Read more!

నాగ పంచమి (Naga Panchami)

 

నాగ పంచమి

(Naga Panchami)

 

ఈరోజు నాగ పంచమి. ఏటా శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట.''నాగులచవితి'' మాదిరిగానే ''నాగ పంచమి'' నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు.

నాగ పంచమి ఎలా చేస్తారు?

నాగ పంచమి రోజున ముందుగా ఇల్లూ వాకిలీ శుభ్రం చేసుకుంటారు. తర్వాత తలంటుకుని, నిత్యపూజ పూర్తి చేస్తారు.ఆపైన దగ్గర్లో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి నీళ్ళు జల్లి ముగ్గు వేసి, పసుపు, కుంకుమలు పెడతారు. గంధం చిలకరిస్తారు. దీపం, అగరొత్తులు వెలిగించి, అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ ఈ అయిదు నాగ దేవతలనూ మనసులో స్మరించుకుని, భక్తిగా నమస్కరిస్తారు.

పాలు, పండ్లు, పంచామృతం, నువ్వులు, కొర్రలు, పంచామృతం మొదలైన వాటిని నాగ దేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు.

 

విషాణి తస్య నశ్యంతి న టాం హింసంతి పన్నగాః

న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్

- అనే మంత్రాన్ని స్మరిస్తూ పుట్టలో పాలు పోయాలి.

నాగ పంచమి పూజ చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. అంతకంటే ముందు ఐదుగురు అతిథులను ఇంటికి ఆహ్వానించి, ప్రసాదం ఇచ్చి, విందు భోజనం పెడతారు. శక్తి లేనివారు కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టి, ఆ తర్వాతే వారు తింటారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.

నాగ పంచమి, కాలసర్ప దోష నివారణ

కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు, నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ జరిగి, సుఖసంతోషాలు అనుభూతికి వస్తాయి.