Read more!

మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి? ఈ రోజు ఏం చేస్తే పుణ్యమంటే..!

 

తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి మాసంలో పూర్ణిమ వస్తుంది. అయితే కొన్ని మాసాలలో పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంది. అలా ప్రత్యేకంగా పరిగణించే మాసాలలో మాఘపూర్ణిమ కూడా ఒకటి. మాఘ పూర్ణిమ తిథి చాలా ప్రత్యేకమైంది. ఈ సారి పూర్ణిమ ఫిబ్రవరి 24వ తేదీ వచ్చింది. ఈ రోజున కొన్ని పనులు చేయడం వల్ల చాలా పుణ్యం వస్తుందని, ఈరోజున గంగానది స్నానం చాలా పరమ పవిత్రమని నమ్ముతారు. అసలు మాఘ పూర్ణిమ తిథి ఎప్పుడు? ఆరోజు ఏం చేయాలి?   ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుంటే..

మాఘ పూర్ణిమ సమయం..

మాఘ పూర్ణిమ  23వ తేదీ ఫిబ్రవరి 2024 మధ్యాహ్నం 3:36 నుండి మరుసటి రోజు  ఫిబ్రవరి 24  సాయంత్రం 6:03 వరకు ఉంటుంది. ఉదయ తిథిని పరిశీలిస్తే, మాఘ పూర్ణిమ 24 ఫిబ్రవరి 2024న జరుపుకుంటారు. ఈ రోజున ఉదయం 5.11 గంటల నుండి 6.02 గంటల వరకు స్నానమాచరించి దానం చేయడం శుభప్రదం.

మాఘపూర్ణిమ రోజు పూజావిధానం..

మాఘ పూర్ణిమ నాడు బ్రహ్మ ముహూర్తంలో గంగాస్నానం చేయాలి. గంగాస్నానం చేయడం కుదరని పక్షంలో గంగాజలాన్ని నీటిలో కలిపి స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తరువాత "ఓం నమో నారాయణ" మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యం సమర్పించాలి.
ఆ తర్వాత సూర్యునికి అభిముఖంగా నిలబడి నువ్వులను నీటిలో వదిలి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత పూజ ప్రారంభించాలి.

 
నైవేద్యంలో పంచామృతం, పాన్, నువ్వులు, వడపప్పు,  కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, గరిక  మొదలైన వాటిని సమర్పించాలి. చివరగా హారతి ఇవ్వాలి.  పూర్ణిమ నాడు చంద్రునికి, సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించాలి.

మాఘపూర్ణిమ రోజు గంగాస్నానం ప్రాముఖ్యత..

పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు భూమికి వస్తారని, అందుకే ఈ రోజున స్నానం చేయడం,  దానం చేయడం మంచిదని చెబుతారు. పురాణ గ్రంధాల ప్రకారం మాఘమాసంలో త్రివేణి సంగమంలో  స్నానం చేసి, ఉపవాసం,  ధ్యానం చేసే భక్తులకు మాఘ పూర్ణిమ చాలా ప్రత్యేకమైనది.   ఎందుకంటే మాఘ పూర్ణిమ రోజు గంగాస్నానం, ఉపవాసం, ధ్యానం చేయడం వల్ల సంకల్ప సిద్ది పెరుగుతుంది.  ఇక ప్రయాగలో స్నానమాచరించేవారికి అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

ఈ పనులు చేయాలి..

మాఘ పూర్ణిమ రోజు  చంద్రుడిని,   సంపదల దేవత అయిన లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయి. అలాగే మాఘ పూర్ణిమ నాడు చంద్రోదయ సమయంలో రాత్రి చంద్రుడిని పూజించడం వల్ల చంద్ర దోషం తొలగిపోతుంది.

 

                                     *నిశ్శబ్ద.