Read more!

సురస దగ్గర హనుమంతుడి తెలివి!

 

సురస దగ్గర హనుమంతుడి తెలివి!

హనుమంతుడు మైనాకుడి దగ్గర నుండి మళ్ళీ ప్రయాణం చేసి వెళుతుంటే దేవతలు నాగమాత అయిన సురసతో (సురస దక్షుని కుమార్తె) "చూశావ తల్లి, హనుమ వచ్చేస్తున్నాడు. నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడి, మింగేస్తానని భయపెట్టి, ఆయన సామర్ధ్యాన్ని పరీక్ష చెయ్యి" అన్నారు.

అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది, సముద్రం నుండి బయటకి వచ్చి హనుమంతుడితో "నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు. నేను నిన్ను తింటాను, కాబట్టి నువ్వు నా నోట్లోకి దూరు" అని పలికింది.

అప్పుడు హనుమంతుడు సంతోషంగా రామ కథని సురసకి చెప్పి "నేను సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని వెళుతున్నాను. ఒకసారి సీతమ్మ జాడ కనిపెట్టి, వెనక్కి వెళ్ళి రాముడికి ఆ విషయాన్ని చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను. కాని ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లీ, నేను సత్యమే మాట్లాడుతున్నాను. మాట తప్పను" అన్నాడు.

అప్పుడా సురస "అలా కుదరదురా, నాకు బ్రహ్మగారి వరం ఉంది. నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే" అని తన నోరుని పెద్దగా తెరిచింది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరు 100 యోజనములు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటను వేలంత చిన్నవాడిగా అయిపోయి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటకి వచ్చి "అమ్మా! నువ్వు చెప్పినట్టు నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను. సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరతాను" అన్నాడు.

"ఎంత బుద్ధిబలం రా నీది, రాముడితో సీతమ్మని కలిపినవాడు హనుమ అన్న ప్రఖ్యాతిని నువ్వు పొందుతావు" అని సురస హనుమంతుడిని దీవించింది.

అప్పుడు హనుమంతుడు సురసకి ఒక నమస్కారం చేసి ముందుకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న హనుమంతుడిని సింహిక అనే రాక్షసి సముద్రంలోనుండి చూసింది. ఆ సింహిక కామరూపి, ఆమెకి నీడని పట్టి లాగేసే శక్తి ఉంది. అప్పుడామె హనుమంతుడి నీడని పట్టి లాగడం మొదలుపెట్టింది. తన గమనం తగ్గుతోందని గమనించిన హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశాడు. ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళీ హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహిక నోటిద్వార లోపలికి ప్రవేశించి ఆమె మర్మావయవాన్ని తెంచుకొని బయటకి వచ్చేశాడు. గిలగిల తన్నుకొని ఆ సింహిక మరణించింది.

అలా ముందుకి వెళ్ళిన హనుమంతుడు లంకా పట్టణాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతం మీద దిగాడు.

                               ◆వెంకటేష్ పువ్వాడ.