నరుడి వృత్తాంతం సమ్మోహనం!!

 

నరుడి వృత్తాంతం సమ్మోహనం!!

హిందూ పురాణాలలో ఎందరో దైవాంశ రూపులు ఉన్నారు. వారిలో నరుడు కూడా ఒకడు. ఇతను దైవిక శక్తి గల ఓరుషి.

ఇతని జన్మవృత్తాతం

బ్రహ్మ శరీర భాగం నుండి ధర్మదేవుడు జన్మించాడు. ఇతడు దక్షుని 10 మంది పుత్రిక లను వివాహమాడగా చాల మంది సంతానం జన్మించారు. అందులో ముఖ్యమైనవారు హరి, కృష్ణ, నర, నారాయణ. 

హరి, కృష్ణులు గొప్ప యోగులు కాగా నరనారాయణులు గొప్ప రుషులయ్యారు. హిమాలయాలలోని బదరికాశ్రమంలో వేల సంవత్సరాలు బ్రహ్మను గూర్చి తపస్సు చేశారు. వీరు ఊర్వశికి జన్మనిచ్చారు. నరుడు పురాణాలలో వివిధ సందర్భాలలో ప్రముఖపాత్ర పోషించాడు.

దేవదానవులు క్షీర సాగర మదనం చేసినపుడు అమృతం వెలువడగా మోహిని రూపంలో శ్రీ మహావిష్ణువు దానవుల్ని మోసగించి అమృతాన్ని ఇంద్రునికి అప్పగిస్తాడు.  దానవులు ఇంద్రునిపై దండెత్తినపుడు నరనారాయణులు ఇంద్రుని పక్షాన నిలబడి పోరాటం చేసి, దానవులను ఓడించి తరిమికొడతారు. అప్పుడు  నరుడికి అమృతాన్ని కాపాడే బాధ్యత అప్పగిస్తాడు ఇంద్రుడు. అలా దేవతలకు ఎంతో గొప్ప శక్తులను ఇచ్చిన అమృతం నరుడి వల్ల సురక్షితంగా ఉంది.  

శివునితో పోరాటం చేసిన సంఘటన నరుడి జీవితంలో ఉంది. దక్ష యజ్ఞానికి ఆహ్వానించనందుకు శివుడు కోపించి తన శక్తిని దక్షునిపైకి పంపితే ఆ యజ్ఞాన్ని భగ్నం చేసి గాలిలో విహరిస్తూ బదరికాశ్రమాన్ని చేరి తపస్సు చేస్తున్న నారాయణుడి హృదయాన్ని ఆ శక్తి తాకుతుంది.  అప్పుడు నారాయణుని 'హమ్' అను శబ్దం వెలువడి ఆ శక్తికి చోటులేక వెనక్కు వెళ్లి శివుడ్ని చేరింది. అప్పుడు  శివుడు నరనారాయణులపైకి దండెత్తి వచ్చాడు. నరుడు మంత్రించి ఓ గడ్డి పరకను విసరగా అది గొడ్డలిగా మారి శివుని పైకి రాగా దాన్ని శివుడు విరగ్గొట్టాడు. అందువల్ల శివుడ్ని ఖండ పరశుడు అంటారు. అప్పుడే నారాయణుడి నుండి వెడలిన శక్తి వేడికి శివుడి తల వెంట్రుకలు నల్లబడి ఎండిన గడ్డిలా మారాయి. - మహాభారతం నుండి సేకరించిన విషయం.

ప్రహ్లాదునితో యుద్ధం జరిగిన సంఘటన నరుడి జీవితంలో ఉంది. ఒకసారి చ్యవన మహర్షి తప్పనిసరై పాతాళానికి వెళ్లగా ప్రహ్లాదుడు ప్రపంచంలోని గొప్ప పుణ్యక్షేత్రాలను చెప్పమని కోరతాడు. చ్యవనుడు "భూమిమీద నైమిశారణ్యం, ఆకాశంలో పుష్కరం, పాతాళంలో చక్రతీర్థం" అని చెబుతాడు చ్యవన మహర్షి.

అప్పుడు  ప్రహ్లాదుడు నైమిశారణ్యం వస్తాడు. ప్రహ్లాదుడు నైమిశ తీర్థంలో స్నానం చేసి వేటకు వెళ్లగా అక్కడో వృక్షం దాని క్రింద తపస్సు చేసుకుంటున్న ఇద్దరు రుషులు కన్పించారు. ఆ చెట్టు కొమ్మలకు ఆకులకు ఆయుధాలు వుండటం చూసి వీరిని గురించి ప్రశ్నించగా వాగ్వాదం జరిగి బలాబలాలు తేల్చుకో దల్చుకుంటారు. నరుడు అజగవమనే వింటితో ప్రహ్లాదుని పైకి బాణాలు సంధిస్తాడు. ప్రహ్లాదుడు వాటిని త్రుంచివేస్తాడు. అప్పుడు నరుడు  మరిన్ని బాణాలు సంధించినా ప్రహ్లాదుడు వాటిని ఎదుర్కోగా నారాయణుడు ముందుకు వచ్చి ప్రహ్లాదుడితో ఘోరయుద్ధం చేస్తాడు అప్పుడే ప్రహ్లాదుడు పడిపోతాడు. ఆ బాణాలు గుచ్చుకొని ప్రహ్లాదుడి హృదయం చీలుతుంది. ప్రహ్లాదుడు ఇతడ్ని శ్రీమహావిష్ణువుగా గుర్తించి అతడ్ని ప్రార్థిస్తాడు. నవనారాయణులు ఇద్దరూ సహస్ర కవచుడి 999 కవచాలు బద్దలు కొడతారు. ఆ సహస్ర కవచుడు తిరిగి కర్ణుడిగా జన్మించగా 1000 కవచాన్ని ఛేదించడానికి కృష్ణార్జునులుగా జన్మిస్తారు.

ఇదీ నరుడి వివరణ వృత్తాంతం. 

కోసమెరుపులో విషయం ఏమిటంటే పాంచాలి వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది  స్మరించుకున్నది నవనారాయణులనే. శ్రీకృష్ణార్జునులు నరనారాయణుల పునర్జన్మలు. భృగుని శాపం వల్ల వీరు కృష్ణార్జునులుగా జన్మించారు. అందుకే నవనారాయణులను ద్రౌపతి ప్రార్థిస్తే శ్రీకృష్ణుడు కాపాడతాడు.

◆ వెంకటేష్ పువ్వాడ