Read more!

కృష్ణా పుష్కరాల సందర్భంగా... కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు ....2

 

 

 

కృష్ణా పుష్కరాల సందర్భంగా... కృష్ణా తీరాన వెలసిన ఆలయాలు ....2

 

కృష్ణమ్మ పుట్టిల్లు, మహాబలేశ్వర్, మహారాష్ట్ర

 

 

             

ఇవాళ కృష్ణమ్మ పుట్టింటి గురించి తెలుసుకుందాము. మహారాష్ట్రలో సతారా జిల్లాలో పశ్చిమ కనుమలలో వున్న అందమైన ప్రదేశాలలో మహాబలేశ్వర్ ఒకటి.  ఇక్కడ ఐదు నదీమ తల్లులు పుట్టాయి.  అవే  .. వెన్న (వేణీ), గాయత్రి, సావిత్రి, కోయినా, క్రిష్ణ.  మహా బలేశ్వర్ హిల్ స్టేషన్.  ఇది సముద్ర మట్టానికి 4718’ ఎత్తన వున్నది.  మహాబలేశ్వర్ పట్టణానికి  రాజా సింఘన్ ఆద్యుడు.  ఆయనే అక్కడ మహాబలేశ్వరుడి ఆలయం కట్టించాడు.

 

17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఇక్కడ ప్రతాపఘడ్ కోట నిర్మించాడు.  తర్వాత 1819 ప్రాంతంలో ఈ ప్రాంతం బ్రిటిష్ పాలకుల అధీనమయింది.  దానితో దీని పేరు మాల్కలం పేట అయింది.  అభివృధ్ధి జరిగింది.  ఈ ప్రాంతంలో దర్శనీయ స్ధలాలు దాదాపు 30 దాకా వున్నాయి.  అందులో ఒకటైన విల్సన్ పాయింట్ నుంచి సూర్యోదయం అందాలు వీక్షించవచ్చు.  ఆర్ధర్ సీటు ఆర్ధర్ మాలెట్ పేరు మీద వచ్చింది.  ఈయన ఇక్కడ మొట్ట మొదటి ఇల్లు కట్టాడంటారు.  ఎకో పాయింట్, ఎలిఫెన్స్టోన్ పాయింట్, మర్జోరీ పాయింట్, క్యాసెల్ రాక్ మొదలయిన ప్రకృతి సౌందర్యంతో అలరారే ప్రదేశాలు అనేకం. ఇవ్వన్నీ ప్రకృతి సౌందర్యాలను పరికించే పాయింట్లు.

 

ఇంక ఆలయాల సంగతా?   ఇక్కడ వున్న పురాతన ఆలయాలలో పంచగంగ ఒకటి.  ఇక్కడే ఐదు నదీమ తల్లులు జన్మించాయని చెబుతారు.  ఆలయం లోపల పెద్ద మండపంలా వుంటుంది.  అందులో కొంచెం ఎత్తుగా పక్క పక్కనే ఐదు చిన్న తూముల్లా వుంటాయి.  ఐదు నదులు అక్కడనుంచే వస్తాయంటారు.  కొన్నింటినుంచీ, చాలా సన్నగా నీరు వస్తున్నది.  ఆ నీరంతా కలిసి ముందు ఒక గో ముఖం నుంచి వస్తుంది.  ఆ జలాన్ని పవిత్రంగా భావించి కొందరు సీసాలలో తీసుకు వెళ్తున్నారు.

 

దిగువన కొంచెం దూరంలో కష్ణానది పుట్టిన ప్రదేశం అంటారు మళ్ళీ .. అక్కడా ఆలయం వున్నది.  మరి పైన కృష్ణ పుట్టిన ప్రదేశమన్నారుకదా అంటే అక్కడనుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ బహిర్గతమవుతుందన్నారు.    ముందు విశాలమైన కృష్ణానది, ప్రకృతి అందాలు ఎంత చూసినా తనివి తీరదు. ఇక్కడ వున్న ఆలయాలలో ముఖ్యమైనవి మహా బలేశ్వర్, అతి బలేశ్వర్ అనే శివాలయాలు.  ఇవి చాలా ప్రాచీనమైనవి.

 

ఇంకో విశేషం తెలుసా   ఇంత పవిత్ర ప్రదేశం 1800 వ సంవత్సర ప్రాంతంలో చైనీయులకు, మలేశియా దేశాలవారికి చెరసాలగా వుండేది.  అప్పుడు అక్కడ ఖైదీలు అక్కడ స్ట్రాబెర్రీ పండించేవారు.  ఆ సాగు ఇప్పటికీ సాగుతోంది.  అక్కడి స్ట్రాబెర్రీలు చాలా రుచిగా వుంటాయి.  అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా తప్పకుండా వాటిని రుచి చూస్తారు. ఇక్కడ ఔత్సాహికులకు ట్రెక్కింగ్ అవకాశాలు కూడా వున్నాయి.

 

తీరాన ఇతర ఆలయాలు

మహారాష్ట్రలో కృష్ణా నది ఒడ్డున వున్న ఆలయాలలో సాంగ్లిలోని గణపతి ఆలయం ముఖ్యమైనది.  ఇది పీష్వాలకాలంలో నిర్మింపబడింది.   ఈ రాష్ట్రంలోని కృష్ణా నదీ తీరంలో వున్న ఇంకొక ప్రఖ్యాత ఆలయం నరసోబావాడి లో వున్న శ్రీ నృసింహ సరస్వతిది.  ఇక్కడ వున్న ఈ ఆలయాన్ని రోజూ అనేక మంది దత్త భక్తులు దర్శిస్తూవుంటారు.  ఇక్కడ  పంచగంగ కృష్ణానదిలో కలుస్తుంది.

 

రేపు కర్ణాటకాలోని కొన్ని ఆలయాల గురించి తెలుసుకుందాము.


 

.

 

 

. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)