ధైర్యమే ఆయుధం ౼ గీతలో కృష్ణుడు

 

ధైర్యమే ఆయుధం ౼ గీతలో కృష్ణుడు

 

"వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ।

గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే ।
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః 

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ ।
న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే"  

అర్జునుడు భారతంలో నా శరీరమంతా వణుకుచున్నది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి.  నా విల్లు, గాండీవం, చేజారి పోతున్నది ఇంకా నా చర్మమంతా తపించిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణా, కేశి రాక్షసుడను సంహరించినవాడా (కేశవః), అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన, మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను.


యుద్ధం ఆరంభం వేల అర్జునుడు కౌరవ పరివారాన్ని అంతటినీ ఒకసారి చూసాడు. తండ్రులు, గురువులు,సోదరులు,తనయులు, బావలు, మామలు ఇంకా శ్రేయోభిలాషులు ఇందరిని వధించి గెలుచుకునే రాజ్యం యందు నేను సుఖంగా ఎలా ఉండగలను. నేను గెలుస్తానో లేదో నాకు తెలీదు. కాలం పరీక్షించి పితృసమానులైన భీస్మ, ద్రోణాచార్యులు కౌరవ పక్షం వహించారు. వారితో నేను ఎలా తలపడవలను అంటూ నిరాశ తో గాండీవం పై పట్టు వదులుతూ.. కుప్పకూలి పోతాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జునిడిలో పిరికితనం ఆవహించింది అని గ్రహించి గొప్ప ధైర్యవచనం చేస్తాడు.
రెండవ అధ్యాయం మూడవ శ్లోకం లో ఇలా అంటాడు.

"క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే ।
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప" ।

భావం : ఓ పార్థా, ఈ యొక్క పిరికి తనమునకు లొంగిపోవటం నీకు తగదు. ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము, ఓ శత్రువులను జయించేవాడా.

జ్ఞానోదయం కలిగి తేజోమయ సంకల్పంతో విజయవంతంగా ముందుకు వెళ్లడానికి గొప్ప స్ఫూర్తి, ఉత్సాహం అవసరం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అధైర్యాన్ని దరి చేరనివ్వకూడదు. ఆశావాహ దృక్పధంతో పూర్తి విశ్వాసం తో ఉండి అజ్ఞానం, మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క బలహీనతలను, ప్రతికూలతలను అధిగమించాలి. ధైర్యం నిన్ను నిప్పుల మీద కూడా నడిపించగలదు. అధైర్యం నిన్ను నీడతో కూడా బయపడేలా చేస్తుంది. ఆర్జునుడిని, ప్రిథ (కుంతీ దేవి యొక్క ఇంకొక పేరు) తనయుడివి అని పలుకుతాడు. దాని వలన అతనికి తన తల్లి కుంతీ దేవిని గుర్తు చేస్తాడు, శ్రీ కృష్ణుడు. ఆమె దేవతల ప్రభువు ఇంద్రుడిని పూజించటంచేత, అతని అనుగ్రహంతో అర్జునుడు పుట్టాడు. ఈ విధంగా, ఇంద్రుడి లాగే అతను కూడా అసామాన్యమైన శక్తి, పరాక్రమము కలిగి ఉన్నాడని తన ఉన్నతమైన పుట్టుకకి తగని దౌర్భల్యానికి వశపడవద్దని, అధైర్యాన్ని చెంతకు రానివ్వద్దని అర్జునుడికి, శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని గుర్తు చేసాడు.  ఇలా శ్రీకృష్ణుడు, అర్జునుడికి హితబోధ చేసి యుద్ధానికి సన్నద్ధుడిని చేస్తాడు.


గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలు యువతకు సాహసోపిత మార్గదర్శనం చేసేవి. పరిస్థితులతో గానీ, వ్యక్తులతోగానీ మనం పోరాడాల్సివస్తే ముందు మన హృదయంలో అంకురించే అధైర్యం అనే అంతర్గత శత్రువుని ఓడించి ధైర్యమే కవచంగా ముందుకు కదలాలి అని అర్ధమవుతుంది. ఇదే స్వామి వివేకానంద కూడా పలుమార్లు యువతకు ప్రవచించారు.

◆ వెంకటేష్ పువ్వాడ