Govindaraja swamy Temple Tirupati
తిరుపతి గోవిందరాజస్వామి దేవాలయం
Govindaraja swamy Temple Tirupati
తిరుమల ఏడుకొండలవానికి అన్నయ్యే గోవిందరాజస్వామి. శ్రీనివాసుని కల్యాణం కోసం ధనాన్ని కొలమానికతో కొలచి కొలచి అలసిపోయి, ఆ కొలమానికనే తలగడగా (దిండు) చేసుకుని సేదతీరినట్లు చెప్పే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది ఈ గోవిందరాజస్వామి దేవాలయం.
గర్భగృహంలో సున్నంతో చేసిన శయనమూర్తి అయిన శ్రీ గోవిందరాజస్వామి విగ్రహం నెలకొని ఉంది. తలకింద స్వామికి తలగడ (దీన్ని ''కుంచెం'' అని కూడా అంటారు) నాభి నుండి ఉద్భవించిన పద్మంపై చతుర్ముఖ బ్రహ్మ, తూర్పువైపున లక్ష్మీదేవి స్వామి పాదాలకు ఉత్తరంగానూ, ఉత్తరం వైపున దక్షినాభిముఖంగా భూదేవి విగ్రహాలున్నాయి. స్వామి పాదాలచెంత మధుకైటభులు అనే రాక్షసుల విగ్రహాలున్నాయి. గోవిందరాజస్వామికి అభిముఖంగా ధ్వజస్తంభం, బలిపీఠాలతోపాటు సమీపంలోని ఎత్తయిన చిన్న మంటపంలో ఆంజనేయస్వామిని ప్రతిష్టించారు. అలాగే గోవిందరాజస్వామి దేవాలయంలో ద్వారపాలకులతోబాటు వసంత మంటపం, నీరాళి మంటపం, చిత్రకూట మంటపం, కుంభహారతి మంటపం, లక్ష్మీదేవి మంటపాలు, కల్యాణమంటపం, యాగశాల, అద్దాలమహల్ నిర్మించబడ్డాయి.
క్రీస్తుశకం 1129-30 మధ్యకాలంలో రామానుజాచార్యులు శ్రీ గోవిందరాజస్వామి ఆలయాన్ని తిరుపతిలో నిర్మించి, స్వామివారిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. విశాలమైన ఈ గోవిందరాజస్వామి ఆలయంలో అనేక గుళ్ళున్నాయి.
శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవాలు
గోవిందరాజస్వామివారికి అనేక ఉత్సవాలను ప్రాచీనకాలం నుండి నేటికీ నిర్వహిస్తున్నారు. అందులో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు జరుగుతాయి.
నిత్యోత్సవాలు
ఈ ఉత్సవాల్లో సుప్రభాతం, తోమాలసేవ, సహస్రనామార్చన, అర్చనఫలం, శుద్ధి - మొదటిగంట; బలి, శాత్తుమొర, శుద్ధి, నివేదన – రెండోగంట; శుద్ధి - తోమాలసేవ శాత్తుమొర – నైవేద్యం, ఏకాంతసేవ వంటి వాటిని పేర్కొనవచ్చును.
వారోత్సవాలు - పక్షోత్సవాలు - మాసొత్సవాలు
ఈ ఉత్సవాలలోని వారోత్సవాల్లో శుక్రవారోత్సవం ప్రధానమైంది. పక్షోత్సవాల్లో ఏకాదశి ప్రధానమైంది. మాసోత్సవాల్లో ఉత్తరా నక్షత్రం, రోహిణీ నక్షత్రం, శ్రవణానక్షత్రం, పూలంగి సేవలు ప్రధానమైనవి.
వార్షికోత్సవాలు
ఈ ఉత్సవాలల్లో రథసప్తమి, గోకులాష్టమి, విజయదశమి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ద్వాదశి, కైశిక ద్వాదశి, బుగ్గోత్సవం, పొన్నకాల్వ ఉత్సవం, స్వామి అహోబల మఠానికి వేంచేసే ఉత్సవం, శ్రావణ ఉపాకర్మ, స్వామి తిరువడి సన్నిధికి వేంచేసే ఉత్సవం, స్వామి రామచంద్ర తీర్థ కట్టమీదికి వేమ్చేసే ఉత్సవం, ఆండాళ్ నీరాట్టోత్సవం, ఉగాది ఆస్థానం, దీపావళి ఆస్థానం, కార్తీక దీపోత్సవం, ధనుర్మాసోత్సవం, భోగి పండుగ, భోగి తేరు, మకర సంక్రాంతి, కనుమ, ద్వాదశ ఆరాధన, వడాయత్తు ఉత్సవం, వసంతోత్సవం, కళింగోత్సవం, ఆణివార తిరునక్షత్రం, పెరియాళ్వార్, తిరుమంగై ఆళ్వారు, మధురకవి ఆళ్వారు, వేదాంత దేశికులు, ఇతర ఆళ్వారుల తిరు నక్షత్రం ఉత్సవాలు ప్రధానమైనవి.
బ్రహ్మోత్సవాలు
తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో అత్యంత వైభవంగా జరుగుతాయి.
శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవం
తిరుపతిలో జరిగే ఉత్సవాల్లో గోవిందరాజస్వామి తెప్పోత్సవం ప్రసిద్ధి చెందింది. గోవిందరాజస్వామివారి తెప్పోత్సవ తిరునాళ్ళు ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమై పౌర్ణమి నాటికి ముగుస్తాయి. ఆలయానికి తూర్పువైపు నున్న గోవింద పుష్కరిణిలో తెప్పోత్సవాలు ఐదు రోజులపాటు ఎంతో వైభవంగా జరుగుతాయి. స్వామివారి తెప్పను, కోనేటి మంటపాన్ని, కోనేరును రంగురంగుల విద్యుద్దీపాలటో అలంకరించి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు.
Govindaraja swamy Temple, tirupati brahmotsavalu, govindaraja swamy brahmotsavalu, ramanujacharyulu built govindaraja swamy temple, many temples in govindaraja swamy temple premisis, govindaraja swamy brother of Tirumala Venkateswara swamy