బుద్ధం శరణం గచ్ఛామి

 

 

బుద్ధం శరణం గచ్ఛామి 



'విధి అనుల్లంఘనీయం"


అంటే ' విధి నిర్ణయాన్ని ఎవరు అతిక్రమించలేరు' అని అర్ధం. దీనికి ప్రత్యక్ష నిదర్శనం  "గౌతమ బుద్ధుని"  జీవితం. బుద్దుని పేరు "సిద్దార్ధుడు" బుద్దుని జనన సమయం గురించి, చరిత్రకారులు ఎవరికి తోచిన విధంగా వారు లెక్కలు కట్టి నిజమైన చరిత్రకు తాటాకులు కట్టారు.

పురాణాలే ప్రమాణం :

విష్ణు,వాయు,మత్స్య,బ్రహ్మండ పురాణాల్లో ఇక్ష్వాకు వంశక్రమాన్ని చాలా వివరంగా  చెప్పాడు. వ్యాసభగవానుడు. భాగవతంలోను బుద్ధుని ప్రస్తావన ఉంది. మన పురాణాలూ చెప్పిన ప్రకారం  "బుద్దుడు" క్రీ.పూ.1886 లో జన్మించాడు.

అంతేకాక సుమారు 900 సంవత్సరాలు క్రితం "కల్హణుడు" రచించిన కాశ్మీర్ రాజుల చరిత్రకు ప్రమాణమైన "రాజతరంగిణి" అను ప్రామాణిక గ్రంధం ప్రకారం కూడా మన పురాణాలూ చెప్పినదే నిజమని రచించాడు.


"తదా భగవతః శాక్యా సింహస్య పర నిర్వ్రుతేః
అస్మిన్ మహీలోక ధాతౌ సార్ధం వర్షశతం హ్యగాత్" - రాజా తరంగిణి 1-172


కనిష్కునికి నూటయాభై సంవత్సరాలకు పూర్వం శాక్యసింహేయుడైన బుద్ధుడు నిర్వాణం చెందాడు. కనిష్కుడు క్రీస్తుపూర్వం 1294 నుంచి 1234 వరకు రాజ్యపాలన చేసాడు. దీనికి 150 సంవత్సరాలు కలిపితే క్రీ.పూ 1444 లో "బుద్దిని" నిర్వాణం జరిగింది. ఈ అంకెలు, లెక్కలు ఎలా ఉన్నా.. ఎందరో మహనీయులకు జన్మనిచ్చిన మన భారత ఖండం మీదే బుద్ధ భగవానుడు జన్మించాడు. అన్నది ఎవరూ కాదనలేని సత్యం.

బుద్ధ  జననం :

 


శాక్యవంశీయుడైన " శుద్దోధనుడు " కపిల వస్తునగరానికి మహారాజు. ఇతని భార్య "మహామాయా దేవి". ఒక రోజు రాత్రి ఓ తెల్లని ఏనుగు తన గర్భంలో ప్రవేశించినట్లు మహామాయదేవి కలగంది. స్వప్న వృత్తాంతాన్ని జ్యోతిష్యులకు తెలిపాడు శుద్దోధనుడు. వారు స్వప్న శాస్త్రాన్ని పరిశీలించి "మహా రాజా! మీ వంశ చరిత్రను దిగంతాలవరకు వ్యాపింప చేయగల ఉత్తమపుత్రుడు మీకు జన్మించబోతున్నాడు." అని చెప్పారు.

జోస్యులు చెప్పినట్టుగానే మహామాయాదేవి గర్భవతి అయింది. నవమాసాలు నిండాయి. పురుడు పోసుకోవాలని పుట్టింటికి బయలుదేరింది. రాజరథం "లుంబినీవనం" చేరింది. మహామాయా దేవికి ప్రసవవేదన మొదలైంది.లుంబినీవనంలో గుడారాలు వేశారు. మంత్రసానుల పర్యవేక్షణలో  మహామాయా దేవి ఒక మగ శిశువును ప్రసవించింది.

 


ఆ రోజు వైశాఖ పౌర్ణమి, శుక్రవారం, విశాఖ నక్షత్రం. అదే ఓ అహింసామూర్తి ఇహలోక ఆగమనానికి శుభముహూర్తం.

