Read more!

గాయత్రీదేవి రామాయణం

 

గాయత్రీదేవి రామాయణం

వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమేనన్న విషయం ప్రసిద్ధమైనది. గాయత్రీ మహా మంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగింది. వాల్మీకి రామాయణంలో ఇరవై నాలుగువేల శ్లోకాలున్నాయి. ఒక్కొక్క అక్షరానికి వ్యాఖ్యాన రూపంలో వేయి శ్లోకాలు రచింపబడ్డాయి. లేదా వేయి శ్లోకాలకు ఒక్కొక్క అక్షరం సంపుటి చేయబడినదని కూడ చెప్పవచ్చును.

ప్రస్తుతం లభ్యమౌతున్న వాల్మీకి రామాయణ సంస్కరణాలలో శ్లోక సంఖ్య కూడ ఒక తీరుగా ఉండడం లేదు. విశేషబేధం గోచరిస్తున్నది. దీనివల్ల మధ్యకాలంలోని అంధకార యుగంలో, తురుష్కుల కాలంలో ఎన్ని శ్లోకాలు నష్టమై భ్రష్టమై పోయినదీ తెలియటంలేదు. అన్య గ్రంథాలవలనే సాంప్రదాయకమైన ఉద్వేగ ఆవేశాల ప్రభావంలో పడ్డా 'వాల్మీకి రామాయణం' లో కూడ కొన్ని శ్లోకాలు చేర్చబడడం జరిగి ఉండవచ్చును. ప్రస్తుతం మనకు అవ్యవస్థిత క్రమంలో ఉన్న గ్రంథాలే లభిస్తున్నాయి. ఏ భేదం ఒక్కొక్కచోట శతసంఖ్యను అధిగమించుచున్నది.

ఇది ఏమైనా వాల్మీకి మహర్షి ఈ గాయత్రీ బీజాక్షరాలను సంపుటీకరించడంలో గల రహస్య కారణాలను సమగ్రంగా గ్రహించజాలము. అయినా బీజాక్షర సంపుటయుక్తాలైన శ్లోకాలను గమనింప గలిగితే వాటి మహత్వ విషయం ద్యోతకమవుతుంది. అందులో అధికాంశ శ్లోకాలు ఘటనాత్మకాలై యున్నాయి. గంభీర దృష్ట్యా పరిశీలింప గలిగితే వాటిలో సంకేత రూపంలో దాన్ని ఆచరణలో పెట్టగలిగితే మానవ జీవితం అసాధారణ విశేషత్వాలతో పరిపూర్ణం కాగలదు.

ఈ ఇరవై నాలుగు అక్షరాలూ ఆరంభంగా గల శ్లోకాలే 'గాయత్రీ రామాయణ' నామంతో ప్రసిధ్ధికెక్కినది. ఈ శ్లోక గర్భాలలో సాంకేతిక రూపంలో నిక్షేపింపబడ్డ మర్మాలను తెలిసికొని, హృదయంగమం చేసికోగలవాడు సంపూర్ణ వాల్మీకి రామాయణ పారాయణ లాభాన్ని పొందుతాడు. గాయత్రీ బీజాక్షర సంపుటీ యుక్తమైన శ్లోకాలపై విమోచన చేద్దాము.

తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీవాగ్విదాం వరం
  నారదం పరి పప్రచ్ఛ వాల్మీకి ర్ముని పుంగవమ్ !!

తపోధనుడు, వాజ్మయవేత్త లలో అగ్రేసరుడు, మహర్షి శ్రేష్ఠుడు, వేదాధ్యయన తపస్సాధనారతుడు అయిన నారద మునిని వాల్మీకి మహర్షి ప్రశ్నించాడు.

