రాముడు పితృవాక్య పరిపాలకుడు మాత్రమే కాదు!
రాముడు పితృవాక్య పరిపాలకుడు మాత్రమే కాదు!
రాముడు వనవసానికి వెళ్లేముందు తండ్రి దశరథ మహారాజు ఆశీర్వాదం కోసం సీతా లక్ష్మణులను తీసుకొని తండ్రి కొలువుకు చేరాడు.సుమంత్రుడి ద్వారా తాము ఆయనను చూడవచ్చినట్టు రాజుకు కబురు చేశారు.
దశరథుడు సీతా రామలక్ష్మణులను పిలుచుకురమ్మని సుమంత్రుడితో అన్నాడు. చేతులు జోడించి స్వర్ణ కంకణ, శోభిత కుండాలాలు ఏవీ లేకుండా వస్తున్న రాముడు కన బడగానే పుత్రవాత్సల్యంతో ఉబికొస్తున్న కన్నీళ్లని అదుముకోలేక లేచి రాముడి కెదురు పోబోయి మధ్యలోనే పడిపోయాడు. ఆయనను ఎత్తి పాన్పుపై పడుకోబెట్టాడు రాముడు.
స్పృహ వచ్చి దశరథుడు కళ్లు తెరవగానే రాముడు
``మహారాజా, నేను దండకారణ్యానికి పోతున్నాను. మీరు ప్రభువు గనక మీ అనుమతి కోసం వచ్చాను. నేనెంత చెప్పినా వినక సీతాలక్ష్మణులు నా వెంట బయలుదేరారు. వారి వనవాసానికి కూడా అనుమతి ఇవ్వండి,'' అన్నాడు.
ముందు రాత్రి ఏడ్చి ఏడ్చి కృంగి ఎర్ర జీరలెక్కి నిప్పుల్లా ఉన్న కళ్లు చూసి చూడలేక రెప్పలార్పుతూ దశరథుడు రాముడితో..
``నాయనా, రామా! కైకేయి వరము అనే పాశం తో నన్ను కట్టిపడేసింది. ఏ పితృ వాక్య పరిపాలనకి నిలబడి నీవు వనవసానికి వెల్తున్నావు. అదే తండ్రిగా నేను చెప్తున్నాను. నేను కరావాలంతో (కత్తి) తో నీపైకి లేస్తాను. నీవు అస్త్ర శస్త్ర విద్యా పరాక్రముడివి. నీముందు నేను పడిపోతాను. రాజ్యం వశం చేసుకో. నన్ను చెరసాలలో బంధించు. నేను ఆ చెరసాల ఊచలలోంచి నిన్ను చూస్తూ బ్రతికేస్తాను." అంటాడు.
అప్పుడు రాముడు తండ్రితో " మహారాజా ఆడిన మాటని తప్పి మీరు అసత్యదోషం కట్టుకోకండి. అడవికి పోవటానికి నాకేమీ అభ్యంతరం లేదు. సెలవు ఇవ్వండి" అని వినమ్రంగా తెలియజేస్తాడు.
ఇక్కడే మనం రాముడి గొప్పతనం పట్టుకోవాలి. ఏ తండ్రి అయితే వనవసానికి వెళ్లమని చెప్పారో. ఇప్పుడు అదే తండ్రి తనపై యుద్ధం చేసి రాజ్యాన్ని వసపరుచుకో అన్నప్పుడు ఇది కూడా పితృవాక్య పరిపాలనగా భావించి, ఆయన చెప్పినట్లు రాముడు చేయలేదు. కారణం ఏమంటే తండ్రి ఇచ్చిన మాటని అసత్యం కాకూడదు అని.
పితృవాక్య పరిపాలకుడు అని తండ్రి ఏది చెప్తే అది యధాతధంగా చేసావాడు రాముడు కాదు. ధర్మాధర్మాలను ఆలోచించి తండ్రిని సత్య ధర్మం యందు ఠీవీగా నిలబెట్టినవాడు రాముడు. అందుకే యుగయుగాలకు శ్రీ రాముడు అందరికీ ఆదర్శనీయడు అయ్యాడు. జై శ్రీరామ్!
- వెంకటేష్ పువ్వాడ