బుద్దుని భవిత : 

పుత్ర జననవార్త విన్న శుద్దోధనుడు నగరమంతా ఉత్సవాలు జరిపించాడు. బంధుమిత్ర, పురోహితుల సమక్షంలో తన కుమారునకు "సిద్ధార్ధుడు" అని నామకరణం చేసాడు. మరల జ్యోతిష్కులు రావించబడ్డారు. సిద్దార్థుని జాతకచక్రం వారి ముందుంచి, జాతక వివరాలు చెప్పమన్నాడు శుద్దోధనుడు. వారు జాతక చక్రాన్ని పరిశీలించి, 'మహారాజా మీ పుత్రుడు ఈ సమస్త భూమండలాన్ని శాసించగల సార్వభౌముడయినా అవుతాడు లేదా  వైరాగ్యా భావనతో ఈ ప్రపంచాన్నే సన్యసించే, జ్ఞానాన్ని భోదించే సన్యాసి అవుతాడు." అని చెప్పారు. తన కుమారుడు సన్యాసి కావడం మహారాజుకు ఇష్టం లేదు. అందుకని శుద్దోధనుడు చాల జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రపంచం లోని కష్టాలు ఏవి తన పుత్రుడి దరి చేరకుడదని నిర్ణయించుకుని సర్వ సుఖ భోగ సమృద్దమైన ఓ భవనం నిర్మించాడు. పదునారు సంవత్సరాల ప్రాయంగల సుందరీమణులను సిద్దార్ధుని సేవలకు నియోగించాడు.  సిద్దార్ధుని జీవితం సుఖసాగరంలో, ఆనందపుటలలపై రసరమ్య భరితంగా సాగిపోతుంది.

- మనసుకు నచ్చిన మదనాంగుల పొందు
- నాలుక మెచ్చిన షడ్రుచుల విందు
- సంగీత,నృత్య కోలాహలాల హంగులతో సిద్దార్ధుని ప్రాయం పరుగులు తీస్తూ యవ్వనంలో ప్రవేశించింది. అపురూప సౌందర్యవతి అయిన "యశోదర" తో సిద్దార్ధుని వివాహం జరిగింది.

 

ఆమె సహచర్యం లో సంసార సుఖభోగాల తీరాలు చూసాడు  సిద్ధార్ధుడు. యశోధర గర్భవతి అయింది. రాజమందిరం అంతా ఆ సంతోషంతో పులకితమైంది. ఎన్నోవున్న, సిద్దార్ధుని జీవితమంతా ఆ రాజమందిరమే లోకంగా సాగింది. "ఈ మందిరం తప్ప ఇంకేమిలేదా" అనే ఆలోచన కలిగింది సిద్దార్దునకు. ఈ మందిరం వెలుపల ఏముందో చూడాలనే ఉత్సుకత పెరిగింది. చిన్నతనం నుంచి తనను పెంచిన రథసారధి తో తన కోరిక చెప్పాడు. రాజశాసనానికి భయపడి అతను "వద్దు" అని సిద్దార్దున్ని వారించాడు. సిద్ధార్ధుడు వినలేదు. మొండిపట్టు పట్టాడు. ఎవరికీ తెలియకుండా సిద్దార్దున్ని నగరంలోకి తీసుకెళ్ళాడు సారధి.


మూడు అనుభవాలు :

