Read more!

తొలి ఏకాదశి (Toli Ekadashi)

 

తొలి ఏకాదశి (Toli Ekadashi)

తిథుల్లో ఏకాదశి మంచిది. అందునా తొలి ఏకాదశి మరింత పవిత్రమైంది. ఆషాఢమాసం పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని, తొలి ఏకాదశి పర్వదినంలా జరుపుకుంటారు. తొలి ఏకాదశిని ఆషాఢ ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా అంటారు. చాతుర్మాస్య వ్రతం ఈరోజే ఆరంభమౌతుంది. విష్ణుమూర్తిని కొలిచే వైష్ణవులకు తొలి ఏకాదశి ప్రీతికరమైన రోజు.

పురాణ కథనాలను అనుసరించి, విష్ణుమూర్తి క్షీర సాగరంలో శేషతల్పం మీద హాయిగా పడుకుని తొలి ఏకాదశినాడు నిద్రకు ఉపక్రమించాడట. అలా పడుకున్న విష్ణుమూర్తి నాలుగు నెలల తర్వాత అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు మేల్కొన్నాడట. అందుకే ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలు అంటారు.

ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. వినాయక చవితి రోజున విద్యార్థులు తమ పుస్తకాలను, కలాలను పూజలో ఉంచి నమస్కరించుకున్నట్టుగా తొలి ఏకాదశి నాడు రైతన్నలు నాగలి, గునపము మొదలైన పరికరాలకు పూజ చేస్తారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.

ఏకాదశి రోజున కర్షకులు పూజ పూర్తయిన తర్వాత పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు. ఈవేళ తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది. కొత్త కూలీలను మాట్లాడ్డం లాంటి పనులు ఏమైనా ఈవేళ చేస్తారు. వాళ్ళను ఈవేళ పనిలోకి రమ్మని ప్రత్యేకంగా చెప్తారు. కొత్త ఒప్పందాలు ఏవైనా ఈవేళ కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు. మరే మార్పుచేర్పులు అయినా ఈ తొలి ఏకాదశినాడు చేపడతారు.

తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.

సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగాల్లాగే తొలి ఏకాదశిని ముఖ్యమైన పండుగ దినంగా భావించి, ఉపవాసం ఉంటారు. ఈవేళ ఉపవాసం కనుక గారెలు, బూరెలు లాంటి పిండివంటలు ఏమీ చేయరు. కొందరు నేతితో పాయసం వండి ప్రసాదంగా పంచుతారు. పండ్లు మాత్రమే సేవిస్తారు.