Read more!

రావణుడికి హనుమంతుడి సవాలు!

 

రావణుడికి హనుమంతుడి సవాలు!

రాముడంతటివాడు కూడా యుద్ధ భూమిలోకి వస్తున్న రావణుడిని చూసి "మిట్ట మధ్యానం వేళ సూర్యుడిని చూస్తే స్పష్టంగా కనపడకుండా ఆయన తేజస్సు చేత కళ్ళు అదిరినట్టు, ఈయనని చూస్తే కూడా కళ్ళు అదురుతున్నాయి. ఎవరు వస్తున్నవాడు??" అని ఆశ్చర్యపోయి, వస్తున్నవాడు ఎవరని విభీషణుడిని అడిగాడు. 

విభీషణుడు రాముడితో "రామ! ఆ ఏనుగు మీద వస్తున్నవాడు అకంపనుడు (రామాయణంలో అకంపనుడు అనే పేరుతో ఇద్దరున్నారు), వాడిది సామాన్యమైన యుద్ధం కాదు, వాడిని కనీసం పర్వత శిఖరాలతో కొట్టాలి, లేకపోతే వాడికి ఇష్టం ఉండదు. ఆయన పక్కన రథంలో వస్తున్నవాడు ఇంద్రజిత్. వాడి రథం యజ్ఞాగ్నిలో నుండి బయటకి వస్తుంది, సింహములు పూన్చిన రథం మీద వస్తాడు. ఈ పక్కన, మహేంద్ర పర్వతం, వింధ్య పర్వతం ఎంత శరీరాలతో ఉంటాయో, ఎంత ధైర్యంతో ఉంటాయో, అంతటి ధైర్యము, శురము ఉన్న అతికాయుడు వస్తున్నాడు చూడు, పర్వత శిఖరం కదిలివస్తోందా అన్నట్టుగా ఉన్న ఆ ఏనుగు మీద వస్తున్నవాడు మహోదరుడు. అక్కడ ఒక గుర్రము ఎక్కి పాశము పట్టుకొని వస్తున్నవాడు పిశాచుడు, వాడు అరవీరభయంకరుడు. అటుపక్క వృషభం ఎక్కి చేతిలో శూలం పట్టుకొని వస్తున్నవాడు త్రిశిరస్కుడు. వాడు మహా ఘోరమైన యుద్ధం చేస్తాడు. అటుపక్క తన ధ్వజానికి సర్పాన్ని గుర్తుగా పెట్టుకొని, ధనుస్సు పట్టుకొని వస్తున్నవాడు కుంభుడు. అలాగే పర్వతాలని గులకరాళ్ళగా విసరగల బాహుపరాక్రమము కలిగినవాడు ఆ పక్కన వస్తున్నాడు. వాడి పేరు నరాంతకుడు. భోజనం చెయ్యడం అందరికీ ఎంత సంతోషమో, యుద్ధం చెయ్యడం అంత సంతోషంగా ఉండేవాడు నికుంభుడు.

అదుగో అక్కడ పది తలకాయలతో, ఇరవై చేతులతో, కిరీటాలు వేసుకొని, కుండలాలు తొడుక్కొని, బ్రహ్మాండమైన పర్వతంవంటి భీమకాయం కలిగినవాడు, మహేంద్రుడు, యముడు, దేవతలు మొదలైనవారిని యుద్ధరంగంలో పరుగులు తీయించినవాడు, అందరినీ శాసించగలిగినవాడు, ఎవడి పేరు చెబితే లోకాలు ఏడుస్తాయో అటువంటి రావణుడు ఆ ఏనుగు మీద వస్తున్నాడు" అని చెప్పాడు.

అప్పుడు రాముడు రావణుడిని చూసి "ఏమి తేజస్సు, ఏమి కాంతి, ఏమి స్వరూపం, ఏమి పరాక్రమం, మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. ఇప్పటివరకూ నేను దేవతలలో కాని, యక్షులలో కాని, గంధర్వులలో కాని ఇంత తేజస్సు కలిగినవాడిని చూడలేదు. కాని ఇన్నాళ్ళకి రావణుడిని చూసే అదృష్టం కలిగింది, ఇక వీడు తిరిగి ఇంటికి వెళ్ళడు. ఎవరితో యుద్ధం చెయ్యాలని చూస్తున్నానో అలాంటివాడు ఇవ్వాళ యుద్ధ భూమిలోకి వచ్చాడు" అని సంతోషంగా ధనుస్సుని చేతితో పట్టుకొని టంకారం చేశాడు.

రావణుడిని చూడగానే సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పెకలించి గబగబా వెళ్ళి రావణుడి మీద పడేశాడు. తన మీదకి వస్తున్న ఆ పర్వత శిఖరాన్ని రావణుడు అర్థచంద్రాకార బాణాలతో తుత్తునియలు చేసి, బంగారు కావలు కలిగిన బాణాలతో సుగ్రీవుడి గుండెల్లో కొట్టాడు. ఆ దెబ్బకి భూమిలో నుండి జలం పైకొచ్చినట్టు సుగ్రీవుడి గుండెళ్లనుండి రక్తం పైకి వచ్చింది. అంతటి సుగ్రీవుడు కూడా గట్టిగా అరుస్తూ కిందపడి మూర్చపోయాడు. ఆ తరువాత గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, ఋషభుడు, నలుడు మొదలైన వానర వీరులందరి మీద 4, 6, 8, 12 బాణములను ఒకేసమయంలో విడిచిపెట్టి వాళ్ళ మీద కొట్టాడు. వాళ్ళందరూ కింద పడిపోయారు.

వానర వీరులందరినీ రావణుడు కొట్టేస్తున్నాడని హనుమంతుడు గబగబా వచ్చి రావణుడి రథం ముందు నిలబడి కుడి చెయ్యి బిగించి "రావణా! నీకు బ్రహ్మగారి వరాలు ఉన్నాయని మిడిసిపడ్డావు. సీతమ్మని అపహరించావు. నా పిడికిలి గుద్దు చేత నీలోని జీవాత్మని పైకి పంపించేస్తాను రా" అన్నాడు.

                                       ◆నిశ్శబ్ద.