వింతగా నగరాన్ని చూస్తూ వస్తున్నాడు సిద్ధార్ధుడు. మొదటగా అతనికి ఒక వృద్దుడు కర్రపట్టుకుని నడుస్తూ ఎదురైయ్యాడు. "వస్తున్న ఆ వింత ప్రాణి ఎవరు?"  అని అడిగాడు సిద్ధార్ధుడు. " అతను మనలాంటి మనిషే " చెప్పాడు సారధి.
" మనల ఎందుకు లేడు" ? సిద్ధార్ధుడు అడిగాడు.
"వృద్దాప్యం అతన్ని అల చేసింది" సారధి జవాబు.
" వృద్దాప్యం అంటే?"  సిద్ధార్ధుడు ప్రశ్న.
సారధికి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. రథం ముందుకు సాగుతోంది. సిద్ధార్ధుని ఆలోచనారధమూ ముందుకు సాగుతోంది.
ఈసారి ఒక కుష్టు రోగి సిద్ధార్ధునికి ఎదురుపడ్డాడు.
" అతను ఎందుకు అల ఉన్నాడు ? సిద్ధార్ధుని ప్రశ్న.
"అతను కుష్టు రోగి "సారధి జవాబు.
"కుష్టు రోగం అంటే?"
" పూర్వ జన్మ పాపఫలం ప్రభూ! అన్నాడు సారధి.
"పూర్వ జన్మ పాపం అంటే?"
ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. సారధికి, రధం ముందుకు సాగుతోంది. సిద్ధార్ధుని మనసులో సందేహాశ్వాలు పరుగులు తీస్తున్నాయి. ఈ సారి సిద్ధార్ధునికి ఓ గృహస్తు ఇంటిముందు మృతకళేబరం, రోదిస్తున్న బందువులు కనిపించారు.
" ఆ పడుకున్న మనిషి ఎవరు ? అతని చుట్టూ కూర్చుని ఎందుకు ఏడుస్తున్నారు?"  అని అడిగాడు సిద్ధార్ధుడు.
" ప్రభూ! ఆ మనిషి మరణించాడు. అందుకే  అతని బందువులు ఏడుస్తున్నారు." జవాబు ఇచ్చాడు సారధి.
" మరణం అంటే? " తనకు తెలిసిన జ్ఞానంతో వివరించాడు సారధి.  సిద్ధార్ధునుకి అవేమి రుచించలేదు.
"ఇంకేమి చూడాల్సింది లేదు.రధాన్ని ఈ మరల్చు" అని ఆదేశించాడు సిద్ధార్ధుడు.

అంతర్మథనం :

 


నగరం నుంచి తిరిగి వచ్చిన తరువాత సిద్ధార్ధునిలో మేధోమథనం ప్రారంభమైనది. సమాధానాలు తెలియని ఎన్నో ప్రశ్నలు అతన్ని నిరంతరం వేధిస్తూనే ఉన్నాయి. "మరణం అంటే ఏమిటి ? మనిషికి ఎందుకీ కష్టాలు? దుఃఖ నివారణకు నిజమైన మార్గం ఏమిటి?"
బందిఖానాలాంటి ఈ భవనంలో ఇంతకాలం గడిపిన జీవితం నిస్సారమని భావించాడు.ఈ చరనుంచి బయటపడాలని నిశ్చయించాడు. అడుగు ముందుకు వేశాడు. అప్పుడే పుట్టిన పసి బిడ్డ ఏడుపు వినిపించింది. యశోదర ప్రసవించిందని తెలుసు కున్నాడు. తన ప్రతిబింబాన్ని ఒకసారి చూడాలనే ఆశ అతని పితృ హృదయాన్ని ఊగిసలాడించింది. పురిటి గది వైపు రెండు అడుగులు వేసి ఆగిపోయాడు.

 

 

"వద్దు. ఇది అశాశ్వత బంధం. నా అన్వేషణకు తగదీ బంధం." అని వేణు తిరిగి  రాజభవనం నుంచి రహస్యంగా బయటకు వచ్చాడు. అప్పటికే రథాన్ని సిద్ధంగా ఉంచాడు  సారధి. సిద్ధార్ధ రధం ఎక్కాడు రధం కపిలవస్తునగర పరిసరారణ్యం చేరింది. సిద్ధార్ధుడు రధం దిగాడు. తన దుస్తులు,నగలు,సారధికి ఇచ్చాడు.
కన్నీళ్ళతో చూసాడు సారధి.
" వద్దు. ఈ కన్నీరుకు కారణం తెలుసుకోవాలనే నాయీ అన్వేషణ" అని ముందుకు నడిచాడు సిద్ధార్ధుడు.

అప్పుడు అతని వయసు 28 సంవత్సరములు ఆ రోజు ఆషాడ పౌర్ణమి, ఆదివారం,ఉత్తరాషాడ నక్షత్రం.    

