Read more!

రక్త సంబంధాల గొప్పతనం ఇదే..!

 


రక్త సంబంధాల గొప్పతనం ఇదే.!

బంధాలలో రక్త సంబంధాలు చాలా గొప్పవి. తల్లిదండ్రులు, బిడ్డల తరువాత ఆ బంధం తోబుట్టువుల రూపంలో ఉంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళు.. ఈ బంధాల విలువ వెలకట్టలేనిది. జీవితాల్లో వివాహాలు, వృత్తి, సంపాదన, ఆర్థిక విషయాల కారణంగా తోబుట్టువులు ఒకరికొకరు దూరం అవుతారేమో.. కానీ తోబుట్టువుల మద్య బంధం దృఢంగా ఉంటే ప్రపంచంలో దానికి మించిన గొప్ప బంధం మరొకటి ఉండదు. దీనికి నిలువెత్తు ఉదాహరణగా రామాయణంలో ఒక చిన్న సంఘటన తెలియజేస్తుంది.

శ్రీరామచంద్రుడు తండ్రి మాట మీద అడవులకు వెళుతున్నప్పుడు ఓ  సంఘటన జరిగింది. రాముడు సీతమ్మతో కలసి అడవులలో... రాళ్ళూరప్పలతో నిండిన, కఠినాతికఠినమయిన దారుల్లో నడుచుకుంటూ ఓ చోట దిగాలుపడి కూర్చుంటాడు . అన్యమనస్కుడయి బాధపడుతున్న రాముడిని చూసి కారణమేంటని అడుగుతుంది ఆయన భార్య సీతాదేవి. అప్పుడు రామచంద్రుడు “దేవీ! తమ్ముడు భరతుడు మనస్సులో మెదులుతున్నాడు. మన వనవాసం విషయం తెలిసిన వెంటనే, మనను వెతుక్కుంటూ భరతుడు తప్పక వస్తాడు. అలా అన్వేషిస్తూ ఈ అడవుల్లో ఎంత మానసికక్షోభ అనుభవిస్తాడో కదా!” అంటాడు బాధగా.

అప్పుడు సీతమ్మ రాముడితో  "మీ తమ్ముడు స్థితప్రజ్ఞుడనీ, కష్టనష్టాలకు చలించడనీ ప్రశంసిస్తూంటారు కదా! ఈ మాత్రం బాధను కూడా ఓర్చుకోలేడా?" అంటూ రాముడి పక్కనే  కూర్చుంటుంది. 

సమాధానంగా శ్రీరాముడు “ఓ జానకీ! భరతుడు తాను కష్టాలు అనుభవిస్తున్నందుకు కుంగిపోయేంత బలహీనుడు కాడు. కానీ తన వల్ల అన్నావదినలు అడవుల పాలై, ఈ మార్గంలోనే నడుచుకుంటూ అయ్యో! ఎన్ని బాధలు పడ్డారోనని కుమిలిపోతాడు" అంటూ కన్నీరు పెట్టుకుంటాడు. 

అదీ ఆ అన్నదమ్ముల ఆత్మీయబంధం. తమ్ముడికి పట్టం కట్టడం కోసం అడవులు పట్టిన అన్న ఒకరైతే.... అన్న పాదుకలకు పట్టాభిషేకం చేసి వైభోగాలకు దూరంగా వనవాసిలా జీవించిన తమ్ముడు మరొకరు. అందుకే ఆ అనుబంధం అజరామరం... ఆదర్శ నీయం... గజం స్థలం పంపకంలో తేడా వస్తేనే గొంతు కోయడానికి కూడా వెనకాడని తోబుట్టువులున్న ఈ కాలానికి ఆ ఆదర్శం అతిశయోక్తిగానే కనిపిస్తుంది. కానీ సాక్షాత్తూ భగవంతుడు అన్నగా అవతరించి తోబుట్టువుల మధ్య నెలకొనవలసిన త్యాగనిరతిని ఆచరించి చూపించిన భూమి మనది. ఆర్థిక సంబంధాల కంటే మానవ సంబంధాలు గొప్పవని తెలుసుకున్నప్పుడు మనిషి వ్యక్తి అనిపించుకుంటాడు.


                                   *నిశ్శబ్ద.