Read more!

లక్ష్మీదేవి జయంతి (Lakshmidevi Jayanti)

 

లక్ష్మీదేవి జయంతి (Lakshmidevi Jayanti)

 

ఫాల్గుణమాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తాం. ప్రతి మానవుడూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివశించే ప్రాంతాల్ని, ప్రదేశాల్ని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకుని, ఇంటిముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని, సంప్రదాయాల్ని పాటించేవారికే ఆమె కటాక్షం లభిస్తుంది. ఇక ఇప్పుడు వివిధ పురాణాలల్లో లక్ష్మీదేవి జనన గాథల్ని గురించి తెలుసుకుందాం.

క్షీరసాగర మధనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు, అపూర్వ జంతుజాలాదులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అనేక పురాణాలలో కనపడే కథనమిది. విష్ణుపురాణంలో వేరొక గాథ కనపడుతుంది. ఆ గాథ ప్రకారం లక్ష్మీదేవి భ్రుగు మహర్షి కుమార్తె. భ్రుగు మహర్షి భార్య ఖ్యాతి. తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తఫః ఫలమే లక్ష్మీదేవి. విష్ణుమూర్తిని ఈమె వివాహమాడింది.

లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలవసిన మంత్రాల గురించి పురాణాలలో అనేకచోట్ల అనేక కథలున్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధారాస్తవం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలున్నాయి.

అపరిశుభ్రంగా ఉండే ఇళ్ళలోనూ, ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవజీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్దలతో పూజచేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్ళను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. లక్ష్మీదేవి కృపకు పాత్రులమవుదాం.