Read more!

మధుమాంసాలు నైవేద్యంగా స్వీకరించే దేముడు

 

 

 

మధుమాంసాలు నైవేద్యంగా స్వీకరించే దేముడు

 


ఎక్కడైనా దేముడికి నైవేద్యం పెట్టాలంటే పులిహార,దద్ధోజనం, చక్రపొంగలి నివేదన చేస్తారు. కాని విచిత్రంగా ఈ ఆలయంలో దేముడికి కల్లు, చేపలు, మాంసాన్ని నివేదిస్తారు. ఈ వింత ఆచారం ఉన్న ఆలయం కేరళలోని కన్నూర్ జిల్లాలో వలపట్టణం అనే నదీ తీరంలో ఉంది. ఇక్కడ దేముడిని ముత్తప్పన్ అని పిలుస్తారు. అయితే అన్ని వైదిక దేవాలయాల లాగా కాకుండా ఇక్కడ దేముడు జానపద దేవతగా పూజలందుకుంటాడు. మూలవిగ్రహం కూడా విల్లుబాణాన్ని చేతపట్టుకుని కనిపిస్తుంది.


ఉత్సవాలు కూడా అన్ని వైదిక దేవాలయాల్లో జరిగేలాగా జరగవు. ముత్తప్పన్ తిరువోప్పన మహోత్సవం ఇక్కడి ప్రధాన ఉత్సవం. ఇది మూడు రోజులు జరుగుతుంది.  ఈ ఉత్సవాలలో ముత్తప్పన్ తెయ్యం అనే సంప్రదాయ నృత్యం ఏర్పాటు చేస్తారు. ఇందులో నాట్యం చేసేవారు దేముడి ఆకారానికి దగ్గరగా ఉండేలా తయారవుతారు.


ఈ దేముడికి సంబంధించిన ఒక గాధలో ఎన్నో ఏళ్ళుగా సంతానం లేని ఒక బ్రాహ్మణ స్త్రీకి నదిలో కొట్టుకోస్తున్న  పువ్వుల బుట్టలో  ముత్తప్పన్ దొరికాడట. ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న ఆ బాలుడు కల్లు తాగటం మాంసం తినటం అలవాటు చేసుకున్నాడట. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన యితడు అలా  చెయ్యటం తెలుసుకున్న తల్లి గట్టిగా మందలించిందట. అప్పుడు కోపంతో అతను చూసిన చూపుకి తల్లికి భయం వేయటంతో ముతప్పాన్ తన నిజ స్వరూపాన్ని చూపించాడట. ఆ బాలుడు కారణ జన్ముడని తెలుసుకున్న అతని తల్లి కళ్ళకి అడ్డుగా పోయికన్ను అనే దానిని పెట్టుకోమందిట. అందుకే ఇప్పటికి ముత్తప్పన్ విగ్రహానికి వెండి కళ్ళు అలంకరణగా పెట్టి ఉంటాయి.

 


అలా జరిగిన తరువాత ఇల్లు వదిలి వెళ్ళిన ముత్తప్పన్ వెళుతూ వెళుతూ చెట్టు నుండి కల్లు దింపుతున్న చెంతన్ అనే వాడిని కల్లు పోయమని అడిగితె ఆటను నిరాకరించాడట. దానితో ముత్తప్పన్ కోపానికి అతను రాయిల మారాడట. చెంతన్ భార్య వచ్చి వేడుకోవటంతో కరుణించి మరలా మాములు రూపాన్ని ప్రసాదించాడట.


ముత్తపన్ తన స్పర్శతో ఎన్నో రోగాలని నయం చేసేవాడట. ఎవరేది కోరుకుంటే వారికీ అది లభించేదిట. ఇలా అక్కడి ప్రజల పాలిట ప్రత్యక్ష దైవంగా పూజలందుకున్నాడట ముత్తపన్. ఎప్పుడూ అతనితో  పాటే వెనక తిరిగే కుక్కని కూడా దైవంగా భావించి కొలిచేవారట అక్కడి ప్రజలు. అందుకే ఇప్పటికి ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర కుక్క విగ్రహం ఉంటుందిట. ఆలయంలో కూడా కుక్కలు తిరుగుతూ ఉంటాయి గాని ఎవరిని ఏమి అనవు. ఆలయానికి వచ్చే భక్తులు వీటికి తినుబండారాలు వేస్తారు.

ఇన్ని విచిత్ర సంప్రదాయాలున్న ఆలయాలు కూడా ఉన్నాయా అని మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. కేరళ వెళితే అక్కడ ఈ ముత్తపన్ దేవాలయంలో మరెన్నో వింతలూ చూడచ్చు.


                                                                                                             ...కళ్యాణి