Read more!

ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలా నమస్కరించాలి? (Pradakshina Namaskaram)

 

ప్రదక్షిణ చేసేప్పుడు ఎలా నమస్కరించాలి?

(Pradakshina Namaskaram)

 

పూజ ముగిసిన తర్వాత చివరగా ప్రదక్షిణ నమస్కారం చేస్తాం. ప్రదక్షిణ నమస్కారం చాలా నెమ్మదిగా, ప్రశాంత చిత్తతతో, భక్తిపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణల్లో ఆత్మ ప్రదక్షిణ ఒకటి. అంటే మనచుట్టూ మనం తిరుగుతూ నమస్కరిస్తాం. రెండోది గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ చేసే ప్రదక్షిణ.

 

ప్రదక్షిణ నమస్కారం చేసేటప్పుడు

''అపరాధ సహస్రాణి..'' అని భక్తిగా స్మరించుకోవాలి. అలాగే ప్రదక్షిణ నమస్కారం చేసేటప్పుడు కుడిపక్కకు తిరుగుతాం కదా.. దీనివల్ల హృదయం నుండి వచ్చే రక్తం మరింత శుద్ధమై, ఇతర శరీర అవయవాలకు ప్రవహిస్తుంది. ప్రదక్షిణ వల్ల అనేక అవయవాలకు శుద్ధమైన రక్తం సరఫరా అవుతుంది. ఏదో మొక్కుబడిగా పరుగులెత్తుకుంటూ, వ్యాకుల మనసుతో ఏమేమో ఆలోచిస్తూ ప్రదక్షిణ చేసినందువల్ల ప్రయోజనం లేదు.

 

సాధారణంగా మూడు, అయిదు లేదా పదకొండుసార్లు ప్రదక్షిణ చేస్తుంటాం. అయితే, వివిధ దేవుళ్ళకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో పెద్దలు నిర్దేశించారు.

విఘ్నేశ్వరునికి - ఒకసారి

సూర్యునికి - రెండుసార్లు

మహాశివునికి - మూడుసార్లు

విష్ణుమూర్తికి - నాలుగుసార్లు

రావిచెట్టుకు - ఏడుసార్లు

చొప్పున ప్రదక్షిణ చేయడం ఒక పద్ధతి. మొత్తానికి ఏ దేవుని ప్రార్థిస్తూ ఉంటే, ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి.

 

ప్రదక్షిణ తర్వాత సాష్టాంగ నమస్కారం చేయడం ఆచారం. ఈ సాష్టాంగ నమస్కారం భుజంగాసనం, అధోముఖ ఆసనం లాంటివి చేసినట్లవుతుంది.

 

అనేకసార్లు చెప్పుకున్నట్లుగానే ఆచారం పేరుతో మనం చేసేవన్నీ శాస్త్రీయంగా ఉపయుక్తమైనవే. ప్రదక్షిణ నమస్కారం వల్ల మానసిక ప్రశాంతత చిక్కడమే కాకుండా శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది.