Read more!

విజయాలను చేకూర్చే విజయదశమి (Dussehra Festival Celebrations)

 

విజయాలను చేకూర్చే విజయదశమి

(Dasara Celebrations)

 

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రులను జరుపుకుంటాం. పదవ రోజు.. అంటే ఆశ్వయుజ దశమిరోజు విజయదశమి పర్వదినం. ఇది శరదృతువు గనుక ఈ పండుగ దినాలను శరన్నవరాత్రులు అంటారు. దుర్గాదేవి ఆలయాల్లో అమ్మవారిని మొదటిరోజు శైలపుత్రి, రెండోరోజు బ్రహ్మచారిణి, మూడో రోజు చంద్రఘంటాదేవి, నాలుగో రోజు కూష్మాండాదేవి, ఐదోరోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయని, ఏడోరోజు కాళీమాత, ఎనిమిదోరోజు మహాగౌరి, తొమ్మిదో రోజు సిద్ధిదాత్రీదేవి - రూపాల్లో ఆరాధిరిస్తారు. దేవి రూపానికి తగినట్లు ఆవేళ ఆ నైవేద్యం సమర్పిస్తారు.

 

మహిషాసురుడు దేవేంద్రుని ఓడించి, దేవలోకానికి అధిపతి అయ్యాడు. ఆ రాక్షసుడు పెట్టే హింస భరించలేక దేవతలు త్రిమూర్తులతో మొర పెట్టుకున్నారు. దాంతో మహిషాసురుని మట్టు పెట్టేందుకు త్రిమూర్తులు ఒక దివ్యశక్తిని సృష్టించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నుండి వెడలిన మహోజ్జ్వల శక్తి ఒక మహా శక్తిగా అవతరించింది. ఆ దివ్య మంగళ రూపానికి మహాశివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, బ్రహ్మ అక్షమాలను, కమండలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని, హిమవంతుడు సింహవాహనాన్ని ఇచ్చారు. ఇక ఆ మహాశక్తి దేవతలను పీడిస్తున్న మహిషాసురునితో తొమ్మిది రోజులపాటు యుద్ధం చేసి, చివరికి సంహరించింది. మహిషాసురుని వధించింది కనుకనే, మహిషాసురమర్దిని అయింది. మహిషాసురుని పీడ విరగడవడంతో ప్రజలు సంతోషంగా ఉత్సవం జరుపుకున్నారు. అదే విజయదశమి పర్వదినం.

 

వినాయక చవితి పండుగ మాదిరిగానే విజయదశమిని పిల్లలు, పెద్దలూ అందరూ ఇష్టంగా జరుపుకుంటారు. పిల్లలు తమ పుస్తకాలను, పెద్దలు తమ వృత్తికి సంబంధించిన వస్తువులను పూజలో ఉంచి దుర్గాదేవికి నమస్కరించుకుంటారు. విజయదశమి నాడు రైతులు కొడవలి, గునపము వంటి వ్యవసాయ సామగ్రికి పసుపుకుంకుమలు రాసి పూజలో ఉంచుతారు. ఏడాది పొడుగునా ఏ విధమైన ఇబ్బందులూ రాకూడదని కోరుకుంటూ పూజ చేసుకుంటారు. కొందరు వ్యాపారులు దీపావళినాడు కొత్త లెక్కలు ప్రారంభిస్తే, మరికొందరు దసరా రోజున కొత్త లెక్కలు ఆరంభిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దసరా రోజున ఆరంభిస్తారు. దసరాను పురస్కరించుకుని అనేక సినిమాలు విడుదలౌతాయి.

 

విజయదశమి ఒకరోజు పండుగ కాదు. పదిరోజుల వేడుక. ఈ పదిరోజులూ అమ్మవారి ఆలయాలు ప్రత్యేక ఉత్సవాలతో కళకళలాడుతుంటాయి. స్థూలంగా చెప్పుకుంటే ఈ పండుగ మొదటి మూడురోజులు పార్వతీదేవికి, తర్వాతి మూడురోజులు లక్ష్మీదేవికి, చివరి మూడురోజులు సరస్వతీదేవికి కేటాయించారు.

 

మరోరకంగా చెప్పుకుంటే తొలిరోజు కనకదుర్గాదేవి రెండోరోజు బాలా త్రిపుర సుందరి, మూడోరోజు గాయత్రీదేవి, నాలుగోరోజు అన్నపూర్ణాదేవి, ఐదోరోజు లలిత త్రిపుర సుందరీదేవి, ఆరోరోజు సరస్వతీ దేవి, ఏడో రోజు మహా లక్ష్మీదేవి, ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదో రోజు మహిషాసురమర్దిని, పదవ రోజు రాజరాజేశ్వరీదేవి రూపాలతో అమ్మవారిని అలంకరిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారికి వరుసగా కేసరి, పొంగలి, అల్లం గారెలు, దద్దోజనం, అప్పాలు - పులిహోర, పెసరపప్పు పాయసం, వడపప్పు - చలిమిడి, చక్రపొంగలి, కేసరి పూర్ణాలు, లడ్డూలు నైవేద్యంగా సమర్పిస్తారు.

 

విజయదశమికి జమ్మిచెట్టుకు అవినాభావ సంబంధం ఉంది. పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అంటే విజయదశమి రోజున అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజ చేశాడు. ఆనక ఉత్తర గోగ్రహణ యుద్ధంలో విజయాన్ని వరించి విజయుడయ్యాడు. ఆవిధంగా జమ్మిచెట్టు ఆయుధాలకు రక్షణ కల్పించింది. విజయాన్ని అందించింది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టును భక్తిగా పూజిస్తారు. జమ్మి ఆకును బంగారంగా భావించి, పెద్దల చేతిలో ఆకును ఉంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు. విజయదశమి రోజున జమ్మిచెట్టు వద్దకు వెళ్ళి పార్వేట జరుపుకుంటారు.

 

తెలంగాణా ప్రాంతీయులు శరన్నవరాత్రుల్లో బతుకమ్మ ఆడి, విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. విజయదశమి సందర్భంగా ఇళ్ళలో బొమ్మలకొలువు ఏర్పాటు చేస్తారు. పిల్లలు, పెద్దలు సంబరాల్లో మునిగి తేలతారు.

 

హిందువులంతా ఇష్టంగా జరుపుకునే పెద్ద పండుగ విజయదశమి. అన్ని దేవాలయాల్లో దసరా పదిరోజుల ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ముఖ్యంగా అమ్మవారి ఆలయాల్లో మరింత ప్రత్యేకంగా కనులపండుగ్గా జరుపుతారు. విజయవాడ, కోల్కతా, మైసూరు, ఉజ్జయిని ప్రాంతాల్లో దసరా సంబరాలకు లక్షలాదిమంది భక్తులు హాజరవుతారు. కిక్కిరిసిన భక్తులతో ఆయా ప్రాంతాలు కోలాహలంగా ఉంటాయి.

 

విజయదశమి అంటే విజయాలను సమకూర్చే పండుగ. దుర్గాదేవి చల్లని చూపు మనమీద ఉంటే అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, సంతోషం సొంతమౌతుంది.

Festival Dussehra, Dussehra Celebrations, Festival of dussehra, Dussehra Festival, Dasara Celebrations, vijaya Dasami puja, vijaya Dasami pooja vidhanam, vijaya Dasami navaratri

Durgashtami

Mahanavami

Batukamma Aata

Batukamma Songs

Sakthi Peethas

Dussehra Greetings