Read more!

దేవుడి ముందు మొర పెట్టుకుంటున్నారా.. అయితే ఇది చదవండి!

 

దేవుడి ముందు మొర పెట్టుకుంటున్నారా.. అయితే ఇది చదవండి!

ప్రతి ఒక్కరూ దేవుడి గుడికి వెళ్లడం దగ్గర నుండి పెద్దవాళ్లకు కాళ్ళు నమస్కరించడం వరకు ఆ సందర్భాలలో చేసే పని ఒకటే.. నాకు ఇది కావాలి, అది కావాలి.. అవి ప్రసాదించు అని. కానీ అడిగితే అడుగున పడిపోతామని.. అడగకుండా ఉంటే భగవంతుడే అన్నీ సమయానికి ఇస్తాడని ఆధ్యాత్మికత చెబుతోంది. 

అడుగకే ఓ మనసా అడుగుకొలది అడుగునపడునని అడుగని శబరిని ఆదరించలేదా. అడుగక తనకై మడసిన జటాయువు కడకేగి సద్గతి కలిగించలేదా? శబరి రాముణ్ణి ఏమీ అడుగలేదు. జటాయువు సీతను రక్షించడానికి రావణుణ్ణి ఎదిరించి అతని చేతిలో ప్రాణం పోగొట్టుకుంది. రాముని వలన సద్గతి పొందింది. వారు ధన్యులు, త్యాగమూర్తులు. అడిగితే ఇచ్చేవాడు ప్రభువు, అడుగకుండానే ఇచ్చేవాడు విభుడు. మహాభక్తులు త్యాగయ్య, అన్నమయ్య, పోతన, తుకారాం, సక్కుబాయి, మీరాబాయి- వీరంతా దైవాన్ని ఏమి అడిగారు? భోగభాగ్యాలు అడుగలేదు. కేవలం భగవంతునియందు భక్తిని ప్రసాదించమని అడిగారు. ఫలితంగా దైవ సాయుజ్యం పొందారు.

దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్న కుచేలుడు భార్య సలహాపై తన దారిద్య్ర నివారణకు కాసిని అటుకులు మూట కట్టి తీసుకొని తన చిన్ననాటి స్నేహితుడైన కృష్ణుని వద్దకు వెళ్ళాడు. తీరా వెళ్ళిన తరువాత తాను వచ్చిన పని మరచి అటుకులు కృష్ణునికి సమర్పించి వట్టి చేతులతో తిరిగి వచ్చాడు. కుచేలుడు తన దారిద్ర్యాన్ని పోగొట్టమని కృష్ణుణ్ణి అడుగలేదు. కానీ కుచేలుని పరిస్థితి తెలిసిన శ్రీకృష్ణుడు కుచేలునికి అష్టశ్వర్యాలు ప్రసాదించాడు. భగవంతుడే భక్తుని అవసరాల్ని తీరుస్తాడనడానికి ఇదో నిదర్శనం. 

ఇంకా అందరికీ తెలిసేలా.. అందరికీ అర్థమవడానికి మరొక్క విషయం కూడా ఉంది… నరేంద్రుడు (స్వామి వివేకానంద) ఉద్యోగం కోసం అమ్మను (కాళికాదేవిని) ప్రార్థించమని రామకృష్ణ పరమహంసను అర్థించాడు. అప్పుడు నరేంద్రునితో 'ఇక్కడ సిఫారసులు చెల్లవు కావాలంటే స్వయంగా నువ్వే మందిరానికి వెళ్ళి ఉద్యోగం కోసం అమ్మను ప్రార్థించు' అని పరమహంస అన్నారు.

నరేంద్రుడు కాళీమాత మందిరానికి వెళ్లి అక్కడ  తనకు ఉద్యోగం కావాలని అడగడం మరచి భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించమని ప్రార్థించాడు. అప్పుడు రామకృష్ణులు నరేంద్రుణ్ణి 'అమ్మ నీ కుటుంబ భారం తీసుకుంటుంది. చింతించవద్దు' అని ఆశీర్వదించారు.

పాండవులు ఎన్ని కష్టాలు అనుభవించినా వాటిని నివారించమని శ్రీకృష్ణుణ్ణి వేడలేదు. అడుగకపోయినా కృష్ణుని అనుగ్రహం వల్ల కౌరవులపై విజయం సాధించారు. భగవంతుణ్ణి ఏమీ అడుగకపోయినా భక్తులకు ఏమి కావాలో అది ప్రసాదిస్తాడు. అడిగేకొద్దీ అడుగునపడిపోతాం. అడగకుండానే దైవ సహాయం పొందుతాం. కాబట్టి అడగడం మానేద్దాం. అప్పుడు ఆ భగవంతుడే తన భక్తుడికి కావాల్సింది ఏమిటో అది తప్పకుండా ఇస్తాడు. దానికోసం ఆరాటపడటం, పాకులాడటం అనవసరం. ఏది ఇవ్వాలో.. ఏది అవసరమో.. అది తప్పకుండా భగవంతుడే ఇస్తాడు. 


                                                ◆నిశ్శబ్ద.