బోనాల సంబరాలు..

 

 

బోనాల సంబరాలు..

 


జంటనగరాలైన హైదరాబాద్,  సికింద్రాబాద్ లలో బోనాల సంబరాలు మొదలయ్యాయి.  తెలంగాణ  రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా జరుపుకునే వేడుక బోనాలు. ప్రతి ఏటా ఆషాడమాసంలో బోనాలు జరపడం ఆనవాయితిగా వస్తోంది.  అదే విధంగా ఈ ఏడాది  జూలై నెల  7 వ తేదీ ఆదివారం గోల్కోండ శ్రీ జగదాంబకి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుక ప్రారంభమయ్యాయి. శ్రీ జగదాంబ అమ్మవారినే గోల్కొండ ఎల్లమ్మగా కూడా పిలుచుకుంటారు.   వేదమంత్రాలు,  ఊరేగింపులు,  శివసత్తులు,  పోతరాజుల నృత్యాల మధ్య బోనాల ప్రారంభం కన్నుల పండువగా జరిగింది.

మొదట గోల్కొండ బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.  ఆ తరువాత సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు జరుగుతాయి. మహిళలు బోనమెత్తుకుని అమ్మవారికి ముక్కులు   చెల్లించుకుంటారు. బోనాల వేడుక వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది.  1813లో హెదరాబాద్,  సికింద్రాబాద్ ప్రాంతంలో ప్లేగు వ్యాధి విజృంభించింది.  ఈ జంటనగరాలలో ప్లేగు వ్యాధి కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానికుడికి అమ్మవారు కలలోకి వచ్చి నాకు బోనాలు సమర్పించడం ఆపేశారు అందుకే ఈ ఉపద్రవాలు జరుగుతున్నాయని అన్నారట.  దాంతో అమ్మవారికి ప్రతి ఏడాది బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.  అమ్మకు బోనాలు సమర్పిస్తే  జంట నగరాల ప్రజల ఆరోగ్యాన్ని ఆ అమ్మ చల్లగా చూస్తుందని నమ్మకం.


నగరాలలో వివధ ప్రాంతాలలో బోనాలు ఒక్కక్క చోట ఒక్కొక్కసారి జరుగుతాయి. ఆషాడమాసం మొదటి ఆదివారం గోల్కొండ కోటలో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.  ఆ తరువాత రెండవ ఆదివారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాంకాళి ఆలయం,  బల్కంపేట లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జరుగుతాయి. మూడవ ఆదివారం చిల్కలగూడ సమీపంలో ఉన్న పోచమ్మ,  కట్ట మైసమ్మ ఆలయం,  లాల్ దర్వాజ్ లోని మాతేశ్వరి ఆలయంలో వేడుకలు జరుగుతాయి. ఇవి మాత్రమే కాకుండా పాతబస్తీలో, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం,  షా అలీ బండలో ముత్యాలమ్మ ఆలయం వంటి ఇతర ఆలయాలలో కూడా బోనాలు చాలా ప్రసిద్ధంగా జరుపుకుంటారు.  ఈ ఆలయాలను,  అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఆలయాలకు తరలి వస్తారు.

మహిళలు సాంప్రదాయ దుస్తులలో బోనాలు ఎత్తుతారు.  తల మీద అన్నం కుండ(దీన్నే బోనం అంటారు.) ఉంటుంది.  దీనికి వేపమండలతో అలంకరించి ఉంటారు.  ఈ కుండను తల మీద మోస్తూ అమ్మవారి నామస్మరణ చేస్తూ డప్పు వాయిద్యాలు,  పోతురాజు నృత్యాల మధ్య ఆలయానికి చేరుకుంటారు.  ఈ క్రమంలో కొందరు మహిళలకు అమ్మవారు ఆవాహన అవుతుంటారు.


బోనాలలో రంగం చాలా ప్రత్యేకమైనది.  కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా దేశం యావత్తు ఈ రంగం గురించి చాలా ఆసక్తిగా ఉంటుంది.  ఒక మహిళకు అమ్మవారు ఆవహించి భవిష్య వాణి చెబుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది జూలై 10 తేదీన బుధవారం ఇది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం నుండి గత ఏడాది జరిగిన తప్పులు, నష్టాల గురించి హెచ్చరిస్తూనే తదుపరి చేయాల్సిన  వాటి గురించి, పరిహారాల గురించి,  భవిష్యత్ గురించి చెబుతుంది.

                                       *రూపశ్రీ.