మాఘమాసం విశిష్టత.. పేరులో కూడా ఇంత అర్థం ఉంటుందని తెలుసా!

 

మాఘమాసం విశిష్టత.. పేరులో కూడా ఇంత అర్థం ఉంటుందని తెలుసా!

మాసాలలో మాఘమాసం చాలా విశిష్టమైనది అని చెబుతారు.  మాఘమాసంలో చేసే స్నానానికి అందుకే అంత విశిష్టత ఉంటుంది.  అయితే మాఘ మాసంలో చేసే పనులకే కాదు.. కేవలం మాఘం అనే పేరులో కూడా బోలెడు అర్థం ఉంది.  దీని గురించి పురాణ పండితులు చెబుతున్నారు. మాఘమాసంలో ఏం చేస్తే పుణ్యప్రదం,  మాఘ స్నానం ఎందుకు చేయాలి? మాఘ మాసంలో ఏ దానాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి? మాఘ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి? తెలుసుకుంటే..

మాఘం అంటే..

మాఘం అంటే.. పాపాలను కడిగివేసేది అని అర్థం.  ఈ మాసంలో చేసే ఏ మంచి పని అయినా పాపాలను కడిగి వేస్తుంది. ఈ మాసంలో చంద్రుడు మఖ నక్షత్రంలో ఉంటాడు. అందుకే దీనికి మాఘమాసం అని పేరు.

విష్ణు ప్రీతి..

మాఘమాసం మహా విష్ణువుకు చాలా ప్రీతి. కార్తీక మాసం అంటే పరమేశ్వరుడికి ఎంత ఇష్టమూ.. మాఘ మాసం అంటే విష్ణువుకు అంత ఇష్టం.  ఈ మాసంలో విష్ణువును  మాధవుడి రూపంలో కొలిస్తే ఎంతో పుణ్యప్రదం.

"స మాఘ సమో మాసః" అని పురాణ వచనం.  అంటే.. మాఘ మాసానికి సమానమైన మాసం లేదు అని అర్థం. పురాణాలలో ఈ వాక్యం చాలా ప్రసిద్ధి  చెందింది.

మాఘ స్నానం..

సూర్యోదయానికి ముందు చేసే స్నానం మాఘ స్నానం. నదీ స్నానం చేస్తే ఎంతో మంచిది. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.  తెలిసి తెలియక చేసిన పాపాలు మాఘ స్నానం వల్ల తొలగిపోతాయి.

దానధర్మాలు..

మాఘ మాసంలో చేసే దాన దర్మాలకు చాలా విశేషమైన పుణ్య ఫలం లభిస్తుంది.

నువ్వులు, గుమ్మడికాయ,  ఆహారం,  వస్త్రాలు దానం చేయడం చాలా మంచిది.

నువ్వులు జోడించి చేసిన ఆహారం, నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం కూడా చాలా మంచిది.

మాఘ మాసపు పండుగలు..

మాఘ మాసంలో చాలా విశిష్టమైన పండుగలు ఉన్నాయి.

వసంత పంచమి.. ఇది సరస్వతి దేవిని పూజించే విశిష్టమైన రోజు.. సరస్వతి దేవి జయంతి ఇదే.

రథసప్తమి.. రథసప్తమి రోజు సూర్య భగవానుడిని ఆరాధిస్తారు.

భీష్మ ఏకాదశి..  విష్ణుసహస్రనామ పారాయణానికి భీష్మ ఏకాదశి ప్రాశస్త్యం పొందింది.

మాఘ పౌర్ణమి.. మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానానికి చాలా విశేష ఫలితం ఉంటుంది.  ఈ రోజు సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి వస్తే ఎంతో మంచిది.

                                *రూపశ్రీ.