి ఇతరులకు చూపాలి. కాని అకృత్స్నవిదులను చలింపచేయకూడదు. అతని మార్గంలో అతనిని నడవనివ్వాలి. నెమ్మదిగా అతనికి సరిఅయిన మార్గం బోధించాలి. ముందు తను ఆచరించి, అతనితో ఆచరింపజేయాలి. లేకపోతే అతడు తాను చేసేది చేయడు, నువ్వు చెప్పేది చేయడం చేతకాదు. రెండింటి కొరగాకుండా పోతారు. కాబట్టి తెలిసీ తెలియని వాడి బుద్ధిని, అన్నీ తెలిసినవార చలింపచేయకూడదు అని స్పష్టంగా చెబుతున్నాడు పరమాత్మ.

◆ వెంకటేష్ పువ్వాడ