Read more!

శ్రీ ఆంజనేయ దండక ప్రాశస్త్యం, ప్రయోజనం :

 

శ్రీ ఆంజనేయ దండక ప్రాశస్త్యం, ప్రయోజనం

 

 

శ్రీ ఆంజనేయ దండకం తెలుగునాట చాలా తరాలనుండి ప్రాచుర్యంలో ఉన్నది. ఆంజనేయస్వామివారి మహిమ, సుగుణాలు, సాధించిన ఘనకార్యాలు, రక్షణ, అనుగ్రహం మొదలైనవన్నీ ఈ దండకంలో పొందుపర్చబడ్డాయి. ఇందులో సంస్కృత పదాలు పొదగబడటంవల్ల శబ్దశక్తి, మంత్రశక్తి కలిగి ఉంది. తెలుగుభాషలో క్రియాపదాలు, వాక్యాలు ఉండటంవల్ల- చదువుతూండగానే (వింటూండగానే) వెంటనే అర్థమవుతూ, భావశక్తి కూడా కలిగి ఉంది. అందువల్లనే ఈ దండకం శ్రద్ధగా పారాయణ చేసినవారికి కోరిన కోర్కెలు తీర్చటంలో చాలా ప్రభావశాలిగా ఉన్నది.

 

 

భారతదేశంలోని ఏ ప్రాంతంవారికయినా – ఆధ్యాత్మిక, దైవభక్తిక విషయ పరిజ్ఞానం కలగాలన్నా, సాధనలో పురోగతి కావాలన్నా కూడా – మహర్షుల బోధనలే అధారం ! వారు అందరూ సంస్కృతభాష (The Most Refined Language ) లోనే రచనలు, బోధనలు చేశారు. మూలం(Original Work in Original Language )లో చదువుకోగలగటం, ఒక గొప్ప వరం ! అది అందరికీ సాధ్యం అయ్యేది కాదు. కాబట్టి తమ తమ మాతృభాషలలో ఉన్న వ్యాఖ్యానంతో /అనువాదంతో కలిపి చదువుకోవటం అనేది Next Best !

 

 

“యదేవ విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి ” – అంటే, “అర్థం, భావం తెలుసుకుని చేసిన సాధనలు ఎక్కువ శక్తిమంతములుగా, ఫలదాయకములుగా ఉంటాయి” అని అర్థం. మాతృభాషలో చదివిన, విన్న విషయాలు, భావాలు అత్యధిక శాతం అర్థమౌతాయని అందరికీ తెలిసిన విషయమే గదా ! అలాంటి రచనలు తమ మాతృభాషలో చేయబడియుండనప్పుడు, ఏ ఇతర భారతీయ భాషలోనైనా ఫరవా లేదు. ఎందుకంటే, భారతదేశంలో ఉద్భవించిన భాషలు అన్నింటిలోనూ కూడా, భారతీయాత్మను, సంస్కృతిని దర్శింపజేయగల పదజాలం, సామర్థ్యం సహజంగానే ఉన్నాయి ! విదేశీ భాషలకు ఆ సౌలభ్యం చాలా తక్కువ.

 

 

అందువల్లనే, ఈ దండకం పారాయణ – తులసీదాసకృత హనుమాన్ చాలీసా లోని ప్రతిపద భావార్థం తెలియనివారు చేసే చాలీసా పారాయణకంటె – ఏమాత్రం తక్కువ కాదు. ముఖ్యంగా బాలురకు ఈ దండకమును కంఠస్థం చేయిస్తే, కనీసం వారు చదువుకోగలిగిన పరిస్థితి కలిగించ గలిగితే, ఇక వారికి దైవసంబంధమైన రక్షణ సంపూర్ణంగా కలిగించినట్లే
నిశ్చింతగా ఉండవచ్చును !