వినాయక చవితికి పొరపాటున కూడా ఇలాంటి విగ్రహాలు తీసుకురాకండి..!

 

వినాయక చవితికి పొరపాటున కూడా ఇలాంటి విగ్రహాలు తీసుకురాకండి..!

భాద్రపద మాసం వచ్చిందంటే వినాయక చవితి హడావిడి చాలా ఉంటుంది. తొలి పూజ అందుకునే వినాయకుడు  వినాయక చవితికి ఎనలేని శోభతో అందరినీ అలరిస్తాడు. ప్రతి ఇంటా,  ప్రతి వీధిలో, ప్రతి ఊర్లో వినాయక విగ్రహ ప్రతిష్టలు,  పూజలు, వ్రతాలు చాలా ఘనంగా చేస్తారు.  అయితే వినాయక పూజకు తీసుకొచ్చే విగ్రహాల విషయంలో ఈ మధ్యకాలంలో వెర్రెత్తిపోతున్నారు ప్రజలు.  పోటీ పడి  ఎత్తైన విగ్రహాలు పెట్టడం ఒక అంశం అయితే.. విగ్రహ స్వరూపం, దాని వల్ల కలిగే శక్తి ప్రభావం గురించి ఏమీ ఆలోచించకుండా వింత వింత విగ్రహాలు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇంట్లో వినాయక చవితి పూజ చేసుకునేందుకు ఎలాంటి విగ్రహం తీసుకురాకూడదు అనే విషయం తెలుసుకుంటే..

విగ్రహం ఎలా ఉండాలి?

వినాయక విగ్రహం అందంగా, అలంకారంగా ఉంటే సరిపోదు.. చాలా మంది చూడగానే కాస్త విభిన్నంగా, ఆకర్షణగా ఉంటే చాలు.. వినాయక విగ్రహాలు కొనుగోలు చేస్తుంటారు.  కానీ  విగ్రహాన్ని ఎంచుకునే విషయంలో కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి.

వినాయకుడు కూర్చున్న భంగిమలో ఉండాలి. అలాగే వినాయకుడి  తొండం ఎడమ వైపుకు వంగి ఉండాలి. ఇలా ఉన్న విగ్రహాన్ని అత్యంత పవిత్రమైన విగ్రహంగా పరిగణిస్తారు. ఇలాంటి  విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పూజ చేస్తే  ఆనందం, శ్రేయస్సు, శాంతి,  స్థిరత్వం అన్నీ సమకూరుతాయి.

దిశ..

గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో ప్రతిష్టించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఒక వేళ ఆ దిశలో కుదరకపోతే..  ఉత్తర దిశలోనూ,  అది కూడా కుదరక పోతే తూర్పు దిశలో కూడా ప్రతిష్టించవచ్చు.


రంగు..

 ఇంట్లో పూజకు ఉంచే వినాయక విగ్రహం  రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంది.  ఎరుపు లేదా సింధూరం  రంగు విగ్రహాన్ని శక్తికి,  ఉత్సాహానికి చిహ్నంగా భావిస్తారు.  తెలుపు రంగు విగ్రహం ఇంట్లో శాంతి,  శ్రేయస్సును కాపాడుతుంది.


                          *రూపశ్రీ.