            
తపోదీక్ష :


సిద్ధార్ధుడు ఆ అరణ్యంలో ఓ ఏకాంత ప్రదేశంలో ఆహారం తీసుకోకుండా, కొంతకాలం తపస్సు చేశాడు. అతని సందేహాలకు సమాధానం దొరకలేదు. "తిండి మానడంవల్ల తపస్సు సిద్ధించదు. బలమైన ఆహారం, బలమైన ఆలోచనలను పుట్టిస్తాయి. అవి అందుకు తగిన పరిశ్రమను చేయిస్తాయి'' అని తలచి ఆ ప్రదేశాన్ని వదలి గయ చేరుకున్నాడు.

జ్ఞానోదయం :


గయ చేరుకున్న సిద్ధార్ధుడు నియమిత ఆహారం తీసుకుంటూ ఏడు సవత్సరాలు దీక్షగా తపస్సు చేశాడు. ఆ తపస్సు అతని జ్ఞాననేత్రాన్ని తెరచింది. సిద్ధార్ధునకు జ్ఞానోదయమైంది. అతని సందేహాలకు సమాధానాలు దొరికాయి. అతని అన్వేషణ ఫలించింది. సిద్ధార్ధుడు "బుద్ధుడు'' అయ్యాడు.
ఆ రోజు వైశాఖ పౌర్ణమి బుధవారం.

అష్టాంగ మార్గం :


మానవుని దుఃఖానికి కారణం కోరికలని, కోరికలను జయించితే ఆనందమని, ఈ ఆనందానికి అష్టాంగ మార్గమే రాజమార్గమని అందరికీ తెలియచేశాడు.


1 సమ్యక్కరణము
2  సమ్యగా జీవనము
3 సమ్యక్ సంకల్పము
4 సమ్యక్ వాక్కు
5 సమ్యక్ సిద్ధి
6 సమ్యక్ లోచన
7 సమ్యక్ సమాధి


ఇదే "బుద్ధుడు'' బోధించిన అష్టాంగ మార్గం
బుద్ధుడు తన తొలి ధార్మికోపన్యాసాన్ని "కుశనాగర''లో ప్రారంభించాడు. అతని దివ్యోపన్యాసంలో ప్రధానంగా చోటుచేసుకున్న అంశం అహింస.
 
   "అహింసా పరమోధర్మః''

యిది బుద్ధుని సందేశం. అతని వాదనాపటిమకు ఎందరో ఆకర్షితులైయ్యారు. బుద్ధుని ధార్మిక జైత్రయాత్ర ఒక సంచలనాన్ని సృష్టించింది. తన కుమారుని వైరాగ్య విప్లవవిజయం విన్న శుద్దోధనుడు బుద్ధుని భిక్ష స్వీకరించటానికి రమ్మని ఆహ్వానించాడు.
భిక్ష స్వీకారం కోసం బుద్ధుడు రాజభవనంలో అడుగుపెట్టాడు.
-   అది అతను పుట్టిపెరిగిన రాజప్రాసాదము.
-   అది ఐహిక సుఖాలను అందించిన భోగభవనం.
ఇవేమీ అతనికి గుర్తురాలేదు.
వైరాగ్య భావనతో భిక్ష స్వీకారానికి వచ్చిన భర్తను చూసింది యశోధర.
తొలిసారిగా తన కన్నతండ్రినీ వింతగా చూస్తున్నాడు ఏడు సంవత్సరాల ప్రాయంగల "రాహులుడు''. బుద్ధుడు కూడా ఏడు సంవత్సరాల ఎడబాటు తర్వాత తన భార్య, బిడ్డలను చూశాడు. అది భౌతిక బంధాలకు లొంగని ఆధ్యాత్మిక చైతన్యం. యశోధర, రాహులుడు, బుద్ధుని పాదాలకు నమస్కరించారు. ఏ భావము లేకుండా వారిని దీవిన్చాడి బుద్ధుడు. శుద్దోధనుడు కాషాయం కట్టిన తన కుమారుని వంక కన్నీళ్ళతో చూశాడు. చలించలేదు బుద్ధుడు. ఏ వైరాగ్యభావనతో రాజభవనంలో అడుగుపెట్టాడో, అదే వైరాగ్యభావనతో రాజభవనానిన్ని వదిలిపెట్టాడు.

