Read more!

శ్రీ గాయత్రీదేవి దివ్యశక్తి

 

శ్రీ గాయత్రీదేవి దివ్యశక్తి

ఓం శ్రీ గణేశాయనమః 
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః
ఓం గాయత్రీ మహామంత్రము
ఓం భూర్భువ స్వః
త త్సవితు ర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్ !!

సర్వవిజ్ఞాన, శబ్దశాస్త్రముల రహస్యమయాధారముపై గాయత్రీ మహా మంత్రాక్షరముల సంపుటి జరిగింది. ఈ మహామంత్రోచ్ఛారణ మాత్రముచే సూక్ష్మ దేహము నందున్న శక్తికేంద్రములు అనేకములైనవి. స్వయముగా మేలుకొనుచుండును. సూక్ష్మ దేహములోని అంగప్రత్యంగములలో అనేక చక్రోపచక్రాలూ, గ్రంధులూ, మాతృకలూ - ఉపత్యక, మేరుభ్రమరాదిగాగల రహస్య సంస్థానములున్నవి. వీటి వికాసమాత్రముచే సాధారణుడు సైతము అగణిత శక్తులకు అధినేత కాగలుగును. గాయత్రీ పవిత్ర మంత్రోచ్ఛారణా క్రమమును అనుసరించు కంఠము, జిహ్వ, దంతములు, తాలువులు, ఓష్ఠములు, మూర్థము మొదలైన వాటి నుండి గుప్తస్పందనము విశేషముగా జరుగుచుండును. ఏతత్ స్పందనము అనేక శక్తి కేంద్రములను స్మృశించి, వాటి నిద్రావస్థను రూపుమాపి చైతన్యమును కలుగజేయుచుండును. యోగీశ్వరులు, మునీశ్వరులు మొదలైన మహాత్ములు తపస్సు ద్వారా దీర్ఘకాలమున సాధించునట్టి మహా కార్యములను గాయత్రీ మహా మంత్రోపాసకులైన వారు అనతికాల వ్యవధిలోనే సాధించగలుగుచున్నారు.

భగవత్యాధకుల మధ్యగల విశేష దూరమును దూరమొనర్చుటకు చతుర్వింశత్యక్షరయుక్త మగు ఈ గాయత్రీ మహామంత్రమే మహత్తరమైన  దివ్యాధారమైయున్నది. భూతములపై నున్నవారు మెట్ల సహకారముతో మహోన్నత సౌధము నధిరోహించ గలుగునట్లు గాయత్రీ మహా మంత్రోపాసకుడు 24 బీజాక్షరముల సహకారముతో భూమికలను క్రమక్రమముగా దాటుచూ గాయత్రీ మహామాతృ చరణారవింద సన్నిధిని చేరుకొనగలుగును. మహోత్తమమై పరమ పవిత్రమైన గాయత్రీ మహామంత్రములోని ప్రత్యేక బీజాక్షరము ఒక్కొక్క మంత్రసమమై మహత్తర శక్తి సంపన్నమైయున్నది. ఇందు ధర్మశాస్త్రము తేజరిల్లు చున్నది. ఇయ్యక్షరముల వ్యాఖ్యాన మూర్తి అయిన బ్రహ్మదేవుడు వేదచతుష్టయ ప్రచారార్థము మహత్తర తపస్సు చేసెను. ఆ బీజాక్షరముల మహత్తరార్థములను వ్యక్తము చేయవలెనని మహర్షులు ధర్మశాస్త్ర గ్రంథములును ప్రాదుర్భవింప జేసినారు. విశ్వవ్యాప్తమై యున్న విజ్ఞాన సర్వస్వము ఈ 24 బీజాక్షరములలో  నిక్షిప్తమై యున్నది.