Read more!

స్పృహ కోల్పోయిన లక్ష్మణుడు!

 

స్పృహ కోల్పోయిన లక్ష్మణుడు!

బ్రహ్మ ఇచ్చిన వరాలు ఉన్నాయని మిడిసిపడ్డావు, నా పిడికిలి గుద్దుతో నిన్ను పైకి పంపిస్తాను అన్నాడు హనుమంతుడు. అప్పుడు  రావణుడు "నువ్వంత మొనగాడివైతే అది చాలా గొప్ప విషయమే, నన్ను గుద్దు చూస్తాను" అన్నాడు.

హనుమంతుడు తన పిడికిలిని బిగించి రావణుడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి రావణుడికి స్పృహ తప్పినట్టయ్యి అటు ఇటూ తూలి "ఆహా! ఏమి గుద్దు గుద్దాపురా, చేస్తే నీలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి" అన్నాడు.

అప్పుడు హనుమంతుడు "ఛీ దురాత్ముడా, ఇన్నాళ్ళకి నా పిడికిలి పోటు మీద నాకు అసహ్యం వేసింది. దీనితో గుద్దాక నువ్వు బతికి ఉన్నావు ఎంత ఆశ్చర్యం. నేను ఇంక నిన్ను కొట్టను, నువ్వు నా వక్షస్థలం మీద గుద్దు, నా శక్తి ఏమిటో నువ్వు చూద్దువు కాని, అప్పుడు నేను నిన్ను మళ్ళీ తిరిగి గుద్దుతాను" అన్నాడు.

అప్పుడు రావణుడు తన కుడి చేతిని బిగించి హనుమ వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి హనుమంతుడు గిరగిరా తిరిగి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.

ఆ సమయంలో  సర్వసైన్యాధికారి అయిన నీలుడు చీమ అంత రూపంలోకి మారి రావణుడిని బాగా విసిగించాడు. రావణుడి బాణాల మధ్య నుండి తప్పించుకుంటూ వెళ్ళి ఆయన కిరీటం మీదకి దూకి, అక్కడినుండి కిందకి దూకి ఆయన చెవులు కొరికాడు, తరువాత ఆయన బుగ్గలు కొరికాడు, తరువాత ఆయన దుస్తులలో దూరాడు. అటు ఇటూ పాకుతూ నానా అల్లరి పెట్టాడు. అప్పుడు రావణుడు అగ్నేయాస్త్రాన్ని నీలుడి మీదకి అభిమంత్రించి వదిలాడు, అప్పుడా అస్త్రం మంటలు కక్కుతూ నీలుడి మీద పడిపోయింది. అదృష్టవశాత్తు నీలుడు అగ్ని యొక్క అంశకి జన్మించినవాడు కాబట్టి ఆ మంటలని తట్టుకోగలిగాడు, కాని స్పృహ కోల్పోయి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.

ఇక రావణుడిని ఉపేక్షించకూడదు అనుకొని రాముడు ముందుకి వెళుతుండగా, లక్ష్మణుడు రాముడి పాదాలు పట్టుకొని "అన్నయ్య! నువ్వు వెళ్ళకూడదు. ఇలాంటి వాడితో యుద్ధం చేయడానికి నువ్వు వెళితే మేమంతా ఎందుకు?? నేను వెళతాను, నన్ను ఆశీర్వదించు" అన్నాడు.

అప్పుడు రాముడు "నాయనా। వచ్చినవాడు సామాన్యుడు కాదు. వాడు వేసిన బాణాలని నిగ్రహిస్తూ, నీ బాణములతో వాడి మర్మస్థానముల మీద గురి చూసి కొడుతూ రావణుడిని నొప్పించు. లోపల మంత్రాలని మననం చేసుకుంటూ వెళ్ళు" అని చెప్పాడు.

"దుష్టాత్ముడవై మా వదినని అపహరించావు, ఇప్పుడు యుద్ధ భూమిలో కనపడ్డావు కాబట్టి నువ్వు ఇక ఇంటికి వెళ్ళే సమస్య లేదు" అని చెప్పి లక్ష్మణుడు రావణుడి మీద బాణములను ప్రయోగించాడు. లక్ష్మణుడు వేసిన బాణములను రావణుడు దారిలోనే సంహారం చేసి తాను కొన్ని బాణములను ప్రయోగించాడు. రావణుడు వేసిన బాణములను లక్ష్మణుడు నిగ్రహించాడు. ఇక లక్ష్మణుడిని ఉపేక్షించకూడదని రావణుడు భావించి బ్రహ్మగారు ఇచ్చిన శక్తి (ఈ అస్త్రం ఎవరిమీదన్నా ప్రయోగిస్తే ఇంక వారు మరణించవలసిందే) అనే భయంకరమైన ఆయుధాన్ని అభిమంత్రించి ఆయన మీద వేశాడు. లక్ష్మణుడు దాని మీదకి వేసిన అనేక బాణములను కూడా అది నిగ్రహించుకుంటూ వచ్చి ఆయన వక్షస్థలం మీద పడింది. అప్పుడు లక్ష్మణుడు "నేను విష్ణు అంశ" అని స్మరించాడు. అయినా ఆ బాణము యొక్క దెబ్బకి లక్ష్మణుడు స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు.

                                   ◆నిశ్శబ్ద.