కృష్ణ గణపతి
బ్రహ్మ వైవర్త పురాణంలో గణపతి ఖండమను అధ్యాయమున్నది .దానిలో గణపతి చెందిన పెక్కు విషయాలున్నవి . కృష్ణ పరమైన ఆ పురాణంలో గణపతి కృష్ణుని అంశలోనే జన్మించినట్లు చెప్పబడింది . పార్వతి పుత్రకాంక్షతో శివునితో కూడ రతి క్రీడలో వున్న సమయంలో దేవతలు రతి గృహ ద్వారం వద్దకు వచ్చి మొరపెట్టుకొన్నారు.
సంభోగ మధ్యమున వెలుపలికి వచ్చిన శివుని వీర్యం భూమిపై పడింది .దానివల్ల షణ్ముఖుడు అవతరించాడు. కానీ పార్వతికి తనకు సంతానము కలుగ లేదన్న వ్యధ ప్రారంభమయింది . శ్రీ కృష్ణుని సూచన మేరకు శివుడు పుత్రప్రాప్తి కొరకు పుణ్యక వ్రత మాచరించునట్లు చెప్పినాడు .ఆ వ్రతాన్ని చేసిన తరువాత శ్రీ కృష్ణుడు గోప కిశోరరూపమున ఆమెకు దర్శన మిచ్చినాడు.
కోటి కందర్ప లావణ్య మనోహరుడగు కృష్ణుని వంటి పుత్రుడు తనకు కావాలని ఆశించి యిష్టార్ధ సిద్ధిని పొందింది . తరువాత పుత్రాకాంక్షతో పరమ శివునితో రతి క్రీడలో నున్న సమయంలో విష్ణువు మాయరూపంలో వచ్చి ద్వారం వద్ద నిలిచి ‘భిక్షాందేహి ‘అన్నాడు . మాయా భిక్షువు పలుకులు విన్న శివుడు సంభోగ మధ్యంలో లేవగా అతని రేతస్సు అట్లే శయ్య పడెను.శివపార్వతులు ఖిన్న వదనులై వెలుపలికి వచ్చి గృహస్థ ధర్మము మేరకు ఆ బ్రాహ్మణుని సత్కరించి సంతృప్తిని గావించినారు .ఆ బ్రాహ్మణుడు ‘శ్రీ కృష్ణుడు వ్రత కల్పమునకు గణేశునిరూపంలో మీ కుమారుడుగా జన్మించును’అని ఆశీర్వదించి అంతర్ధానమై రతి గృహములో ప్రవేశి౦చి శిశురూపమున శివుని వీర్య స్థలనమైన చోట పోరలాడి,నవజాత శిశువలె పండుకొని వుండినాడు .అశరీర వాణి యొక్కటి ‘ఓ పార్వతి, కృష్ణ పరమాత్మా శిశు రూపమున నీ మందిరమున వున్నాడు ‘అని పలికి౦ది.
శివపార్వతులీద్దరూ లోపలికి వెళ్ళి ఆనందంతో ఆ శిశువును ఎత్తుకొని ముద్దాడారు. ఆ శిశువే ‘గణపతి’ అయినాడు . దేవాధి దేవతలందరూ వచ్చి ఆ శిశువును చూచి అతడు సిద్దిదాయకుడు,అగ్రపూజార్హుడు అగునట్లు , అనుకూలవతియగు భార్య లభించునట్లు,కవితాశక్తి ,వివేచనాశక్తులు కల్గి వేదజ్ఞాన సంపన్నుడై కృష్ణభక్తుడై, ధర్మపరిపాలకుడై, విఘ్నరహితుడు ,విఘ్ననాశకుడు అగుగాక అని ఆశీర్వదించిరి. ఈ శివ పుత్రుని దర్శనార్ధమై అందరూ దేవతలవలె శనైశ్చరుడు వచ్చినాడు కానీ తలయెత్తి బిడ్డను చూడలేదు .ఎందుకు చూడలేదని పార్వతి ప్రశ్నించగా తాను కనులార చూచిన వస్తువు నాశనమగినట్లు తనకు శాపమున్నదిని వివరించాడు . శ్రీ కృష్ణా౦షాతో జన్మించిన యీ శిశువు నున్ను చూచి భయపడుట కళ్ళ అని పార్వతి అతనిని ఒత్తిడి చేయడంతో శని ఆ బిడ్డను చూచినాడు .వెంటనే ఆ బిడ్డ తల కత్తిరింపబడి క్రిందపడినది. ఈ విషాద సంఘటన ఫలితముగా పార్వతి దేవీ ,కైలసమందున్న యితర దేవతలందరూ ముర్చితులైనారు.వెంటనే శ్రీహరి గరుడారూఢుడై వెడలి ఉత్తర దిశలో పుష్పభద్ర తీరమున రత్యాయాసంతో అలసిపోయిఉత్తర శిరస్సు చేసి పండుకొన్న మగ ఏనుగు తలను ఖండించి తీసికొనివచ్చి మొండానికి తనే అతికించినాడు.
తనే మొదట వినాయకుని పూజించి అతనికి సకల సిద్ధులను అనుగ్రహించుటయేకాక,విఘ్నేశ,గణేశ,హేరంబ,గజానన,లంబోదర,ఏకదంత,శూర్పకర్ణ,వినాయక అను ఎనిమిది పేర్ల నుంచి ఆశీర్వది౦చాడు.