గర్భరక్షాంబికా అమ్మ వారు మరియు వంశ వృద్ధికర శ్రీ దుర్గా కవచం
గర్భరక్షాంబికా అమ్మ వారు మరియు వంశ
వృద్ధికర
శ్రీ దుర్గా కవచం
ఓం శ్రీ మాత్రే నమః
భగవంతుడు అన్ని చోట్లా సర్వ వ్యాపియై ఉన్నా కూడా, కొన్ని స్థలములలో, కొన్ని రూపములలో విశేషించి ఆయన అనుగ్రహము ప్రసరిమ్పబడుతుంది. వీటినే పుణ్య క్షేత్రములు అంటాము. ఇటువంటి ఎన్నో దివ్యమైన పుణ్య క్షేత్రములు గల భూమి మన భారత దేశం. ఈ పుణ్య క్షేత్రాలలో, ఒక్కో స్థలం ఒక్కో కారణానికి బాగా ప్రసిద్ధం అయ్యాయి. ఇటువంటి వాటిలో గర్భారక్షాంబికా ఆలయం అనే పుణ్య క్షేత్రం ఒకటి. ఇక్కడ అమ్మ వారు స్త్రీల యొక్క సంతాన సబంధమైన సమస్యలను నివారించి, చక్కని సంతాన ప్రాప్తి కటాక్షించేందుకు వెలిసిన తల్లి. శ్రీ గర్భరక్షాంబికా సమేత శ్రీ ముల్లైవనాథర్ ఆలయం తమిళనాడులో ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం. ఈ ఆలయంలో ప్రధాన దేవత శ్రీ గర్భరక్షాంబికా అమ్మవారు మరియు శ్రీ ముల్లైవనాథర్. ఈ క్షేత్రం యొక్క పేరులోనే క్షేత్ర మహిమ అవగతమవుతుంది. గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మల గన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే ఇక్కడ గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. ఇక్కడ అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా, సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది. ఇదే క్షేత్రంలో అమ్మ వారితో పాటుగా కొలువై ఉండి భక్తులను అనుగ్రహించే శంకరుడు శ్రీ ముల్లైవనాథర్ గా కొలువబడుతున్నాడు. అంటే మన తెలుగులో చెప్పాలంటే ముల్లైవ నాథర్ అంటే మల్లికార్జున స్వామి వారు. ఇక్కడ స్వామి ని సేవిస్తే ఎటువంటి చర్మ వ్యాధులైనా నయం అయిపోతాయి. ఈ గర్భారక్షాంబికా ఆలయం తమిళనాడు లో తంజావూర్ జిల్లాలో, పాపనాశం తాలూకా లో తంజావూర్ –కుంభకోణం వెళ్ళే దారిలో కుంభకోణం అనే ప్రసిద్ధ పట్టణమునకు ముందు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రము గల ఊరిని అక్కడ “తిరుక్కరుగావుర్” (Thirukkarugavur) గా పిలుస్తారు.
గర్భ రక్షాంబికా అమ్మ వారు
ఇక్కడ అమ్మవారు సుమారు ఏడు అడుగుల ఎత్తులో ఉండి చక్కని కంచి పట్టు చీర ధరించి, సర్వాలంకార భూషితయై మెరిసి పోతూ ఉంటుంది. అమ్మ చిరునవ్వులు చిందిస్తూ “రా నాన్నా, నీకెందుకు బెంగ, నేను ఉన్నాను కదా నీకు” అని అభయం ఇచ్చినట్లుగా ఉంటుంది అమ్మ వారి యొక్క స్వరూపం. ఇక్కడికి వచ్చే భక్తులకు అమ్మ వారు ఒక విగ్రహం కాదు, అంతటా నిండి నిబిడీకృతమై ఉన్న అమ్మ సంతానము కటాక్షించడానికి సాకార రూపం దాల్చి ఉన్న శ్రీమాత ఈ అమ్మ. ఎంతో మంది భక్తులు సత్సంతాన ప్రాప్తికై అమ్మని నమ్మి వస్తారు. ఎవరైనా తెలిసి కాని తెలియక కాని ఈ క్షేత్రములో అమ్మని దర్శించినచో, వారికి కూడా తప్పక అమ్మ అనుగ్రహం కలుగుతుంది.