ఈ శ్లోకంలో రెండు విషయాలపై విమర్శ జరిగింది. నారదునికి రెండు పదవులీయబడ్డాయి. అందుకు కారణం కూడా వ్యక్తం చేయబడింది. సర్వశ్రేష్ఠ విద్వాంసుడగు, మునిశ్రేష్ఠుడుగ అతడు వర్ణింపబడ్డాడు.

విద్వాంసులలో సర్వ ప్రధానునిగా అతణ్ణే ఎందుకు వర్ణించాలి?
వ్యాసమహర్షివలె అతడు అష్టాదశ మహాపురాణ రచయితయా?
ఇతరేతర విద్వాంసులు చూపించని విశేషత్వాన్ని అతడేమైనా ప్రదర్శించాడా?
లేక వాల్మీకి అసత్యవాదియా?
నారదుణ్ణి అత్యుక్తి పూర్వకంగా ప్రశంసించవలసిన అవసరమేముంది?

ఈ శ్లోకంలో నారదుణ్ణి సర్వ శ్రేష్ఠ విద్వాంసుడనడానికి గల కారణం కూడా వివరించబడింది. కేవలం గ్రంథాల్ని కంఠస్థం చేసేవారు ఒకరిని మించి మరొకరున్నారు. అట్టివారి జీవితాలు గ్రంథ పఠనంలోనే జీర్ణమైపోతాయి. సహస్ర సంఖ్యలలో గ్రంథాలను పఠించేవారిని సర్వశ్రేష్ఠ విద్వాంసులందుమా? అలాకాదే? గ్రంథపఠన వ్యసనం జ్ఞాన వర్ధకం కాగలుగునా? దానివలన ఆధ్యాత్మిక లాభం ఏమీ లభించదే! శాస్త్రాల్ని ఎంతగా పఠించినా నిత్యం వాటిని చింతన చేస్తూండాలి. శాస్త్రార్థం పై, ఆదేశంపై, మహత్త్వంపై గంభీరాధ్యయన మననాదులు చేస్తూండాలి. ఆత్మమథనం వలన లభించే నవనీతాన్ని జీర్ణం చేసుకుని ఆత్మసాక్షాత్కారం చేసికోవటమే సాధ్యాయానికి యథార్థమైన ఫలం. ఈ విధంగా శాస్త్రాలను సేవించగలిగేవాడే విద్వాంసులలో శ్రేష్ఠుడనబడతాడు. కనుకనే నారదమహర్షి విద్వాంసులలో శ్రేష్ఠుడనబడ్డాడు.

రెండవది, అతడు మునులలో శ్రేష్ఠు అనబడడానికి కారణం, దీనికి కూడా సమాధానం సిద్ధంగానే ఉంది. అదియే తపస్సు. మననం చేసేవారిని మునులంటారు. సత్తసత్త్వాన్ని మననం చేసేవారు చాలా మంది వున్నారు. కాని, అంతమాత్రమే చాలదు. ఆదర్శానికై మహత్తర ప్రయత్నం చేసే ఏకాగ్రత, అందుకై మహాకష్టాలను సహించగలిగే సాహసం కావాలి. అట్టి తపస్వియే మునులలో శ్రేష్ఠుడు కాగలడు. దేవర్షి క్షణకాలం కూడ విశ్రాంతి తీసికొనక నిజలక్ష్య సాధనకై సర్వత్రా భ్రమణం చేస్తూ లోక కళ్యాణార్ధమే జీవన సర్వస్వాన్నీ అంకితం చేయునట్టి మహానీయుడై యున్నాడు.

ఈ శ్లోకంలో నారదుని మధ్యస్థునిగా చేసి, తపస్స్వాధ్యాయాల సర్వశ్రేష్ఠత్వాన్ని వర్ణించడం జరిగింది. గాయత్రీ రామాయణ ప్రథమ శ్లోకం మనల్ని తపస్వులనుగా, స్వాధ్యాయ శీలురనుగ చేయుచున్నది. ఈ శ్లోకాంతర్గత నిగూఢ సదుపదేశం ఇదియే.-