గణేశుని జననం

 

గణపతి వికాసాన్ని ప్రధానంగా మూడు దశలలో గమనించవచ్చు. ఋగ్వేద కాలంలో వినవచ్చే ‘గణపతి’ అన్న పేరు ‘బ్రాహ్మణస్పతి’ అన్న పేరు ఒక్కటిగానే వుంది. రెండవది ఐతిహాసిక, స్మృతుల కాలంనాటి విఘ్నకారియైన ‘వినాయకుడు’ క్రూరదేవత, మూడవదీ, చివరదీ అయిన గౌరీపుత్రుడూ, గజముఖుడూ, అయిన గణపతి. ఋగ్వేదంలో గణపతి పేరున్న మంత్రాలు ఒకటి రెండు వున్నాయి. వాటిలో ఎక్కువ వ్యాప్తిలో వున్న గణపతి పూజాకాలంలో చెప్పే మంత్రం... “గణనాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపవశ్ర వస్తమం!

జ్యేష్ఠరాజం బ్రహ్మాణం బ్రహ్మణస్పత ఆనఃశృన్వన్నూతిభి: సీద సాధనం” ఈ మంత్రానికి సాయణుల వ్యాఖ్యా : ‘ఓ బ్రహ్మణస్పతీ, ప్రవృద్దమగు కర్మలకు ప్రభువైనట్టి వాడవూ, దేవగణములకు చెందిన వాడవూ, స్వగణములకు నాయకుడవూ, ప్రముఖుల మధ్య ప్రకాశించువాడవూ, మంత్రాధిదేవతవూ అయిన నిన్ను యీ కర్మ నిమిత్తముగా ఆహ్వానిస్తున్నాను. మా నుతులను వింటూ నీ రక్షణలతో యజ్ఞగృహమునకు వచ్చి కూర్చుండుము’ యాస్కుడు ఈ మంత్రములోని బ్రాహ్మణస్పతి అను పదానికి అన్నము, ధనములకు అధిపతీ అని నిర్వచించినాడు. ఋగ్వేదంలో గణపతి గణ పదములు గల మరొక మంత్రం: “నిషుసీద గణపతే గణేషుత్వా మహు ర్విప్రతమం కవీనాం నఋతే త్వత్ క్రియతే కించనారే మహామర్కం మఘవం జ్చిత్రమర్చ” మరుద్గణాలకు ప్రభువైన ఓ ఇంద్రా!

నీ స్తుతికర్తల మధ్య శ్రేష్ఠమగు విధంగా ఆసీనుడవు కమ్ము. మేధావులైన ప్రాజ్ఞులలో నీవు అధిక ప్రజ్ఞావంతుడవని విజ్ఞులు అంటున్నారు. నిన్ను వదలి సమీపములోగాని, దూరమునగాని ఎట్టి కర్మయూ నెరవేరదు. ధనవంతుడవైన ఓ ఇంద్రా! మహత్స్వరూపము గల పూజనీయమైన మాస్తోమమును, నానా రూపముల గౌరవించుము – అన్నది పైన పేర్కొన్న మంత్రంపై సాయణుల భాష్యానికి భావార్థం. ఈ రెండు మంత్రాలేకాక ‘గణేన’ అను పదం మాత్రమే గల మంత్రమొకటి వున్నది. ఇచటి ‘గణ’ దాన్ని అంగీరసగణా! అనగా సంగీతజ్ఞులు అని నిర్వచించినారు. ఇదివరకే పేర్కొన్న మంత్రంలోని ‘గణేషు’ అను శబ్దములోగల ‘గణ’ పదానికి ‘స్తుతికర్తలు’ అని అర్థం.

ప్రవర్గ్య అను యాగంలో వినియోగమైన ‘గణానాం త్వా’ మంత్రానికి, ఋగ్వేదమందలి ‘గణపతి’ అను పదానికి మనం యీనాడు పూజిస్తున్న గజముఖ గణపతికి ఎట్టి సంబంధమూ లేదు – దీనిని బట్టి ఋగ్వేద కాలంలో ‘గణపతి’ అను దేవత లేదని – గణపతిని గురించి ఆమూలాగ్రంగా పరిశోధన సాగించిన – ప్రాచ్య పాశ్చాత్య విద్వాంసుల అభిప్రాయం. ఈ మంత్ర వినియోగాన్ని గురించి ఋగ్వేద కన్నడానువాదకుల వివరణమునకై పై విద్వాంసులు అభిప్రాయసంగ్రహం ఈ రీతిగా వుంది. ఈ ఋక్కులో గణపతి పదము చెప్పినందున, పురాణాలలో పేర్కొన్న ఈశ్వరపుత్రుడైన గణపతిని పూజించునపుడు యీ మంత్రమును పఠించుట వాడుకయైనది.... గణపతిని స్తుతించు నప్పుడల్లా యీ మంత్రాన్ని, గణపతే పదముగల ‘నిషుసీద గణపతే గణేషు’ అను ఋక్కును మననం చేస్తారు.