శ్రీ ముల్లైవనాథర్
ఇక్కడ ముల్లైవనాథర్ గా ఉన్న పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసిన స్వామి. శంకరుడు స్వయంభూగా వెలిసిన అరవైనాలుగు క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ శివ లింగము పుట్ట మన్నుతో చేసినది, అందుచేతనే ఇక్కడ స్వామికి జలముతో అభిషేకం చేయరు, కేవలం మల్లె నూనెతో అభిషేకంచేస్తారు. ఈ క్షేత్రమును మాధవీ క్షేత్రం అని కూడా అంటారు. మాధవీ అంటే సంస్కృతములో మల్లెలు. ఈ స్థల వృక్షం కూడా మల్లె తీగయే. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే, ప్రతీ ఏటా తమిళ ఫాల్గుణ మాసంలో పౌర్ణమినాడు చంద్ర కిరణాలు శివలింగము మీద పడతాయి. అది ఒక అద్భుత దృశ్యము. ఇక్కడ కర్పగ వినాయాకర్ మరియు నందీశ్వరుడు కూడా స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయంలోనే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి సన్నిథి కూడా కలదు.
స్థల పురాణము:
ఈ ఆలయం కనీసం వేయి సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. ఇక్కడ ఉన్న ఎత్తైన గోపురము, ప్రహరీలు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ తొమ్మిదవ శతాబ్దములో చోళ రాజుల హయాములో చెక్కిన శిలా ఫలకాలు ఉన్నాయి. ఈ క్షేత్రం యొక్క మహిమను అప్పార్, సుందరార్ మరియు జ్ఞానసంబంధార్ అనే ముగ్గురూ ప్రఖ్యాత నాయనార్లు వారి పద్యములలో కీర్తించారు. వీటిని తమిళంలో పత్తిగం అంటారు. ఈ ఆలయ సందర్శనార్ధం వస్తున్న ఈ ముగ్గురు నాయనార్లకి దారి కనపడకపోతే, సాక్షాత్తు పరమశివుడే వీరికి ఈ ఆలయ దర్శనం చేయించారు.
పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో నివశించేవారు. వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే సమస్య సంతానము కలుగక పోవడం. సంతానము కొరకై ఈ దంపతులు అమ్మవారిని, శంకరుడిని విశేష ఆరాధన చేశారు. ఒక మంచిరోజు ఆ తల్లి గర్భం దాల్చింది. ఇలా గర్భందాల్చిన తర్వాత, ఒక రోజు నిధ్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు. అప్పుడు వేదిక మూడవ త్రైమాసికంలో ఉన్నది, కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉంది. నిధ్రువ మహర్షి బయటకి వెళ్ళిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమమునకు వచ్చారు. అప్పటికే ఇంటిపనులలో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటోంది, దాంతో వచ్చిన మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు, ఆయన వచ్చారని తెలియదు. ఆగ్రహం చెందిన ఊర్ధ్వపాదుడు, ఆమె గర్భం ధరించి ఉంది అని తెలియక ఆమెను శపిస్తారు. ఆయన శాప ఫలితంగా వేదిక ఒక వింత వ్యాధితో బాధపడడం మొదలు అవుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా, గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయబడడం మొదలు అయ్యింది. వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపమైన ఆ పార్వతీమాతను ప్రార్ధిస్తుంది. అవ్యాజకరుణామూర్తి అయిన అమ్మ వారు వెంటనే ప్రత్యక్షం అయ్యి ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధంగా రక్షింపబడిన శిశువు ఆ కుండలో పెరిగి చక్కని మగపిల్లవాడు పుడతాడు. వాడికి నైధ్రువన్ అని పేరు పెడతారు. అప్పుడే పుటిన ఈ శిశువుకి కామధేనువు తన పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిధ్రువమహర్షి విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి శివపార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని ఆశ్రయించే వాళ్లకి గర్భరక్ష కలుగజేయమని ప్రార్ధిస్తారు.