మరణమే శరణం :


బుద్ధుని ప్రవచనా ప్రవాహం అతన్ని గురుస్థానంలో నిలబెట్టింది. అతన్ని భగవంతుని అంశగా అందరూ స్వీకరించారు. ఒకరోజు "సుశీల'' అణు స్త్రీ మరణించిన తన శిశువును బ్రతికించమని బుద్ధుని ప్రార్థించింది. "మరణం లేని యింటినుంచి పిడికెడు ఆవాలు తీసుకురా, నీ బిడ్డను బ్రతికిస్తాను'' అన్నాడు బుద్ధుడు. ఆమె ఎంత ప్రయత్నించినా మరణంలేని ఇల్లు ఆమెకు కనిపించలేదు. ఆమె రిక్త హస్తాలతో బుద్ధుని దగ్గరకు వచ్చి, తన ఆసక్తతను కన్నీళ్ళతో తెలిపింది. "తల్లీ! మర్త్య, లోకమంటేనే మరణం కల లోకం. జనన, మరణాలే ఈ లోకానికి వున్న సరిహద్దులు. మధ్యనున్నదే జీవితం. కష్టాల కడలి లాంటి ఈ జీవితానికి మ్య్గింపు మరణంతోనే సాధ్యం'' అని ఆమెను ఓదార్చి పంపాడు.

మహాప్రస్థానం :


బుద్ధుని కీర్తిప్రతిష్టలు అతని రాజబంధువైన దేవదత్తునికి నచ్చలేదు. అతని సిద్ధాంతాలను దెబ్బ తీయాలనుకున్నాడు. తన పరిచారకుని పిలిచి అతనికి ఏదో చెప్పి పంపాడు. ఆ పరిచారకుడు బుద్ధుని భిక్షకు ఆహ్వానించాడు.
భిక్ష స్వీకారానికి వచ్చిన బుద్ధునికి అతను మాంసాన్ని వడ్డించాడు. ఆశ్చర్యంగా అతనివంక చూచాడు. "స్వామీ! నేను తినేదే కదా మీకు పెట్టగలను.స్వీకరించండి'' అని వినయం నటిస్తూ పలికాడు పరిచారకుడు.
భిక్షక ధర్మానికి కట్టుబడి బుద్ధుడు మాంసాహారాన్ని స్వీకరించాడు. ఈ సంఘటన బుద్ధుని మనస్సును తీవ్రంగా గాయపరిచింది. కారణం ఏదైనా అది తన సిద్ధాంతాలకి విరుద్ధమైన చరిస్. అదే బెంగతో మంచంపట్టి, మరణానికి చేరువై, తీవ్ర వేదన అనుభవిస్తున్నాడు. శిష్యులంతా కన్నీళ్ళతో చుట్టూచేరారు.
"గురుదేవా! బాధగా వుందా?'' అని అడిగాడు ఒక శిష్యుడు.

 


"అవును నాయనా! నలుగురు మోయాల్సిన శరీరాన్ని నేను ఒక్కడినే మోస్తున్నాను కదా! బాధగా వుండదా?'' అని సమాధానమిచ్చి మౌనం వహించాడు. ఆ తరువాత ఆ అహింసామూర్తి మరి మాట్లాడలేదు. అప్పటికి ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఓ మహాపురుషుని జీవన మహాప్రస్థానం అలా ముగిసింది. ఆ రోజు వైశాఖ పౌర్ణమి, మంగళవారం విశాఖనక్షత్రం. బుద్ధుని మరవలేము.
అతనికి జన్మనిచ్చి,జ్ఞానోపదేశం చేసి మరల తిరిగిరాని లోకాలకు తీసుకువెళ్ళిన వైశాఖ పౌర్ణమిని, విశాఖ నక్షత్రాన్ని మరవలేము. అందుకే బుద్ధుని స్మరిద్దాం. మనసారా అతని బోధనలను మననం చేసుకుందాం.
   

బుద్ధం శరణం గచ్చామి  
ధర్మం శరణం గచ్చామి  
సంఘం శరణం గచ్చామి 

"స్వస్తి''

 



రచన: యం.వి.యస్. సుబ్రహ్మణ్యం