సినిమాకో కథకావాలి !

 

చంచల్రావు ద్వారకా హోటల్ ముందు ఆటో దిగాడు ఆటో వాడికి డబ్బులిచ్చి జేబులోంచి ప్రొడ్యూసరు భేతాళరావు రాసిన ఉత్తరం తీసి ఓ మారు దానివంక చూశాడు. రూమ్ నెంబరు నూట పదకొండులో శుక్రవారం రోజు తనని కలవవలసిందిగా భేతాళరావు రచయిత చంచల్రావుకు ఉత్తరం రాశాడు.

చంచల్రావు జిప్ బ్యాగ్ ని చంకలో ఇరికించుకుని రూమ్ నెంబరు నూట పదకొండు ముందు ఆగాడు. తలుపు దగ్గరగా వేసి వుంటే మెల్లగా తోశాడు.

“ఎవడ్రా వాడు..” అంటూ భయంకరమైన కేక వినిపించడంతో కంగారుపడి వెనక్కి వచ్చేసి తలుపు దగ్గరకి మూసేసి డోరుమీద నెంబరు చూశాడు.

నూట పదకొండు అనే వుంది! కొంపదీసి నూట ఒకటికానీ కాదు కదా!” జేబులోంచి మళ్ళీ ప్రొడ్యూసరు భేతాళరావు రాసిన ఉత్తరం తీసి చూశాడు.

అందులో రూమ్ నెంబరు నూట పదకొండులోనే వుంటున్నట్టు ఉంది. అప్పుడు చంచల్రావుకి మరో గొప్ప సందేహం వచ్చింది. కారిడార్లో వెళ్తున్న సర్వర్ని ఆపి "ఇది అసలు ద్వారకా హోటలేనా?” అని అడిగాడు.

“ద్వారకా హోటలు అవునో కాదో తెలుసుకోకుండా లోపలికెందుకు వచ్చారు? ద్వారకానే!!...” అన్నాడు సర్వరు అదో మాదిరిగా చూస్తూ.

చంచల్రావు తలుపు మీద మెల్లగా ముని వేళ్ళతో శబ్దం చేసి "లోపలికి రావొచ్చాండీ?.....“ అన్నాడు.

“రావచ్చు......” అందించాక అరిచిన గొంతు గట్టిగా.

చంచల్రావు లోపలికి అడుగుపెట్టాడు. లోపల మంచం మీద నలభై అయిదేళ్ళ వ్యక్తి కూర్చుని వున్నాడు. గది మూల నిలబడి ఓ పడుచుపిల్ల చీర కుచ్చెళ్లు సర్దుకుంటుంది. “ఈ బుద్ధి ముందే వుండక్కర్లేదయ్యా...? ఆ..? అడక్కుండా లోపలికి తోసుకొచ్చేయడమే...!” అన్నాడు ఆ పెద్ద మనిషి. “ఇంతకీ ఎవరు కావాలి?”

“భేతాళరావు గారు కావాలండీ...... అన్నాడు చంచల్రావు పడుచుపిల్ల వంక చూస్తూ.

“నేనే భేతాళ రావుని!” ఆమేమో నా సెగట్రీ..... హిహిహి...” అన్నాడు భేతాళరావు సిగ్గుపడుతూ.

“నేను రచయిత చంచల్రావునండీ.... మీరు నన్ను కలవమంటూ ఉత్తరం రాశారు. కదా.... అందుకని వచ్చాను...” మెల్లగా చెప్పాడు చంచల్రావు.

“ఓ.... అయితే తమరే నన్నమాట ఆ రచయిత.. తమర్నెప్పుడు సూళ్ళేదులే... కూసోండి... కూసోండి....” అన్నాడు భేతాళరావు మంచానికి ఎదురుగా వున్నకుర్చీని చూపిస్తూ.

“థాంక్సండీ....” చంచల్రావు ఆ పడుచుపిల్ల వంక చూస్తూ కూర్చున్నాడు.

“ఏటలా సూత్తన్నావ్?.... సెగట్రీ అంటే నమ్మకం కుదర్డం లేదా? ఏ యగస్ట్రానో అనుకుంటున్నావా ఏందీ కొంపదీసి?.... నా సెగట్రీనే … పేరు లిల్లీ....” అన్నాడు భేతాళరావు పళ్ళికిలిస్తూ.

“అబ్బే.. నేను నమ్మకపోవడం ఏటండీ... నమ్ముతున్నాలెండీ..... మీ సెక్రట్రీయేగా....” అన్నాడు చంచల్రావు అనుమానంగా లిల్లీవంక చూస్తూ.

లిల్లీ చీర సర్దుకోవడం పూర్తయింది.

“రా లిల్లీ... కూర్చో...” అన్నాడు భేతాళరావు.

లిల్లీ వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి భేతాళరావు ఒళ్ళో కూర్చుంది.

“ఏటదీ పరపురుషుడి ఎదురుగా కూర్చోవడం... లే.. లేచి పక్కన కూర్చో.... విసుక్కున్నాడు భేతాళ రావు.

“పోనీ ఆయనకి చిరాగ్గా ఉంటే మీరు నా ఒళ్ళో కూర్చోవచ్చు....” అన్నాడు చంచల్రావు మొగమాటంగా.