మహర్షి చేసిన ప్రార్ధనకి సంతసించిన అమ్మవారు మరియు ఈశ్వరుడు ఈ క్షేత్రములోనే గర్భారక్షాంబిక, ముల్లైవనాథర్ గా కొలువున్నారు. ఇప్పటికీ, అమ్మ అనుగ్రహముతో ఈ క్షేత్రమును దర్శించిన గర్భిణీస్త్రీలకు ఎంతో చక్కగా ప్రసవం అయ్యి, మంచి పిల్లలు పుడతారు. ఇక్కడ అమ్మను సేవిస్తే ఇంకా పిల్లలు లేని వారికి గర్భందాల్చడం జరుగుతుంది. గర్భందాల్చిన వాళ్లకి చక్కని ప్రసవం అవుతుంది. పెళ్లికాని ఆడ పిల్లలు ఇక్కడ అమ్మని ప్రార్ధిస్తే వెంటనే మంచివ్యక్తితో వివాహం అయి సత్సంతానప్రాప్తి కలుగుతుంది. ఈ క్షేత్రం ఉన్న ఊరిలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఎవరికీ గర్భస్రావం కావడం, పిల్లలు కలుగకపోవడం అనే సమస్య లేదు. ఇక్కడ స్థానికులు ఈనాటికీ అమ్మవారి అనుగ్రహం ఈ క్షేత్రంలో ఉంది, అందువల్లనే మేము రక్షింపబడుతున్నాము అని విశ్వసిస్తారు. మన దేశము నుండి వేరే దేశముల నుండి ఎక్కడెక్కడి నుంచో దంపతులు వచ్చి ఇక్కడ అమ్మ ఆశీస్సులు పొంది వెడతారు.
పూజా విధానము:
· పిల్లలు లేని వారికి శివపార్వతుల దగ్గర ఉంచి మంత్రించిన నెయ్యి ఇస్తారు, ఆ నెయ్యిని దంపతులు ఇద్దరూ నలభై ఎనిమిది (48) రోజులు నిద్రించబోయే ముందు సేవిస్తే తప్పకుండా త్వరలోనే గర్భం దాల్చడం జరుగుతుంది.
· గర్భిణీ స్త్రీలు అయితే వారికి శివపార్వతుల దగ్గర ఉంచి మంత్రించిన తైలము (ఆముదం) ఇస్తారు. ఈ తైలమును గర్భిణిగా ఉన్న తల్లికి నొప్పులు ప్రారంభం అవ్వగానే ఉదరభాగములో రాయడం వల్ల, ఎటువంటి సమస్య లేకుండా తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండేలా ప్రసవం అవుతుంది. (గర్భిణిగా ఉన్న స్త్రీలు ఆ సమయంలో ఈ క్షేత్రం వెళ్ళలేకపోయినా, వారి యొక్క భర్తకాని, ఎవరైనా బంధువుకాని ఈ క్షేత్రం దర్శించి, ఆమె పేరు మీద సంకల్పము చేయించి ఈ తైలము తెచ్చుకోవచ్చు.)
· అంతే కాక సంతానము కావలసిన స్త్రీల యొక్క జన్మ నక్షత్రం రోజున ప్రతీ నెలా ప్రత్యేక అర్చన కూడా చేయించుకోవచ్చు. దీని కోసం సంవత్సరానికి ఐదు వందల రూపాయలు తీసుకుంటారు ఆలయయాజమాన్యం వాళ్ళు. ప్రతీ నెలా ఇంటికి అమ్మవారి కుంకుమ మరియు స్వామి విభూతి ప్రసాదంగా పంపిస్తారు.
అయితే ఇలా అమ్మ అనుగ్రహముతో ప్రసవం అయిన తర్వాత వీలుచూసుకుని ఆ దంపతులు పుట్టిన పిల్లవాడిని తీసుకు వెళ్లి అమ్మవారి ఎదురుగా ఒక వెండి ఊయల ఉంటుంది, అందులో పిల్లాడిని పడుకోబెట్టి అమ్మ యొక్క దర్శనం చేయించాలి. అలా చేస్తే ఆ పిల్లలు కూడా, అమ్మ వారి అనుగ్రహం ప్రసరించి, దీర్ఘాయుష్మంతులై, ప్రయోజకులవుతారు.